త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kaleshwaram Temple | కాళేశ్వ‌ర ఆల‌య పున‌ర్‌నిర్మాణం.. ఈ నెల 17న ప‌నులు ప్రారంభం

Kaleshwaram Temple | రాష్ట్రంలోని మ‌హా శైవక్షేత్రాలలో ఒక్కటైన పుణ్యక్షేత్రం కాళేశ్వరం (Kaleshwaram Temple). భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారం కాళేశ్వర-ముక్తీశ్వరులు. ఈ పురాత‌న ఆల‌యాన్ని పునఃనిర్మించాల‌ని (Reconstruction) ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

G

Telangana | Published On Jun 6, 2026, 8.50 am IST

Kaleshwaram Temple | కాళేశ్వ‌ర ఆల‌య పున‌ర్‌నిర్మాణం.. ఈ నెల 17న ప‌నులు ప్రారంభం
Advertisement

Kaleshwaram Temple | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలోని మ‌హా శైవక్షేత్రాలలో ఒక్కటైన పుణ్యక్షేత్రం కాళేశ్వరం (Kaleshwaram Temple). భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారం కాళేశ్వర-ముక్తీశ్వరులు. అతిప్రాచీన చరిత్ర గల కాళేశ్వర క్షేత్రానికి అనేక ప్రత్యేకతలున్నాయి. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలో ఉన్న ఈ ఆల‌యం దక్షిణ కాశీగా పేరుగాంచింది. ఇక్క‌డ ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఒకే పానవట్టంపై రెండు శివలింగాలు ఉంటాయి. గర్భగుడికి నాలుగుదిక్కులా నాలుగు నంది విగ్రహాలు, నాలుగు ధ్వజస్తంభాలు, నాలుగు గోపురాలు ఉండటం ఇక్క‌డి ప్రత్యేకత. ఈ పురాత‌న ఆల‌యాన్ని పునఃనిర్మించాల‌ని (Reconstruction) ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. దీనికి సంబంధించిన ప‌నుల‌ను ఈ నెల 178న ఉద‌యం 8.15 గంట‌ల‌కు ప్రారంభించ‌నుంది. పాత ఆల‌యాలను తొల‌గించి శృంగేరీ పీఠం అనుమ‌తితో సుమారు రూ.198 కోట్ల‌తో క్షేత్రంలో రాతిక‌ట్ట‌డాల‌ను పునఃనిర్మించ‌నుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సంబంధించి ఏప్రిల్ 20న సీఎం రేవంత్‌ రెడ్డి భూమిపూజ చేసిన విషయం తెలిసిందే.

కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తేశ్వర ఆలయానికి పడమటి వైపు యమగుండం మీద సుమారు ఒక కిలోమీటర్ దూరంలో ఆదిముక్తీశ్వరాలయం ఉంది. ఈ ఆలయం చుట్టుప్రక్కల ప్రకృతి సిద్ధంగా విభూతి రాళ్లు లభించడం విశేషం. కాళేశ్వరంలో తొలి దేవాలయమిదే అని అర్చకులు చెబుతారు. కాళేశ్వరుడు ఏర్పడకముందు.. ముక్తేశ్వరుడుగా పరమేశ్వరుడు కొలువుదీరిన ప్రాంతంగా ఇది విరాజిల్లుతోంది. ఈ ఆలయంలో పంచాయతన విధానంలో పూజలు జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్న ముక్తేశ్వరుడికి కూడా రెండు నాసికారంధ్రాలు ఉండడం విశేషం. ఈ ఆలయ పరిసర ప్రాంతాలలో ఎక్కడ త్రవ్వినా ఎర్రని రంగు గల మట్టిరాళ్లు దొరుకుతాయి. ఈ రాళ్ళను పగులగొడితే దానిలో పరిమళ భరితమైన మెత్తని భస్మము ఉంటుంది. అందుకే ప్రకృతిసిద్ధ విభూతి రాళ్ల క్షేత్రంగా ఈ ఆలయానికి పేరుంది. ఇక్కడ పవిత్ర స్నానాలు ఆచరించడంతో పాటుగా వైదిక కార్యాలు నిర్వహిస్తుంటారు.

విశిష్ట క్షేత్రం..

కాళేశ్వర క్షేత్రం పితృదేవతలకు పిండ ప్రదానం చేసేందుకు విశిష్టమైన క్షేత్రం. కాశికి వెల్లలేని వాళ్ళు కాళేశ్వరంలోని గోదావరి-ప్రాణహిత-సరస్వతి నదుల త్రివేణి సంగమ స్థానంలో వైదిక కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. ఇక్కడ చేసే ఈ కార్యక్రమాలు కాశిలో జరిపించినంత పుణ్యాన్ని ప్రాప్తింప చేస్తాయని చెప్తారు. అదేవిధంగా శ్రీ కాళహస్తి తరువాత కాలసర్ప, శనిదోష నివారణ పూజలకు కాళేశ్వర క్షేత్రం ప్రసిద్ధి పొందింది. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో కాలసర్పదోష నివారణ పూజలు, నవగ్రహాలయంలో శనిదోష నివారణకు శనిపూజలను నిర్వహిస్తున్నారు.

కాళేశ్వర, ముక్తీశ్వర స్వాముల వార్ల ఆలయానికి సరస్వతీ దేవాలయం, సూర్య దేవాలయం, ఆది ముక్తీశ్వరాలయాలతో కూడిన పరివార ఆలయ సముదాయం ఉంది. దేశంలో సూర్యదేవాలయాలలో ఒకటి కాళేశ్వరం, మరొకటి కోణార్క్, ఇంకొకటి అరసవల్లిలో ఉన్నాయి. సరస్వతి అమ్మవారికి దేశంలో మూడు ఆలయాలున్నాయి. ఒకటి కాళేశ్వరంలో మహా సరస్వతి, రెండోది బాసరలో జ్ఞాన సరస్వతి, మూడోది కాశ్మీరులో బాలసరస్వతి ఆలయం ఉంది.

Advertisement
Advertisement