త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Uttam | ప్ర‌తి చుక్క‌కూ లెక్కుండాలి

Minister Uttam | ఆకాశం వైపు ఆశగా చూడటం ఒక్కటే జల నిర్వహణ కాదని.. జలాశయాల్లో ఉన్న నీరు, వాస్తవంగా వినియోగించగల నిల్వలు, తాగునీటికి కేటాయించాల్సిన పరిమాణం, పంటలకు అందించగల నీటిని శాస్త్రీయంగా లెక్కించి నిర్ణయాలు తీసుకోవాలని మంత్రి కెప్టెన్‌ ఎన్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

P

Telangana | Published On Aug 18, 2026, 7.11 pm IST

Minister Uttam | ప్ర‌తి చుక్క‌కూ లెక్కుండాలి
Advertisement
  • తాగునీటికి తొలి ప్రాధాన్యం.. పంటలకూ భరోసా
  • కృష్ణా బేసిన్‌లో 76.63శాతం, గోదావరిలో 68.1శాతం నిల్వలు
  • నాగార్జునసాగర్‌లో 164 టీఎంసీలు..
  • మరో 47శాతం వరద జలాలకు అవకాశం
  • సింగూరు మరమ్మతులకు అత్యధిక ప్రాధాన్యం
  • పారుద‌ల‌శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
  • ప్రాజెక్టులు, ఖ‌రీఫ్ సీజ‌న్‌పై ఉన్న‌త‌స్థాయి స‌మీక్ష‌

Minister Uttam | ఆకాశం వైపు ఆశగా చూడటం ఒక్కటే జల నిర్వహణ కాదని.. జలాశయాల్లో ఉన్న నీరు, వాస్తవంగా వినియోగించగల నిల్వలు, తాగునీటికి కేటాయించాల్సిన పరిమాణం, పంటలకు అందించగల నీటిని శాస్త్రీయంగా లెక్కించి నిర్ణయాలు తీసుకోవాలని మంత్రి కెప్టెన్‌ ఎన్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో మిగిలిన వర్షాకాలంపై అనిశ్చితి ఉన్నందున తాగునీటి భద్రతకు తొలి ప్రాధాన్యమిస్తూ.. అందుబాటులోని నీటితో ఖరీఫ్‌ పంటలకు గరిష్ఠ రక్షణ కల్పించాలని సూచించారు. జలసౌధలో మంగళవారం జలాశయాల నీటిమట్టాలు, ప్రవాహాలు, మిగిలిన ఖరీఫ్‌ సీజన్‌ సాగునీటి అవకాశాలపై మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సెప్టెంబరు, అక్టోబరులో భారీ వర్షాలు, ఎగువ నుంచి వరదలు వస్తాయని ముందే ఊహించి ప్రణాళికలు రూపొందించవద్దని స్పష్టం చేశారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీరు, నమ్మదగిన ప్రవాహాలు, శాస్త్రీయ వర్షపాత అంచనాలనే ప్రాతిపదికగా తీసుకోవాలని పేర్కొన్నారు.

కృష్ణాలో 76.63 శాతం నిల్వలు

కృష్ణా బేసిన్‌లోని ప్రధాన జలాశయాల మొత్తం సామర్థ్యం 973.68 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 746.12 టీఎంసీల నీరు ఉంది. గోదావరి బేసిన్‌లో 306.20 టీఎంసీల సామర్థ్యానికి 208.38 టీఎంసీలు అందుబాటులో ఉండి 68.1 శాతం నిల్వ నమోదైంది. అయితే స్థూల నిల్వ శాతాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోకుండా.. లైవ్‌ స్టోరేజీ, ఇప్పటికే కేటాయించిన అవసరాలు, వాస్తవంగా వినియోగించగల నీటి పరిమాణాన్ని ప్రతి నివేదికలో స్పష్టంగా చూపించాలని మంత్రి ఆదేశించారు. 2025, 2026 నిల్వలు, ప్రవాహాలను తులనాత్మకంగా పరిశీలించాలని సూచించారు. తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడి ప్రాజెక్టు నాగార్జునసాగర్‌లో ప్రస్తుతం సుమారు 164 టీఎంసీల నీరు ఉందని అధికారులు తెలిపారు. 312 టీఎంసీల స్థూల సామర్థ్యమున్న ప్రాజెక్టులో మరో 47 శాతం వరద జలాలను స్వీకరించే అవకాశం ఉందన్నారు. ఎడమ కాలువ కింద నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో 6.4 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టు ఉన్నందున సాగునీటి అవసరాలను అత్యంత జాగ్రత్తగా అంచనా వేయాలని మంత్రి సూచించారు.

పంట‌ల‌ను కాపాడాలి..

