Uttam Kumar Reddy | వచ్చే ఏడాది జూన్ వరకు సాగు నీళ్లు బంద్.. తాగునీటికే మా ప్రాధాన్యత
Uttam Kumar Reddy | ప్రస్తుత పరిస్థితుల్లో నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి సాగునీటికి హామీ ఇవ్వలేమని .. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి నల్లగొండ జిల్లా అధికారులు స్పష్టం చేశారు. అలాగే ఎస్‌ఆర్‌ఎస్‌పీ రెండో దశ పరిధిలోని సుమారు 2.13 లక్షల ఎకరాలకు కూడా నీటి సరఫరా సాధ్యం కాదని వివరించారు.
ట్యాంకర్లు, బోరింగులు
సిద్ధంగా ఉంచండి
నాగార్జున సాగర్ నుంచి
ఆయకట్టుకు నీళ్లివ్వలేం
ఎస్సారెస్పీ 2 నుంచి కూడా
2.13 లక్షల ఎకరాలకు నీళ్లు రావు
కర్ణాటకను ఆశ్రయించి కృష్ణా జలాలు కోరుతాం
మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి
Uttam Kumar Reddy | త్రినేత్ర.న్యూస్, జూలై 20 : ప్రస్తుత పరిస్థితుల్లో నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి సాగునీటికి హామీ ఇవ్వలేమని .. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి నల్లగొండ జిల్లా అధికారులు స్పష్టం చేశారు. అలాగే ఎస్‌ఆర్‌ఎస్‌పీ రెండో దశ పరిధిలోని సుమారు 2.13 లక్షల ఎకరాలకు కూడా నీటి సరఫరా సాధ్యం కాదని వివరించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో కరవు పరిస్థితులు, తాగునీటి లభ్యత, సాగునీరు, వ్యవసాయం, భూగర్భ జలాలు, విద్యుత్ సరఫరా, మిషన్ భగీరథ మౌలిక వసతులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితులు కొనసాగి తాగునీటి సమస్య మరింత తీవ్రరూపం దాల్చితే, అత్యవసర పరిస్థితుల్లో కర్ణాటక ప్రభుత్వాన్ని సంప్రదించి కృష్ణా నది నుంచి తాగునీటి అవసరాల కోసం నీటి విడుదల కోరే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లు, నీటిపారుదల, వ్యవసాయం, ఉద్యానవనం, భూగర్భ జలాలు, విద్యుత్, మున్సిపల్, మిషన్ భగీరథ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇప్పుడున్న నీటి నిల్వలే దిక్కు
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ .. ఈసారి తీవ్రస్థాయి ఎల్‌నినో సంభవించే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారని, జూలై 20 వరకు నమోదైన వర్షపాతం కూడా ఆందోళన కలిగించే పరిస్థితిలో ఉందన్నారు.సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో కూడా తగినంత వర్షపాతం నమోదు కాకపోతే, వచ్చే ఏడాది జూలై వరకు ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలతోనే పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని మంత్రి పేర్కొన్నారు. అందువల్ల తాగునీటి వనరులను కాపాడటం అత్యంత కీలకమని చెప్పారు.అత్యవసర పరిస్థితులు ఏర్పడితే కర్ణాటక ప్రభుత్వాన్ని సంప్రదించి తాగునీటి అవసరాల కోసం కృష్ణా జలాల విడుదల కోరే అవకాశం ఉందన్నారు. జలాశయాల్లో నీటి మట్టాలను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, పరిస్థితి విషమించిన తర్వాత కాకుండా ముందుగానే ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
వరి సాగు వద్దు
సాగునీరు, వర్షపాతం లేదా భూగర్భ జలాల లభ్యతపై స్పష్టత లేని ప్రాంతాల్లో రైతులు వరి సాగుకు వెళ్లవద్దని మంత్రి సూచించారు. ముఖ్యంగా బోర్‌వెల్లపై ఆధారపడే రైతులు పంట కోత వరకు నీరు సరిపోతుందో లేదో ముందుగా అంచనా వేసుకోవాలని చెప్పారు. నీటి హామీ లేకుండా వరి నాట్లు వేస్తే పంట నష్టం, ఆర్థిక ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు గ్రామస్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టి, తక్కువ నీటితో పండే పెసలు, నువ్వులు, కూరగాయలు తదితర స్వల్పకాలిక పంటలను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రోత్సహించాలని ఆదేశించారు. జిల్లా సమావేశాల్లో ప్రజెంటేషన్లు ఇవ్వడం, హామీలు చెప్పడం మాత్రమే కాకుండా అధికారులు గ్రామాలకు వెళ్లి రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడాలని, స్థానిక వర్షపాతం, నేల స్వభావం, నీటి లభ్యత ఆధారంగా పంటలపై సలహాలు ఇవ్వాలని సూచించారు.
నల్లగొండ జిల్లాకు తాగునీరెలా?
ఉమ్మడి నల్గొండ జిల్లాకు ప్రస్తుతం ఏడు ప్రధాన వనరుల నుంచి తాగునీరు సరఫరా చేస్తున్నట్లు అధికారులు సమావేశంలో వివరించారు. 578 గ్రామాలు, నాలుగు పట్టణాలకు తాగునీరు అందించే ఉదయ సముద్రం రిజర్వాయర్‌లో సుమారు 1.5 టీఎంసీల నీటిని నిల్వ చేస్తున్నట్లు తెలిపారు. ఈ నీరు డిసెంబర్ వరకు సరిపోతుందని, ఆ తర్వాత వచ్చే ఏడాది జూలై వరకు అవసరాల కోసం అదనపు నీటి అవసరం ఉంటుందని వివరించారు.పాలేరు జలాశయంలో ప్రస్తుతం సుమారు 1.99 టీఎంసీల నీరు ఉండగా, అది దాదాపు 90 రోజుల తాగునీటి అవసరాలకు సరిపోతుందని తెలిపారు. అనంతరం నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల అవసరమయ్యే అవకాశం ఉందని అధికారులు వివరించారు. పాలేరు జలాశయం నీటి మట్టం సంక్షోభ స్థాయికి చేరడానికి కనీసం 20 నుంచి 25 రోజుల ముందుగానే ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలని మంత్రి అధికారులను ఆదేశించారు. తద్వారా ప్రత్యామ్నాయ వనరులు ఏర్పాటు చేయడం లేదా అత్యవసర చర్యలు చేపట్టడం సులభమవుతుందని చెప్పారు.
సాగర్ నుంచి నీళ్లివ్వలేం
ప్రస్తుత పరిస్థితుల్లో నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి సాగునీటిని హామీ ఇవ్వలేమని అధికారులు సమావేశంలో తెలిపారు. అలాగే ఎస్‌ఆర్‌ఎస్‌పీ రెండో దశ పరిధిలోని సుమారు 2.13 లక్షల ఎకరాలకు కూడా నీటి సరఫరా సాధ్యం కాదని వివరించారు.మూసీ ప్రాజెక్టులో ప్రస్తుతం సుమారు 3.2 టీఎంసీల నీటి నిల్వ ఉందని, అక్టోబర్ 4 వరకు మూడు తడులు ఇవ్వగలమని, అప్పటి వరకు ప్రవాహాలు కొనసాగితే నాలుగో తడి పరిశీలించే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. మూసీ వ్యవస్థను ప్రస్తుతం 15 రోజులు నీటి విడుదల, 15 రోజులు నిలిపివేత విధానంలో నిర్వహిస్తున్నామని, ఎడమ, కుడి కాలువల ద్వారా తలా 250 క్యూసెక్కుల చొప్పున నీరు విడుదల చేస్తూ దాదాపు 30 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు వివరించారు. 1,220 చెరువుల్లో 850 చెరువుల్లో 50 శాతం కంటే తక్కువ నీటి నిల్వ మాత్రమే ఉందని, చిన్న నీటి వనరుల ద్వారా పరిమిత స్థాయిలోనే సాగునీరు అందించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ట్యాంకర్లు, బోర్‌వెల్లు సిద్ధంగా ఉంచాలి
గ్రిడ్ ఆధారిత తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడితే వెంటనే వినియోగించేందుకు గ్రామపంచాయతీలు ట్యాంకర్లను సిద్ధంగా ఉంచాలని మంత్రి ఆదేశించారు. అవసరమైతే వ్యవసాయ బోర్‌వెల్లను అద్దెకు తీసుకుని తాగునీటి సరఫరా కొనసాగించాలని సూచించారు. హ్యాండ్‌పంపులు, సింగిల్ ఫేజ్, త్రీ ఫేజ్ బోర్‌వెల్లు, పైప్‌లైన్లు, లీకేజీలు, మోటార్లు, పంపుసెట్లు, స్థానిక నిల్వ వ్యవస్థలను వెంటనే తనిఖీ చేసి మరమ్మతులు చేయాలని అధికారులకు సూచించారు. సమావేశం ముగింపులో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో క్షేత్రస్థాయిలో పనిచేయాలని, ఎల్‌నినో ప్రభావంతో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడటం, రైతులకు పంట నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం ప్రభుత్వ అత్యున్నత బాధ్యత అని స్పష్టం చేశారు.
తాజావార్తలు
- ●Peddi Sudarshan Reddy | బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హఠాన్మరణం
- ●Kukatpally | క్రికెట్ ఆడటానికి వెళ్తూ.. కానరాని లోకాలకు..
- ●Komuravelli Railway Station | సాకారమైన దశాబ్దాల కల.. నేడు కొమురెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ ప్రారంభం..
- ●Jurala Project | జూరాలను తాకిన కృష్ణమ్మ.. కాలువలకు నీరు విడుదల చేస్తారా?
- ●Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?
- ●Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి

Peddi Sudarshan Reddy | బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హఠాన్మరణం

Kukatpally | క్రికెట్ ఆడటానికి వెళ్తూ.. కానరాని లోకాలకు..

Komuravelli Railway Station | సాకారమైన దశాబ్దాల కల.. నేడు కొమురెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ ప్రారంభం..

Jurala Project | జూరాలను తాకిన కృష్ణమ్మ.. కాలువలకు నీరు విడుదల చేస్తారా?





