త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | పెద్ది విగ్రహం నిలబడితేనే కాంగ్రెస్‌కు ముచ్చెమటలు పడుతున్నయ్.. అందుకే దొంగ‌ల్లా తొల‌గించారు

KTR | తెలంగాణ ఉద్యమకారుడు, న‌ర్సంపేట‌ దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్ర‌హం నిల‌బ‌డితేనే కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి మ‌చ్చెమ‌ట‌లు ప‌డుతున్నాయ‌ని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ఎద్దేవా చేశారు. అందుకే రాత్రికి రాత్రే విగ్ర‌హాన్ని తొల‌గించార‌న్నారు. బీఆర్ఎస్ నేత‌ల‌పై అక్ర‌మ కేసులు పెడితే స‌హించేది లేద‌ని హెచ్చ‌రించారు.

S

Telangana | Published On Aug 18, 2026, 7.56 pm IST

KTR | పెద్ది విగ్రహం నిలబడితేనే కాంగ్రెస్‌కు ముచ్చెమటలు పడుతున్నయ్.. అందుకే దొంగ‌ల్లా తొల‌గించారు
Advertisement
  • రేవంత్ మెప్పు కోసం పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించొద్దు
  • అధికారం ఎవరికీ శాశ్వతం కాదు
  • బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే సహించం
  • బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరిక

KTR | త్రినేత్ర‌.న్యూస్: తెలంగాణ ఉద్యమకారుడు, న‌ర్సంపేట‌ దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్ర‌హం నిల‌బ‌డితేనే కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి మ‌చ్చెమ‌ట‌లు ప‌డుతున్నాయ‌ని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ఎద్దేవా చేశారు. అందుకే రాత్రికి రాత్రే విగ్ర‌హాన్ని తొల‌గించార‌న్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మరోసారి తన పాశవికత్వాన్ని నిరూపించుకుందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ మెప్పు కోసం పోలీసులు దుర్మార్గంగా వ్య‌వ‌హ‌రించొద్ద‌ని సూచించారు. బీఆర్ఎస్ నేత‌ల‌పై అక్ర‌మ కేసులు పెడితే స‌హించేది లేద‌ని హెచ్చ‌రించారు. ఈమేర‌కు మంగ‌ళ‌వారం కేటీఆర్ ఎక్స్ వేదిక‌గా స్పందిస్తూ రేవంత్ ప్ర‌భుత్వంపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు.

రేవంత్‌రెడ్డి మెప్పు కోసం పోలీసులు దొంగల్లా రాత్రికి రాత్రే వ్యవహరించాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ నాయకులు చెప్పినట్టల్లా పోలీసులు నడుచుకోవద్దని, చట్టాన్ని, ప్రజాస్వామ్య విలువలను గౌరవించాలని ఆయన హితవు పలికారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదనే విషయాన్ని పోలీసులు, కాంగ్రెస్‌ ప్రభుత్వం గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.

పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం తొలగింపును నిరసిస్తూ ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలను తెల్లవారేసరికి అరెస్టులు చేయడం, గృహనిర్బంధాలు విధించడం ద్వారా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్ర పాలన నాటి కర్కశత్వాన్ని మరోసారి ప్రదర్శిస్తోందని కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల హక్కులను, ప్రజాస్వామ్య నిరసనలను అణచివేయడం సరైన పద్ధతి కాదని ఆయన స్పష్టం చేశారు. పెద్ది విగ్రహం తొలగింపు చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ వ్యవహారంపై ప్రభుత్వం తక్షణమే వెనక్కి తగ్గాలని డిమాండ్‌ చేశారు.

శాసనసభలో విపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, ప్రభుత్వ మాజీ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌, మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌, పార్టీ సీనియర్‌ నాయకులు, కార్పొరేషన్‌ మాజీ చైర్మన్లు నాగుర్ల వెంకన్న, మర్రి యాదవరెడ్డితో పాటు నర్సంపేట నియోజకవర్గంలోని అన్ని మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి, గృహనిర్బంధంలో ఉంచడాన్ని కేటీఆర్‌ తప్పుబట్టారు.

అరెస్టు చేసిన బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలందరినీ ఎలాంటి షరతులు లేకుండా బేషరతుగా వెంటనే విడుదల చేయాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. పార్టీ శ్రేణులపై అక్రమ కేసులు నమోదు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఇప్ప‌టికే పుట్టెడు దుఃఖంలో ఉన్న పెద్ది సుద‌ర్శ‌న్‌రెడ్డి కుటుంబ స‌భ్యుల‌ను విగ్ర‌హ తొల‌గింపు వంటి తుగ్ల‌క్ చేష్ట‌ల‌తో వారి మ‌నోధైర్యాన్ని దెబ్బ‌తీయొద్ద‌ని సూచించారు.

రాష్ట్రంలో ఏర్ప‌డేది ముమ్మాటికీ బీఆర్ఎస్ ప్ర‌భుత్వ‌మేన‌ని, అప్పుడు న‌ర్సంపేట మెడిక‌ల్ కాలేజీకి పెద్ది సుద‌ర్శ‌న్‌రెడ్డి పేరు పెట్టుకోవ‌ట‌మే కాకుండా ఆయ‌న వీరోచిత పోరాటానికి శాశ్వ‌త కీర్తిని తెస్తామ‌ని కేటీఆర్ పున‌రుద్ఘాటించారు.

Advertisement
Advertisement