నమ్మదగిన ప్రతి నీటి వనరును వినియోగించి నిలువునా ఉన్న పంటలను కాపాడాలని.. ప్రవాహాలపై అనిశ్చితి ఉన్న జలాశయాల్లో నీటిని పొదుపుగా వినియోగించాలని ఆదేశించారు. వైరా రిజర్వాయర్‌కు గోదావరి జలాలతో తిరిగి నింపుకునే అవకాశం ఉన్నందున సాగునీటి విడుదలలో జాప్యం ఎందుకని అధికారులను ప్రశ్నించారు. దేవాదుల, నిజాంసాగర్‌, స్వర్ణ, సదర్మట్‌, రామడుగు, బుగ్గలవాగు, రామపల్లి, పాలెంవాగు, గౌరవరం, పోచారం, రాజీవ్‌సాగర్‌, నెలవాయి, వట్టివాగు, నల్లవాగు, పాల్వాయి పురుషోత్తంరావు (ఎర్రవాగు), చెల్మెలవాగు (ఎన్టీఆర్‌ సాగర్‌) తదితర ప్రాజెక్టుల్లో నీటి పరిస్థితిని పరిశీలించి, అవకాశం ఉన్నచోట సాగునీరు విడుదల చేయాలని సూచించారు. మూసీ జలాలను సమర్థంగా వినియోగించాలన్నారు.

సింగూరుకు భద్రతా ప్రాధాన్యం

శ్రీరాంసాగర్‌, నిజాంసాగర్‌, లోయర్‌ మానేరు డ్యామ్‌, సింగూరు తదితర జలాశయాల్లో వాస్తవ నిల్వలు, ప్రవాహాలకు అనుగుణంగా సాగునీటి ప్రణాళికలు ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. సింగూరు డ్యామ్‌ భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని.. మరమ్మతులు, పటిష్టీకరణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. తాజా నీటి నిల్వలను మరోసారి ధ్రువీకరించి సాంకేతిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సూచించారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం పనుల పురోగతిని మంత్రి సమీక్షించారు. ఇన్‌లెట్‌, అవుట్‌లెట్‌ రెండు వైపులా తవ్వకం కొనసాగుతోందని అధికారులు వివరించారు. భౌగోళికంగా క్లిష్ట ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణతో.. భద్రత విషయంలో రాజీపడకుండా పనుల వేగం పెంచాలని మంత్రి ఆదేశించారు.

ముంపుపై శాస్త్రీయ అధ్యయనం

జలవనరుల సాంకేతిక అధ్యయనాల్లో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజా సమాచారాన్నే ప్రామాణికంగా తీసుకోవాలని సూచించారు. నదుల క్రాస్‌ సెక్షన్లను తాజా పరిస్థితులకు అనుగుణంగా నవీకరించాలని ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణలో సంభవించే ముంపుపై అధ్యయనం చేస్తున్న ఐఐటీ నిపుణులతో త్వరగా సంప్రదింపులు జరిపి.. రాష్ట్రంలో వరద ప్రభావం, ముంపు అవకాశాలపై తిరుగులేని సాంకేతిక ఆధారాలను సిద్ధం చేయాలని పేర్కొన్నారు. కేంద్రం నుంచి రక్షణ చర్యలు కోరేందుకు ఈ అధ్యయనం ఉపయోగపడాలన్నారు.

జ‌ల వివాదాల‌పై స‌మీక్ష‌

అంతర్రాష్ట్ర జల వివాదాలపైనా మంత్రి సమీక్షించారు. ట్రిబ్యునల్‌ విచారణలు, సుప్రీంకోర్టు కేసులు, కృష్ణా జలాల నిర్వహణ, విద్యుదుత్పత్తి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పరిధి తదితర అంశాలపై ఇంజినీరింగ్‌, న్యాయ విభాగాలు సమన్వయంతో సమగ్ర నోట్‌ సిద్ధం చేయాలని ఆదేశించారు. ‘‘తాగునీటిని కాపాడాలి.. రైతు పంటను నిలబెట్టాలి.. రేపటి అవసరాన్ని విస్మరించకుండా నేటి అవసరాన్ని తీర్చాలి. ప్రతి టీఎంసీకి లెక్క ఉండాలి.. ప్రతి విడుదలకు శాస్త్రీయ కారణం ఉండాలి. ప్రతి నిర్ణయంలో రైతు ప్రయోజనం, ప్రజల తాగునీటి భద్రత ప్రతిబింబించాలి’’ అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. సమీక్షలో నీటిపారుదల శాఖ కార్యదర్శి ఈ శ్రీధర్‌, ఈఎన్‌సీ (జనరల్‌) ఓవీ రమేశ్‌బాబు, జాయింట్‌ సెక్రటరీ కే శ్రీనివాస్‌, టన్నెల్‌ నిపుణుడు కల్నల్‌ పరిక్షిత్‌ మెహ్రా, ఈఎన్‌సీ (అడ్మినిస్ట్రేషన్‌) టీ శ్రీనివాస్‌, ఈఎన్‌సీ (ఓఅండ్‌ఎం, క్వాలిటీ కంట్రోల్‌) ఆర్ మధుసూదన్‌రావు పాల్గొన్నారు.

Advertisement
Advertisement