త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TN CM Vijay | రోజుకు 20 గంటల పని.. ఉదయం 4కే మంత్రులకు ఫోన్స్ చేస్తున్న తమిళనాడు సీఎం విజయ్

తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ 100 రోజులు పూర్తి చేసుకున్నారు. రోజుకు 20 గంటలు కష్టపడుతున్న ఆయన.. ఉదయం 4 గంటలకే మంత్రులకు ఫోన్లు చేస్తున్నారు. ఎందుకంటే?

J

National | Published On Aug 18, 2026, 7.17 pm IST

TN CM Vijay | రోజుకు 20 గంటల పని.. ఉదయం 4కే మంత్రులకు ఫోన్స్ చేస్తున్న తమిళనాడు సీఎం విజయ్
Advertisement
  • తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ విజయవంతంగా 100 రోజుల పాలన పూర్తి
  • సీఎం విజయ్ రోజుకు 18 నుంచి 20 గంటల పాటు పని చేస్తున్నారని మంత్రి ఆదవ్ అర్జున వెల్లడి
  • ఉదయం 4 గంటలకే నిద్రలేచి మంత్రులకు ఫోన్ చేసి, శాఖల వారీగా అప్‌డేట్స్ అడుగుతున్న వైనం
  • అవినీతిని నిర్మూలించడం, ప్రభుత్వంలో పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా 'పొలిటికల్ మాంక్'లా సీఎం పనితీరు

TN CM Vijay | త్రినేత్ర.న్యూస్ : తమిళనాడు (Tamil Nadu) రాజకీయాల్లో సంచలనం సృష్టించి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన దళపతి విజయ్ (CM Vijay).. పదవి చేపట్టి విజయవంతంగా 100 రోజులు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం వర్కింగ్ స్టైల్ ఎలా ఉందో ఆయన సన్నిహితుడు, రాష్ట్ర మంత్రి ఆదవ్ అర్జున (Aadhav Arjuna) ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. చెన్నైలో జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్‌లో పాల్గొన్న ఆయన.. విజయ్‌ను ఒక 'పొలిటికల్ మాంక్' (రాజకీయ చురుకుగా పాల్గొనే వ్యక్తి) గా అభివర్ణించారు.

విజయ్ రోజుకు ఏకంగా 18 నుంచి 20 గంటల పాటు ప్రజల కోసమే పనిచేస్తున్నారని మంత్రి తెలిపారు. "మా నాయకుడు ఉదయం 4 గంటలకే నిద్రలేస్తారు. అప్పుడే మంత్రులకు ఫోన్లు చేసి, వారి శాఖల్లో ఏం జరుగుతుందో ఆరా తీస్తారు. శాఖల వారీగా అప్‌డేట్స్ అడుగుతారు. అదీ మా సీఎం పనితీరు" అని అర్జున ప్రశంసించారు.

సీఎం అయ్యామన్న అహంకారం తమ ప్రభుత్వంలో ఎవరికీ లేదని.. ప్రజల కోసం చిత్తశుద్ధితో పనిచేయడమే తమ ముందున్న లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల్లో సాధించిన ఘన విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడం కన్నా.. రాబోయే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలి? శాఖల వారీగా ఉన్న సమస్యలను ఎలా పరిష్కరించాలి? అనే దానిపైనే విజయ్ ప్రధానంగా ఫోకస్ పెట్టినట్లు వివరించారు.

విజయ్ పనితీరును వివరిస్తూ ఆయన్ని ఒక 'పొలిటికల్ మాంక్' (Political monk) తో పోల్చారు. "గెలిచిన తర్వాత నేను ఆయన్ని రోజూ సెక్రటేరియట్‌లో కలుస్తున్నాను. ఆయనొక సన్యాసిలా కనిపిస్తున్నారు. తర్వాత ఏం చేయాలి? ఆ తర్వాత ఏం చేయాలి? అనే నిరంతరం ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా ప్రతి శాఖలో ఉన్న అవినీతి (Corruption) సమస్యను ఎలా రూపుమాపాలన్న దానిపైనే తీవ్రంగా దృష్టి పెట్టారు" అని వెల్లడించారు.

మొదటి 100 రోజుల్లోనే ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థలో ఉన్న లోపాలను (financial leakages) అరికట్టేందుకు.. పాలనలో పారదర్శకత (Transparency) తీసుకురావడానికి విజయ్ సర్కార్ కీలక అడుగులు వేసిందని మంత్రి తెలిపారు. దశాబ్దాలుగా పాతుకుపోయిన వ్యవస్థ కావడంతో కింది స్థాయిలో ఇంకా అవినీతి ఉండి ఉండొచ్చని అంగీకరించిన ఆయన.. సిస్టమ్‌ను పైస్థాయి నుంచి ప్రక్షాళన చేసేందుకు సీఎం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని స్పష్టం చేశారు. ఎక్కడా నిధులు దుర్వినియోగం కాకూడదని అధికారులకు సీఎం పదేపదే ఆదేశాలు జారీ చేస్తున్నట్లు మంత్రి ఆదవ్ అర్జున పేర్కొన్నారు.

Advertisement
Advertisement