త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gadari Kishore | రేవంత్ న‌డిపేది స‌ర్కారా.. స‌ర్క‌సా?.. మాకైతే అర్థమైత‌లే

Gadari Kishore | సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ నడుపుతున్నారో సర్కస్ నడుపుతున్నారో అర్థం కావడం లేద‌ని మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ కుమార్ విమ‌ర్శించారు. ప్రభుత్వం చేసే ప్రతి దాంట్లో అవినీతి జరుగుతోందన్నారు. రంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రయివేటు భూములను ప్రోహిబిటెడ్‌లో పెట్టి బేరం మాట్లాడుకుంటున్నారని చెప్పారు.

S

Telangana | Published On Jul 4, 2026, 1.38 pm IST

Gadari Kishore | రేవంత్ న‌డిపేది స‌ర్కారా.. స‌ర్క‌సా?.. మాకైతే అర్థమైత‌లే
Advertisement
  • భూ భార‌తిలో కోటి ఎక‌రాలు ప్రొహిబిటెడ్ లిస్ట్‌లో పెట్టి బేరం మాట్లాడుకున్న‌రు
  • సీఎం, పొంగులేటి, ఢిల్లీకి 10 శాతం చొప్పున క‌మీష‌న్లు వెళ్తున్న‌య్‌
  • ఈ విష‌యం కాంగ్రెస్ ఎమ్మెల్యేనే చెప్పిండు
  • అక్ర‌మాల్లో రేవంత్ స‌తీమ‌ణి పాత్ర‌పై అనుమానాలున్న‌య్‌
  • పొంగులేటి బీజేపీ వైపు చూస్తున్న‌డు
  • ఇగ పీసీసీ చీఫ్ పని బాలేద‌ని సీఎంయే అంటున్న‌డు
  • మీడియా స‌మావేశంలో మాజీ ఎమ్మెల్యే గ్యాద‌రి కిశోర్ తీవ్ర విమ‌ర్శ‌లు

Gadari Kishore | త్రినేత్ర‌.న్యూస్‌: సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ నడుపుతున్నారో సర్కస్ నడుపుతున్నారో అర్థం కావడం లేద‌ని మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ కుమార్ విమ‌ర్శించారు. ప్రభుత్వం చేసే ప్రతి దాంట్లో అవినీతి జరుగుతోందన్నారు. భూ భారతిలో కోటి ఎకరాలను ప్రొహిబిటెడ్ లిస్ట్‌లో పెట్టారన్నారు. రంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రయివేటు భూములను ప్రోహిబిటెడ్‌లో పెట్టి బేరం మాట్లాడుకుంటున్నారని చెప్పారు. 30 శాతం కమీషన్లు తీసుకుని భూ భారతిలో మార్పులు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్‌కు 10 శాతం, పొంగులేటికి 10 శాతం, ఢిల్లీకి 10 శాతం కమీషన్లు ఇస్తున్నారని దుయ్య‌బ‌ట్టారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేనే చెప్పారని గుర్తు చేశారు. తెలంగాణ భ‌వ‌న్‌లో శ‌నివారం ఆయన మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ స‌ర్కార్‌పై తీవ్ర స్థాయిలో ఆరోప‌ణ‌లు చేశారు.

సిద్దిపేట జిల్లాలో 80 పేర్లు అప్రూవ్ అయ్యాయి..

రాష్ట్ర వ్యాప్తంగా 4,500 అప్లికేషన్లు ఎవరికి సంబంధం లేకుండా భూ భారతిలో అప్రూవ్ అయ్యాయి. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లిలో 80 పేర్లు అప్రూవ్ అయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో నాళా కన్వర్షన్ అప్లికేషన్ పెట్టకుండా అప్రూవ్ అయింది. కోట్ల విలువ చేసే భూములను తమకు అనుకూలంగా అప్రూవ్ చేసుకుంటున్నారు. రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏం చేస్తున్నారు? వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాదని తెలిసి పొంగులేటి బీజేపీ వైపు చూస్తున్నారు. బీజేపీ సంప్రదింపుల్లో ఆయ‌న బిజీగా ఉన్నారు అని గ్యాద‌రి కిశోర్‌ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

సీఎం స‌తీమ‌ణి ప్ర‌భుత్వ వ్య‌వ‌హారాల్లో జోక్యం చేసుకుంటున్న‌రు..

ఇంతకుముందు అలీ బాబా 40 మంది ఇప్పుడు భార్య, భర్తలు మాత్రమే. సీఎం రేవంత్ రెడ్డి సతీమణికి ముగ్గురు ఓఎస్డీలు ఉన్నారు. ఆమె కూడా ప్రభుత్వ వ్యవహారాల్లో తల దూరుస్తున్నారు. అక్రమాల్లో సీఎం సతీమణి పాలుపంచుకుంటున్నారనే అనుమానాలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రికి తెలియకుండా బ‌దిలీలు జరుగుతున్నాయి. టీ శాట్‌ను ఐటీ డిపార్ట్మెంట్ నుంచి తొలగించి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్‌కు బదిలీ చేసి సీఎం తనకు కావాల్సిన వ్యక్తికి ఎక్స్టెన్షన్ జీవో ఇచ్చారు. శ్రీధర్ బాబుకు అలాంటి పరిస్థితి ఎదురైతే మంత్రి పదవికి రాజీనామా చేయాలి కదా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

ధరణిలో డిజిటల్ సిగ్నేచర్ లేకుండా భూమి మార్పిడి అయ్యే అవకాశం లేకుండా కేసీఆర్ చట్టం తెచ్చారు. భూ భారతి ద్వారా తన సంబంధీకులకు భూములు కట్టబెట్టే కుట్ర జరుగుతోంది. జూపల్లి కృష్ణారావును మారుస్తారని అనగానే సవాళ్లు విసురుతున్నారు. కోమటిరెడ్డిని తొలగించి తమ్ముడికి మంత్రి పదవి ఇస్తారని అనగానే నల్గొండలో మీటింగ్ పెట్టి విమర్శలు చేస్తున్నారు. భట్టి విక్రమార్క సోది ఉపన్యాసం మాట్లాడుతున్నారు. భూ భారతి అప్లికేషన్ల అప్రూవల్ వెనుక రేవంత్ రెడ్డి, కుటుంబ సభ్యుల పాత్ర ఉందని మాకు అనుమానం కలుగుతోంది అని కిశోర్ అన్నారు.

రేపు కన్నేపల్లికి బీఆర్ఎస్ బృందం వెళ్తుంది..

రేవంత్ రెడ్డి తనకు హిట్లర్ ఆదర్శం అంటారు. మరి అదే హిట్లర్ మానసిక సంఘర్షణకు గురై ఆత్మహత్య చేసుకున్నారు. రేవంత్ రెడ్డి హిట్లర్‌లా ఏదైనా అఘాయిత్యం చేసుకోవాలని మేం కోరుకోవడం లేదు. ఏసీబీ దాడుల్లో ఒక వర్గం వారికి ఒక న్యాయం రేవంత్ రెడ్డి సామాజిక వర్గం వారికి మరో న్యాయం జ‌రుగుతోంది. ఏసీబీ చరిత్రలో రైడ్స్ జరిగిన తర్వాత అరెస్టు చేయకుండా వదిలిపెట్టారు. కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీళ్లను లిఫ్ట్ చేసి రైతులకు ఎందుకు ఇవ్వడం లేదు. రేపు కన్నేపల్లికి బీఆర్ఎస్ బృందం వెళ్తుంది అని గ్యాద‌రి తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డికి రకరకాల పేర్లు ఉన్నాయి. ధరణి తీసివేసి భూ భారతి పెట్టారు. భూ భారతిలో దొంగలు ఎవరో చెప్పాలి. ప్రభుత్వ పెద్దలా? అధికారులా? అదృశ్య శక్తులు ఎవరైనా ఉన్నారా? కేసీఆర్ సీఎం అయిన తర్వాత రైతులు ఎవరు అనేది డిసైడ్ చేయడానికి ధరణి తెచ్చారు. 20 ఏళ్ల‌లో రేవంత్ రెడ్డి ఏ పాత్ర చేసినా ప్రతిపక్ష పాత్ర పోషించారు. సీఎం అయ్యాక రేవంత్ రెడ్డికి పరిపాలనపై అవగాహన లేదు. రియల్ ఎస్టేట్ దందా తప్ప ఆయ‌న‌కు ఏం తెల్వ‌దు అని ఎద్దేవా చేశారు.

హైడ్రాతో సెటిల్‌మెంట్లే జ‌రుగుతున్న‌య్‌..

హైడ్రాతో సెటిల్‌మెంట్లు తప్ప ఏం జరగడం లేదు. గత ప్రభుత్వంలో కోర్టు కేసుల్లో ఉన్న భూములను మాత్రమే బీ కేటగిరీలో పెట్టాం. నిరుద్యోగుల డిమాండ్లపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్‌ గౌడ్ అర్థరహితంగా మాట్లాడుతున్నారు. పీసీసీ చీఫ్ పని తీరు బాగోలేదని సీఎం అంటున్నారు. గాంధీ భవన్‌ను బార్‌లా మార్చారని కాంగ్రెస్ వాళ్లే పీసీసీ చీఫ్ గురించి మాట్లాడుతున్నారు అని మాజీ ఎమ్మెల్యే గ్యాద‌రి పేర్కొన్నారు.

ఈ ప్రెస్ మీట్‌లో బీఆర్ఎస్ నేతలు పల్లా ప్రవీణ్, ధర్మేందర్, పడాల సతీష్, కడారి స్వామి యాదవ్, కృష్ణ, మిథున్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement