త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dasoju Sravan | 22A చట్టం ‘అర్బన్ ల్యాండ్ సీలింగ్’ కాదు.. ఇది అక్షరాలా ‘అర్బన్ పీపుల్స్ లూటింగ్’

Dasoju Sravan | 22A చట్టం ‘అర్బన్ ల్యాండ్ సీలింగ్’ కాదని.. అక్షరాలా ‘అర్బన్ పీపుల్స్ లూటింగ్’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్‌కుమార్ మండిప‌డ్డారు. ఇది ప్ర‌భుత్వ లైసెన్స్‌డ్ లూట్‌.. నాలుగు ద‌శ‌ల మ‌హా దోపిడీ కుట్ర అని తీవ్ర స్థాయిలో ఆరోప‌ణ‌లు చేశారు.

S

Telangana | Published On Aug 18, 2026, 7.29 pm IST

Dasoju Sravan | 22A చట్టం ‘అర్బన్ ల్యాండ్ సీలింగ్’ కాదు.. ఇది అక్షరాలా ‘అర్బన్ పీపుల్స్ లూటింగ్’
Advertisement
  • ప్రభుత్వ లైసెన్స్‌డ్ లూట్.. 4 దశల మహా దోపిడీ కుట్ర
  • ఒక్క క్లిక్‌తో నిషేధిత జాబితాలోకి నెట్టేస్తున్న‌రు
  • ఒక్కో సంతకానికి ఒక్కో రేటు క‌డుతున్న‌రు
  • ఎక్స్ వేదిక‌గా ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్ తీవ్ర ఆరోప‌ణ‌లు

Dasoju Sravan | త్రినేత్ర‌.న్యూస్‌: 22A చట్టం ‘అర్బన్ ల్యాండ్ సీలింగ్’ కాదని.. అక్షరాలా ‘అర్బన్ పీపుల్స్ లూటింగ్’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్‌కుమార్ మండిప‌డ్డారు. ఇది ప్ర‌భుత్వ లైసెన్స్‌డ్ లూట్‌.. నాలుగు ద‌శ‌ల మ‌హా దోపిడీ కుట్ర అని తీవ్ర స్థాయిలో ఆరోప‌ణ‌లు చేశారు. సామాన్యుడిని పీడించడానికి 22A ఆయుధంగా వాడుతున్నారని ధ్వ‌జ‌మెత్తారు. ప్రభుత్వ భూములను మింగేయడానికి 22A క్లియరెన్స్‌ను డాలుగా మారుస్తున్నార‌ని ఫైర‌య్యారు. ఈ మేర‌కు ఆయ‌న మంగ‌ళ‌వారం రేవంత్ ప్ర‌భుత్వంపై ఎక్స్ వేదిక‌గా విరుచుకుప‌డ్డారు.

1. మొదటి దశ- భయాందోళన సృష్టిస్తున్నారు (మ్యాన్యుఫాక్చర్డ్ Panic): దశాబ్దాల క్రితం రక్తం ధారపోసి కొనుక్కున్న 100 గజాల ప్లాట్లను, 30 ఏళ్ల క్రితం రిజిస్ట్రేషన్ అయిన పట్టా భూములను రాత్రికి రాత్రే కంప్యూటర్లలో ఒక్క క్లిక్‌తో '22A నిషేధిత జాబితా'లోకి నెట్టేస్తున్నారు. పిల్లల పెళ్లిళ్లు, చదువులు, హాస్పిటల్ ఖర్చుల కోసం స్థలం అమ్ముకుందామని రిజిస్ట్రేషన్ ఆఫీసుకు వెళ్తున్న సామాన్యుడి నెత్తిన పిడుగు పడేలా చేస్తున్నారు.

