త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Karimnagar Govt Hospital | ఆదర్శం: ప్రభుత్వ ఆస్పత్రిలో కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ సతీమణి ప్రసవం

ప్రభుత్వ వైద్యంపై నమ్మకాన్ని పెంచుతూ కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ (IAS) ప్రఫుల్ దేశాయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన సతీమణి ప్రసవం కోసం ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిని ఎంచుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారు.

J

Telangana | Published On Jan 12, 2026, 8.57 pm IST

Karimnagar Govt Hospital | ఆదర్శం: ప్రభుత్వ ఆస్పత్రిలో కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ సతీమణి ప్రసవం

సంక్షిప్త సారాంశం

కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో మున్సిపల్ కమిషనర్ సతీమణి పండంటి పాపకు జన్మనిచ్చారు. కార్పొరేట్ స్థాయి వసతులు ఉండటంతో ఐఏఎస్ అధికారులే ప్రభుత్వ వైద్యం వైపు మొగ్గు చూపుతున్నారు.

Advertisement

Karimnagar Govt Hospital | త్రినేత్ర.న్యూస్ : ప్రభుత్వ వైద్యం అంటే కేవలం సామాన్యులకే కాదు, ఉన్నతాధికారులకు కూడా నమ్మకమైన చిరునామా అని కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ (IAS) ప్రఫుల్ దేశాయ్ నిరూపించారు. తన సతీమణి ప్రసవం కోసం ఖరీదైన ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లకుండా, కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిని ఎంచుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారు. సోమవారం జరిగిన ఈ ప్రసవంలో ఆయన సతీమణి పండంటి పాపకు జన్మనిచ్చారు.

ప్రభుత్వ వైద్యంపై పెరుగుతున్న విశ్వాసం

తెలంగాణలో ప్రభుత్వ ఆస్పత్రులు కార్పొరేట్ వైద్యానికి దీటుగా మారుతున్నాయి. అత్యాధునిక పరికరాలు, అనుభవజ్ఞులైన వైద్యులతో పేదవారికి అండగా నిలుస్తున్న ఈ ఆస్పత్రులపై ఇప్పుడు ఉన్నతాధికారుల్లోనూ నమ్మకం పెరుగుతోంది. ఆదివారం రోజున ఉమ్మనీరు తగ్గడంతో కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తన భార్యను కరీంనగర్ మాతా శిశు సంరక్షణ కేంద్రం (MCH)లో చేర్పించారు.

విజయవంతంగా ప్రసవం

సోమవారం ఉదయం ఆస్పత్రి గైనకాలజిస్ట్ హెచ్ఓడీ డాక్టర్ పద్మజ నేతృత్వంలోని వైద్య బృందం కమిషనర్ సతీమణికి శస్త్రచికిత్స నిర్వహించారు. అనుభవజ్ఞులైన డాక్టర్లు దీప, సంగీత, సుహాసిని, అనస్థీసియా నిపుణులు శంతన్, సంగీత, నర్సింగ్ సిబ్బంది సమన్వయంతో ప్రసవం విజయవంతమైంది. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

కలెక్టర్, వైద్యాధికారుల అభినందనలు

సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు ప్రభుత్వ సేవలను వినియోగించుకోవడం వల్ల సామాన్యుల్లో ఉన్న అపోహలు తొలగిపోతాయని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ దంపతులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ వీరారెడ్డి, ఆర్ఎంఓ నవీనా, ఇతర వైద్యాధికారులు కమిషనర్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

సమాజానికి గొప్ప సందేశం

గతంలోనూ పలువురు ఐఏఎస్ అధికారులు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చికిత్స పొంది వార్తల్లో నిలిచారు. ఇప్పుడు కరీంనగర్ కమిషనర్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రభుత్వ వైద్య వ్యవస్థ బలోపేతానికి మరో సంకేతంగా నిలుస్తుంది. సామాన్య ప్రజలు కూడా ప్రైవేట్ ఆస్పత్రుల వైపు వెళ్ళి ఆర్థికంగా నష్టపోకుండా, ప్రభుత్వ వైద్య సేవలను ధైర్యంగా వినియోగించుకోవాలని ఈ ఉదంతం తెలియజేస్తోంది.

Advertisement

తాజావార్తలు

Advertisement