త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold Monetisation Scheme | ఇక‌పై బంగారాన్ని డిపాజిట్ చేసి వ‌డ్డీ పొందొచ్చు.. కొత్త స్కీమ్ ప్ర‌వేశ‌పెట్ట‌నున్న కేంద్రం..?

Gold Monetisation Scheme | ఇకపై బ్యాంక్ లాకర్‌లో బంగారం భద్రపరచినట్లే దేశంలోని జ్యువెలర్ల (బులియన్ ట్రేడర్లు) వద్ద కూడా మీ బంగారాన్ని డిపాజిట్ చేసే అవకాశం అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా, డిపాజిట్ చేసిన బంగారంపై సంవత్సరానికి 2.25 నుంచి 2.5 శాతం వరకు వడ్డీ కూడా పొందే అవకాశం ఉంటుంది.

S

Business | Published On Jul 4, 2026, 1.54 pm IST

Gold Monetisation Scheme | ఇక‌పై బంగారాన్ని డిపాజిట్ చేసి వ‌డ్డీ పొందొచ్చు.. కొత్త స్కీమ్ ప్ర‌వేశ‌పెట్ట‌నున్న కేంద్రం..?
Advertisement

Gold Monetisation Scheme | ఇకపై బ్యాంక్ లాకర్‌లో బంగారం భద్రపరచినట్లే దేశంలోని జ్యువెలర్ల (బులియన్ ట్రేడర్లు) వద్ద కూడా మీ బంగారాన్ని డిపాజిట్ చేసే అవకాశం అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా, డిపాజిట్ చేసిన బంగారంపై సంవత్సరానికి 2.25 నుంచి 2.5 శాతం వరకు వడ్డీ కూడా పొందే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం వచ్చే రెండు వారాల్లో కొత్తగా అప్‌డేట్ చేసిన గోల్డ్ మోనిటైజేషన్ స్కీమ్ (జీఎంఎస్)ను ప్రకటించే అవకాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. కొత్త స్కీమ్‌లో దేశవ్యాప్తంగా ఉన్న బులియన్ ట్రేడర్లను కలెక్షన్ పార్ట్నర్స్ గా చేర్చే ప్రతిపాదనను ప‌రిశీలిస్తున్నారు. దీంతో సాధారణ ప్రజల నుంచి బంగారాన్ని వారు స్వీకరించగలుగుతారు. ఇప్పటి వరకు ఈ బాధ్యత కేవలం బ్యాంకులకు మాత్రమే ఉండేది. ఈ కొత్త విధానం ద్వారా దేశంలోని ఇళ్లలో నిల్వ ఉన్న బంగారం సేకరణ వేగవంతం అవుతుందని ఆల్ ఇండియా జ్యువెలర్స్ అండ్ గోల్డ్స్మిత్స్ ఫెడరేషన్ (ఏఐజీజీఎఫ్) పేర్కొంది. ఈ మార్పుతో మార్కెట్ నుంచి 1వేయి టన్నులకుపైగా బంగారాన్ని సమీకరించే అవకాశం ఉందని సంస్థ అంచనా వేస్తోంది.

90 బిలియ‌న్ డాల‌ర్ల లిక్విడిటీ అందుబాటులోకి..

దేశంలోని బులియన్ ట్రేడర్లు, జ్యువెలరీ సంఘాలు ఈ స్కీమ్ నిబంధనల్లో మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని చాలా కాలంగా కోరుతున్నాయి. దేశంలో బంగారం డిమాండ్‌పై లేదా ఈ రంగంపై ఆధారపడిన వారి జీవనోపాధిపై ప్రతికూల ప్రభావం లేకుండా, విదేశాల నుంచి బంగారం దిగుమతులను తగ్గించేలా స్కీమ్‌ను రూపొందించాలని వారు సూచించారు. భారతీయ కుటుంబాల వద్ద ఉన్న మొత్తం బంగారంలో కేవలం 5 శాతం మాత్రమే ఈ కొత్త స్కీమ్‌లో డిపాజిట్ చేసినా, దేశ ఆర్థిక వ్యవస్థలో సుమారు 90 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.8.57 లక్షల కోట్లు) విలువైన లిక్విడిటీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రధానమంత్రి న‌రేంద్ర మోదీ ఇటీవల దేశ ప్రజలు ఒక సంవత్సరం పాటు బంగారం కొనుగోలు చేయకుండా ఉండాలని ఇచ్చిన పిలుపు అనంతరం ప్రభుత్వం ఈ దిశగా చర్యలు వేగవంతం చేసినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.

2.5 శాతం మేర వ‌డ్డీ..