2. రెండవ దశ- అధికార యంత్రాంగం నిలువునా దోచుకుంటూ బాధితులను స్తంభం నుంచి స్తంభానికి తిప్పుతోంది (Bureaucratic Harassment & Licenced Loot): బాధితులను తహసీల్దార్ (MRO) నుంచి కలెక్టరేట్ దాకా, సబ్-రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి జిల్లా రెవెన్యూ కార్యాలయాల దాకా Pillar to Post అన్నట్లు పిచ్చివాళ్లలా తిప్పుతున్నారు. త‌హ‌సీల్దార్‌ దగ్గరకు వెళ్తే 'కలెక్టర్‌దే అధికారం' అని చేతులెత్తేస్తారు, కలెక్టరేట్‌కు వెళ్తే 'MRO గ్రౌండ్ రిపోర్ట్ ఇవ్వలేదు' అని వెనక్కి పంపుతారు, తీరా రెండూ పట్టుకుని రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కు వెళ్తే 'పోర్టల్ లాక్ అయింది' అని గేట్లు మూసేస్తున్నారు.

'గ్రీవెన్స్ పెట్టుకోండి.. ఫైల్ ప్రాసెస్‌లో ఉంది.. పరిశీలిస్తున్నాం' అంటూ రోజుల తరబడి తిప్పుతూ సామాన్యులను శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా నిస్సహాయులను చేస్తున్నారు. అన్ని పక్కా పత్రాలున్నా పైసా ముట్టనిదే ఫైలు కదలదు. ఒక్కో సంతకానికి రేటు కట్టి, పేద, మధ్యతరగతి ప్రజల రక్తం తాగుతూ అందినకాడికి దోచుకుంటున్నారు.
టోల్ ఫ్రీ నెంబర్ 1800 599 4788 పనిచేయదు.

3. మూడవ దశ - రియల్ మాఫియాతో దోపిడీ చేయిస్తున్నారు (Distress Sale to Syndicates): విసిగిపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ బాధితుల దగ్గరకు అధికార పార్టీ బినామీలు, రియల్ ఎస్టేట్ దళారులు రంగప్రవేశం చేస్తున్నారు. 'ఎలాగూ 22A లో పడింది కదా, రూపాయి విలువ చేసే నీ ఆస్తిని పావలాకు మాకు రాసివ్వు, అధికారులను మేం మేనేజ్ చేసుకుంటాం' అని బెదిరించి, కారుచౌకగా లాక్కుంటున్నారు. ఆ దళారుల చేతుల్లోకి రిజిస్ట్రేషన్ కాగానే.. అప్పటివరకు తిప్పిన అదే అధికారులు ఆ సర్వే నంబర్‌ను 22A జాబితా నుంచి క్షణాల్లో మాయం చేస్తున్నారు.

4. నాల్గవ దశ - సడలింపుల ముసుగులో 'గుండుగుత్త' స్వాహా చేస్తున్నారు (Mass Blanket Deregulation Scam): ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుని, తీవ్రమైన ప్రజా ఒత్తిడితో ప్రభుత్వం 22A ఎత్తివేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు.. అక్కడ మరో మహా కుట్రకు తెరలేపుతున్నారు. సామాన్యుల ప్లాట్లను క్లియర్ చేసే ముసుగులో, వాస్తవంగా నిషేధిత జాబితాలో ఉండాల్సిన వేల ఎకరాల విలువైన చెరువులు, కుంటలు, వక్ఫ్, దేవాదాయ, కాందిశీకుల, అటవీ, ప్రభుత్వ భూములపై కూడా గుండుగుత్తగా నిషేధం ఎత్తివేస్తున్నారు. ప్రజల పోరాటాన్ని సాకుగా చూపిస్తూ, వేల కోట్ల రూపాయల విలువైన ప్రజా ఆస్తులను అధికార పార్టీ పెద్దలు, రియల్ మాఫియా గుట్టుచప్పుడు కాకుండా స్వాహా చేస్తున్నారు.

ఏక‌మై నిల‌దీద్దాం..

హైదరాబాద్ జిల్లా భూముల వివరాలు పూర్తిగా ఎత్తివేసి, పక్కా స్కెచ్‌తో సాగుతున్న ఈ రియల్ ఎస్టేట్ రాబందుల పాలనను ప్రజలంతా ఏకమై నిలదీయాలి అని దాసోజు శ్ర‌వ‌ణ్ పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement