త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar | కేసీఆర్ రాజీనామాకు ఒత్తిడి తెద్దాం.. ఇందిరా పార్క్ మ‌హాధ‌ర్నాకు త‌ర‌లి రండి

Ponnam Prabhakar | వెయ్యి రోజులుగా ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటూ ఇటు అసెంబ్లీకి రాకుండా, అటు తన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండ‌కుండా కేసీఆర్ వ్య‌వ‌హ‌రించ‌డం స‌రికాద‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ విమ‌ర్శించారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ప్రజాప్రతినిధి తన బాధ్యతలను నిర్వర్తించనప్పుడు ఎమ్మెల్యే పదవిలో కొనసాగడం ఎందుకని ప్ర‌శ్నించారు.

S

Telangana | Published On Sep 5, 2026, 12.56 pm IST

Ponnam Prabhakar | కేసీఆర్ రాజీనామాకు ఒత్తిడి తెద్దాం.. ఇందిరా పార్క్ మ‌హాధ‌ర్నాకు త‌ర‌లి రండి
Advertisement
  • వెయ్యి రోజులుగా జీతం తీసుకుంటూ ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండ‌ట్లేదు
  • ప్ర‌తిప‌క్ష పాత్ర‌నూ నిర్వ‌ర్తించ‌న‌ప్పుడు ఆ ప‌ద‌వి ఎందుకు?
  • మ‌హా ధ‌ర్నా స‌న్నాహ‌క స‌మావేశంలో పొన్నం ప్ర‌భాక‌ర్ డిమాండ్‌

Ponnam Prabhakar | త్రినేత్ర‌.న్యూస్: వెయ్యి రోజులుగా ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటూ ఇటు అసెంబ్లీకి రాకుండా, అటు తన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండ‌కుండా కేసీఆర్ వ్య‌వ‌హ‌రించ‌డం స‌రికాద‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ విమ‌ర్శించారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ప్రజాప్రతినిధి తన బాధ్యతలను నిర్వర్తించనప్పుడు ఎమ్మెల్యే పదవిలో కొనసాగడం ఎందుకని ప్ర‌శ్నించారు. ప్రజా పాలనలో వెయ్యి రోజుల ప్రగతిని వివరిస్తూ.. బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతూ.. రేపు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. కాంగ్రెస్ శ్రేణులు భారీ సంఖ్య‌లో హాజ‌రు కావాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. మహా ధర్నా ఏర్పాట్లపై హైదరాబాద్‌లో శ‌నివారం నిర్వ‌హించిన‌ సన్నాహక సమావేశంలో పొన్నం మాట్లాడారు.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా సమస్యలపై ప్రతిపక్ష నేతగా వ్యవహరించకుండా అసెంబ్లీకి హాజరు కాకపోవడాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి. వెయ్యి రోజులుగా జీతం తీసుకుంటూ ప్రజా సమస్యలను పట్టించుకోరా? కేసీఆర్ తన ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేయాలి. గత రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమాలు నిర్వహించాం.

క్షేత్రస్థాయిలో సంక్షేమ ఫలాలు..

గత బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలనలో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగింది. పదేళ్లలో 100 ఏళ్ల విధ్వంసం జరిగింది. కాంగ్రెస్ ప్రజా పాలనలో సంక్షేమ పథకాల ప్రయోజనాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుతున్నాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు, రైతు సంక్షేమం, విద్య, వైద్యం తదితర రంగాల్లో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించాలి.

భారీగా తరలి రావాలి..

రేపు జరిగే మహా ధర్నాకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు హాజరవుతారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని ప్రతి నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు తరలివచ్చేలా డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇంచార్జిలు సమన్వయం చేయాలి. NSUI, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఫ్రంటల్ ఆర్గనైజేషన్లు పెద్ద సంఖ్యలో పాల్గొని మహా ధర్నాను విజయవంతం చేయాలి.

ఏర్పాట్లను పర్యవేక్షించాలి..

మహా ధర్నా బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఈరోజు సాయంత్రం 4 గంటలకు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద సమావేశమై ఏర్పాట్లను పరిశీలించాలని సూచించాను. డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇంచార్జిలు, NSUI, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఇత‌ర ఆర్గనైజేషన్లను సమన్వయం చేసుకుంటూ మీడియా సమావేశాలు నిర్వహించాలి అని పొన్నం నాయ‌కులకు సూచించారు.

ఈ సమావేశంలో మంత్రి అజారుద్దీన్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీలు మధుయాష్కి గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే నవీన్ యాదవ్, హైదరాబాద్, రంగారెడ్డి, ఖైరతాబాద్, సికింద్రాబాద్ తదితర డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇంచార్జిలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement