త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | గోదావ‌రి, కృష్ణా జ‌లాలను పారిస్తాం.. ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లాను స‌స్య‌శ్యామ‌లం చేస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | గ‌త పాల‌కుల నిర్ల‌క్ష్యానికి ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా బ‌లైంది.. సాగునీరు లేక రైతులు త‌ల్ల‌డిల్లిపోతున్నారు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గోదావ‌రి జ‌లాల‌ను చేవెళ్ల‌, తాండూరు, ప‌రిగి నియోజ‌క‌వ‌ర్గాల్లో పారిస్తామ‌ని సీఎం తేల్చిచెప్పారు.

S

Telangana | Published On Feb 7, 2026, 6.34 pm IST

CM Revanth Reddy | గోదావ‌రి, కృష్ణా జ‌లాలను పారిస్తాం.. ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లాను స‌స్య‌శ్యామ‌లం చేస్తాం :  సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

బీజేపీ - బీఆర్ఎస్ చీక‌టి ఒప్పందాలు..
కాంగ్రెస్‌ను ఓడించేందుకు కుట్ర‌లు..
ప్ర‌జాపాల‌న - ప్ర‌గ‌తి బాట స‌భ‌లో సీఎం రేవంత్ వ్యాఖ్య‌లు

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : గ‌త పాల‌కుల నిర్ల‌క్ష్యానికి ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా బ‌లైంది.. సాగునీరు లేక రైతులు త‌ల్ల‌డిల్లిపోతున్నారు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గోదావ‌రి జ‌లాల‌ను చేవెళ్ల‌, తాండూరు, ప‌రిగి నియోజ‌క‌వ‌ర్గాల్లో పారిస్తామ‌ని సీఎం తేల్చిచెప్పారు. మూడేండ్ల‌లోనే మ‌క్త‌ల్ - నారాయ‌ణ‌పేట - కొడంగ‌ల్ ఎత్తిపోత‌ల పూర్తి చేసి ల‌క్షా 50 వేల ఎక‌రాల‌కు సాగునీరు అందిస్తామ‌ని రేవంత్ మాటిచ్చారు. వికారాబాద్ జిల్లా పరిగిలో ఏర్పాటు చేసిన‌ ప్రజా పాలన- ప్రగతి బాట బహిరంగ సభలో సీఎం రేవంత్ పాల్గొని ప్ర‌జ‌ల‌నుద్దేశించి ప్ర‌సంగించారు.

కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన రెండేండ్ల కాలంలోన‌ ఎన్నో సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నాం. గ‌త పాల‌కులు చేసిన త‌ప్పుల‌ను స‌రిదిద్దుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి ప‌థాన న‌డిపించే ప్ర‌య‌త్నం చేస్తున్నాం. మున్సిపాలిటీల‌ను కేసీఆర్ ప‌ట్టించుకోలేదు. కేంద్రంలో 12 ఏళ్లు అధికారంలో ఉన్న మోదీ కూడా ప‌ట్ట‌ణాల‌ను బాగు చేయ‌లేదు. బీజేపీ నేత‌లు మోదీని చూసి ఓటేయండి అని అడుగుతున్నారు. పెళ్లి పెద్ద‌ను చూసి పిల్ల‌నిస్తే.. పిల‌గాడు ప‌నికిరానోడు అయితే సంసారం చేసేదే ఎవ‌రు అని అడుగుతున్నాను. పెళ్లి పెద్ద మంచి చెడ్డ చెప్ప‌డానికే ఉంట‌డు కానీ సంసారం చేయాల్సింది.. కుటుంబాన్ని న‌డ‌పాల్సింది పెళ్లి పిల‌గాడే త‌ప్ప పెళ్లి పెద్ద కాదు. కాబ‌ట్టి ఈ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో మ‌నోళ్ల‌నే కార్పొరేట‌ర్లుగా, కౌన్సిల‌ర్లుగా గెలిపించుకోవాలి. బీజేపీ కౌన్సిల‌ర్లు, కార్పొరేట‌ర్ల‌ను గెలిపిస్తే.. ఈ గ‌ల్లీలో ఉండే బోడిగాడు ప‌ని చేయ‌క‌పోతే మ‌నం పోయి మోదీని అడ‌గ‌గ‌ల‌మా..? అని సీఎం ప్ర‌శ్నించారు.

బీఆర్ఎస్ ఆఫీసుల్లో బీజేపోళ్ల‌కు బీ ఫామ్స్

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయింది. ఆ త‌ర్వాత జ‌రిగిన ఎంపీ ఎన్నిక‌ల్లో గుండు సున్నా వ‌చ్చింది. మొన్న జ‌రిగిన స‌ర్పంచ్ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్‌ను బొంద‌తీసి పాతిపెట్టారు. ఈ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌తో పోటీ ప‌డ‌డం మా వ‌ల్ల కాద‌ని.. బీజేపోళ్ల‌ను అరువు తెచ్చుకున్నారు. బీజేపోళ్ల‌కు బీఆర్ఎస్ ఆఫీసుల్లో బీఫామ్స్ ఇస్తున్నారు. ఎన్నిక‌ల్లో నిల‌బ‌డి కొట్లాడాలి.. కానీ చీక‌టి ఒప్పందాలు చేసుకోని కాంగ్రెస్‌ను ఓడించాల‌ని కుట్ర‌లు చేస్తున్నార‌ని రేవంత్ రెడ్డి మండిప‌డ్డారు.

రంగారెడ్డి జిల్లాకు చుక్క నీరు ఇవ్వ‌లేదు..

చేవెళ్ల, తాండూరు, ప‌రిగి, వికారాబాద్ ప్రాంతానికి గోదావ‌రి జ‌లాలు తీసుకురావాలి.. ఎడారిగా మారిన మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి.. ఎల్ల‌కాలం మేం క‌ల్తీ క‌ల్లు తాగాల్సిందేనా..? మేం కందులు పండించుకోని బ‌త‌కాల్సిందేనా..? అని ఈ ప్రాంత రైతాంగం నాడు వైఎస్సార్‌ను నిల‌దీశారు. 2009 ఎన్నిక‌ల సంద‌ర్భంగా గోదావ‌రి జ‌లాల‌ను ఈ ప్రాంతానికి తీసుకువ‌స్తామ‌ని వైఎస్సార్ మాటిచ్చారు. ఆ మాట ప్ర‌కారం ప్రాణ‌హిత - చేవెళ్ల ప్రాజెక్టుకు రూ. 30 వేల కోట్ల‌తో రూప‌క‌ల్ప‌న చేసి శిలాఫ‌ల‌కం వేశారు. ఈ ప్రాజెక్టు కింద 14 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు నీళ్లు ఇవ్వాల‌ని సంక‌ల్పించారు. కేసీఆర్ తెలంగాణ సీఎం అయ్యాక రంగారెడ్డి జిల్లాకు గోదావ‌రి జ‌లాలు ఇచ్చేది లేద‌ని మ‌ల్ల‌న్న సాగ‌ర్, కొండ‌పోచ‌మ్మ సాగ‌ర్, రంగ‌నాయ‌క సాగ‌ర్ వంటి ప్రాజెక్టుల‌ను మెద‌క్ జిల్లాలో క‌ట్టుకున్నారు. కానీ రంగారెడ్డి జిల్లాకు చుక్క‌నీరు ఇవ్వ‌కుండా ప్రాజెక్టుల‌ను ప‌డావుపెట్టారు. చేవెళ్ల చౌర‌స్తా వ‌ద్ద ఇప్ప‌టికీ ప్రాణ‌హిత - చేవెళ్ల శిలాఫ‌ల‌కం క‌నిపిస్త‌ది. అక్క‌డ చేప‌ట్టిన అండ‌ర్ గ్రౌండ్ ట‌న్నెల్ ప‌నులు నిలిచిపోయాయ‌ని రేవంత్ గుర్తు చేశారు.

300 టీఎంసీలు ఇస్తే 30 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు సాగునీరు వ‌చ్చేది క‌దా..?

గోదావ‌రిలోని 3 వేల టీఎంసీలు స‌ముద్రంలో వృథాగా క‌లుస్తున్నాయ‌ని కేసీఆర్ నిండు శాస‌న‌స‌భ‌లో చెప్పారు. ఎన్ని నీళ్లు అయినా వాడుకోవ‌చ్చు.. ఎన్ని నీళ్లు అయినా పారించుకోవ‌చ్చు అని కేసీఆర్ అన్నారు. చంద్ర‌బాబు నాయుడు మీకు సూచ‌న చేస్తున్నా.. మాది ఎత్తుప‌ల్లాలు ఉంది.. కానీ మీది బాగుంది.. శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం నుంచి మొద‌లుపెడితే చిత్తూరు, నెల్లూరు నాయుడిపేట వ‌ర‌కు గోదావ‌రి జ‌లాలు తీసుకెళ్లు అని ఈ మొన‌గాడు ఆయ‌న‌కు స‌ల‌హాలు చెప్ప‌బోయిండు. ఆయ‌న‌కు స‌ల‌హా ఎందుకు చెప్పిన‌వు అని నేను అడుగుత‌లేను. 3 వేల టీఎంసీలు స‌ముద్రంలో క‌లుస్తుంటే క‌ళ్లు అప్ప‌గించి చూశావు కానీ.. అందులో 300 టీఎంసీలు మా రంగారెడ్డి జిల్లాకు ఇస్తే 30 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు ఇవాళ సాగునీరు వ‌చ్చి ఉండేది క‌దా..? ఏం పాపం చేశారు రంగారెడ్డి జిల్లా ప్ర‌జ‌లు. ఇవాళ తాగు, సాగు నీరు కోసం అల్లాడుతున్నారు. ఇది మీరు మాకు చేసిన ద్రోహం కాదా అని అడుగుతున్నాను. స‌మైక్య పాల‌న‌లో సీమాంధ్ర పాల‌కులు మ‌న‌కు ప్రాజెక్టుల‌ను మంజూరు చేశారు. ప‌క్క రాష్ట్ర‌మోడు మ‌న‌కు నిధులు ఇచ్చి అనుమ‌తులు ఇస్తే సొంత రాష్ట్రంలో పుట్టిపెరిగి ఉద్య‌మ‌కారుడు అని చెప్పుకునే కేసీఆర్ రంగారెడ్డి జిల్లాకు గోదావ‌రి జ‌లాలు రాకుండా ఎందుకు అడ్డుకున్నారో స‌బితా ఇంద్రారెడ్డి స‌మాధానం చెప్పాలి. రంగారెడ్డి జిల్లా అభివృద్ధి కోస‌మే పార్టీ ఫిరాయిస్తున్న అని చెప్పిన స‌బిత.. చేవెళ్ల ప్రాజెక్టుకు ఎందుకు అనుమ‌తులు, నిధులు తీసుకురాలేదో స‌మాధానం చెప్పాలి. మీరు చేసిన ద్రోహానికి ఈ ప్రాంత ప్ర‌జ‌ల‌ను క‌లిసి ఓటు అడిగే నైతిక అర్హ‌త స‌బిత‌కు లేద‌ని రేవంత్ అన్నారు.

గోదావ‌రి జ‌లాలు తీసుకొచ్చి స‌స్య‌శ్యామ‌లం చేస్తాం..

చంద్ర‌శేఖ‌ర్ రావు ఎట్ల‌గూ మ‌నోడు కాదు.. ప‌రాయోడే. చంద్ర‌శేఖ‌ర్ రావు ప‌క్క‌చూపులే చూస్త‌డు.. ప‌క్క రాష్ట్రం కోస‌మే ప‌ని చేస్త‌డు. రోజ‌మ్మ పెట్టిన రొయ్య‌ల పులుసు తిని రాయ‌ల‌సీమ‌ను ర‌త‌నాల సీమ చేస్తాన‌ని చెప్పిండు. రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్‌ను గెలిపిస్తే.. గోదావ‌రి జ‌లాల‌ను మ‌న‌కు తీసుకొస్తా అని చెప్ప‌లేదు. పాల‌మూరు రంగారెడ్డి పూర్తి చేసి నీళ్లు ఇస్తాన‌ని చెప్పి ల‌క్ష్మీదేవిప‌ల్లి వ‌ద్ద రిజ‌ర్వాయ‌ర్ పూర్తి చేయ‌లేదు. ఇది ఎత్తైన ప్రాంతం.. ఇక్క‌డ రిజ‌ర్వాయ‌ర్ క‌డితే రంగారెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాల‌కు సాగు నీళ్లు వ‌స్తాయ‌ని కేసీఆర్ చెప్పిండు.. కానీ ఎందుకు క‌ట్ట‌లేదు..? త్వ‌ర‌లోనే ల‌క్ష్మీదేవిప‌ల్లి వ‌ద్ద భూసేక‌ర‌ణ చేసి రిజ‌ర్వాయ‌ర్‌ను క‌డుతాం. అవ‌స‌ర‌మైన ప్ర‌ణాళిక‌ల‌ను సిద్ధం చేస్తున్నాం. కేసీఆర్ నిర్ల‌క్ష్యానికి రంగారెడ్డి జిల్లా బ‌లైంది. కాళేశ్వ‌రం ప్రాజెక్టు వ‌ల్ల కేసీఆర్ కుటుంబానికి వేల కోట్ల వ్యాపారాలు, ఫామ్ హౌస్‌లు వ‌చ్చాయి కానీ మాకు గోదావ‌రి జ‌లాలు రాలేదు. ఈ ప్రాంతానికి చెందిన వ్య‌క్తులుగా.. తెలంగాణ సీఎంగా నేను, స్పీక‌ర్‌గా గ‌డ్డం ప్రసాద్ కుమార్.. ఇద్ద‌రం మాటిస్తున్నాం.. ఈ ప్రాంతానికి గోదావ‌రి జ‌లాల‌ను తీసుకొచ్చి స‌స్య‌శ్యామ‌లం చేసే బాధ్య‌త మాది. కొడంగ‌ల్ - నారాయ‌ణ‌పేట - మ‌క్త‌ల్ ఎత్తిపోత‌ల ప‌థ‌కాన్ని ఉమ్మ‌డి రాష్ట్రంలోనే మంజూరు చేయించుకున్నాం. కానీ కేసీఆర్ కుట్ర చేసి తొక్కిపెట్టారు. ఈ ప్రాజెక్టును మూడేండ్ల‌లో పూర్తి చేసి.. మ‌క్త‌ల్, నారాయ‌ణ‌పేట‌, కొండ‌గ‌ల్ నియోజ‌క‌వ‌ర్గాల్లో కృష్ణా న‌దీ జ‌లాల‌ను ల‌క్షా 50 వేల ఎక‌రాల‌కు పారిస్తాం అని రేవంత్ మాటిచ్చారు.

అంత‌ర్జాతీయ ప‌ర్యాట‌క కేంద్రంగా వికారాబాద్

అప్పా జంక్ష‌న్ నుంచి మ‌న్నెగూడ వ‌ర‌కు రోడ్డు ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. ఔట‌ర్ రింగ్ రోడ్డు వ‌చ్చిన త‌ర్వాత రంగారెడ్డి జిల్లాలో ఉన్న భూముల‌కు రెక్క‌లొచ్చాయి. వంద కోట్ల‌కు కూడా భూమి దొర‌క‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. కేంద్ర ప్ర‌భుత్వంతో మాట్లాడి 360 కిలోమీట‌ర్ల మేర ట్రిపుల్ ఆర్ మంజూరు చేయించాం. త్వ‌ర‌లోనే రేడియ‌ల్ రోడ్డు రాబోతుంది. వికారాబాద్ అంత‌ర్జాతీయ ప‌ర్యాట‌క కేంద్రంగా మార‌బోతోంది. ఇక మూసీని అభివృద్ధి చేద్దామంటే బీఆర్ఎస్, బీజేపోళ్లు అడ్డుప‌డుతున్నారు అని రేవంత్ రెడ్డి మండిప‌డ్డారు.

Advertisement
Advertisement