కొత్త గోల్డ్ మోనిటైజేషన్ స్కీమ్‌లో ఇంట్లో ఉపయోగం లేకుండా నిల్వ ఉన్న బంగారాన్ని డిపాజిట్ చేసి సంవత్సరానికి 2.25 నుంచి 2.5 శాతం వరకు వడ్డీ పొందే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు బంగారం డిపాజిట్ చేయాలంటే ఎంపిక చేసిన కొద్ది బ్యాంకులను మాత్రమే ఆశ్రయించాల్సి వచ్చేది. కొత్త విధానంలో విశ్వసనీయ జ్యువెలర్ల వద్దనే బంగారాన్ని సులభంగా డిపాజిట్ చేసే అవకాశం కలుగుతుంది. ఇంట్లో బంగారం ఉంచడం వల్ల దొంగతనం భయం ఉండటంతోపాటు, బ్యాంక్ లాకర్లకు ప్రతి సంవత్సరం అద్దె చెల్లించాల్సి వస్తుంది. ఈ స్కీమ్‌లో బంగారం సురక్షితంగా ఉండటంతోపాటు లాకర్ ఖర్చు కూడా ఆదా అవుతుంది. స్కీమ్ గడువు పూర్తైన తర్వాత, డిపాజిట్ చేసిన వ్యక్తులు తమ మొత్తాన్ని నగదు రూపంలో లేదా భౌతిక బంగారం రూపంలో తిరిగి పొందే అవకాశాన్ని కూడా ఎంచుకోవచ్చు. అదేవిధంగా, పాత బంగారంపై పన్నుల విచారణ భయం లేదా పాత కొనుగోలు బిల్లులు, పత్రాలు చూపించాల్సిన ఇబ్బందులు తగ్గేలా ఈ కొత్త స్కీమ్‌ను రూపొందిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

ఆగ‌స్టు నెల‌లో ప్ర‌వేశ‌పెట్టే యోచ‌న‌..?

గోల్డ్ మోనిటైజేషన్ స్కీమ్ ను ఆగ‌స్టు నెల‌లో ప్ర‌వేశ‌పెట్టేందుకు కేంద్రం స‌న్నాహాలు చేస్తుంద‌ని స‌మాచారం. ఈ స్కీమ్‌లో భాగంగా ప్ర‌జ‌లు త‌మ‌కు న‌చ్చిన‌, న‌మ్మ‌క‌మైన స్థానిక జ్యువెల్ల‌రీ షాపుల యాజ‌మాన్యాల వ‌ద్ద బంగారాన్ని భ‌ద్ర ప‌రుచుకోవ‌చ్చు. ఆర్‌బీఐ, బ్యాంకులు, బంగారం ప‌రిశ్ర‌మ‌కు చెందిన వ్యాపారుల‌తో క‌ల‌సి కేంద్రం స‌ర‌ళ‌మైన నియ‌మాల‌ను రూపొందిస్తున్న‌ట్లు తెలిసింది. దీని వ‌ల్ల ప్ర‌జ‌లు చాలా సుల‌భంగా త‌మ బంగారాన్ని దాచుకునేందుకు వీలు క‌లుగుతుంది. బంగారం క‌డ్డీలు, బార్స్‌, నాణేలు లేదా రాళ్లు లేని న‌గ‌ల‌ను సుల‌భంగా జువెల్ల‌ర్స్ వ‌ద్ద డిపాజిట్ చేయ‌వ‌చ్చు. అవ‌స‌రం అయితే వినియోగ‌దారుల అనుమ‌తి మేర‌కు బంగారాన్ని క‌రిగించి 99.5 శాతం స్వ‌చ్ఛ‌త క‌లిగిన గోల్డ్ బిస్కెట్లుగా మార్చి త‌మ వ‌ద్ద నిల్వ చేస్తారు. ఆ బంగారంపై వ‌డ్డీని చెల్లిస్తారు. వినియోగదారులు కావాల‌నుకున్న‌ప్పుడు త‌మ బంగారాన్ని లేదా బిస్కెట్ల‌ను తీసుకోవ‌చ్చు. లేదా న‌గ‌దు రూపంలోనూ పొంద‌వ‌చ్చు. అప్ప‌టి మార్కెట్ రేట్ ప్ర‌కారం డ‌బ్బు చెల్లిస్తారు. అయితే ఈ స్కీమ్‌ను ప్ర‌వేశ‌పెట్టాల‌ని ప్ర‌స్తుతం చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని తెలుస్తుండ‌గా, దీనిపై త్వ‌ర‌లోనే కేంద్రం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌నుంద‌ని స‌మాచారం.

Advertisement
Advertisement