త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana BJP | బండి అవుట్.. ఈటల, అరుణ ఇన్

Telangana BJP | తెలంగాణ రాజకీయాల్లో త్వరలో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి. అతి త్వరలో జరగబోయే కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌( Bandi Sanjay )ను తప్పించనున్నారు. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్( Eatala Rajender ), మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ( DK Aruna )కు కేబినెట్‌లో చోటు కల్పించనున్నారు.

S

Telangana | Published On Aug 18, 2026, 7.30 pm IST

Telangana BJP | బండి అవుట్.. ఈటల, అరుణ ఇన్
Advertisement

మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో
భారీ మార్పులు చేయనున్న కేంద్రం
ఆగస్టు 20 తర్వాతే విస్తరణ
తెలంగాణలో తిష్ట వేయనున్న
ఎలక్షన్ ఇంజినీర్ సునీల్ బన్సల్
రెండున్నరేండ్ల పాటు
ఫుల్ టైం ఇంచార్జిగా బాధ్యతలు
8 మంది ఎంపీల విజయం వెనుక
సునీల్‌దే ప్రధాన పాత్ర
తెలంగాణ పీఠమే లక్ష్యంగా
బీజేపీ అధిష్టానం పావులు
అక్టోబర్ 2న.. జనాకర్షక స్కీంను
ప్రకటించనున్న పీఎం మోదీ

Telangana BJP | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ రాజకీయాల్లో త్వరలో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి. అతి త్వరలో జరగబోయే కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ను తప్పించనున్నారు. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణకు కేబినెట్‌లో చోటు కల్పించనున్నారు. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం.. దాదాపు 32 శాఖల మంత్రులను మార్చనున్నట్టు సమాచారం. కొంతమందికి ఇతర మంత్రిత్వ శాఖలను అప్పగించడం మరికొంత మంది స్థానంలో కొత్తవారికి అవకాశం ఇవ్వనున్నట్టు తెలిసింది.

ఆగస్టు 20 తర్వాత విస్తరణ

ఆగస్టు 20 తర్వాత ఏ క్షణమైనా కేంద్ర మంత్రి వర్గాన్ని విస్తరించనున్నట్టు సమాచారం. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ను తప్పించి ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణలకు స్థానం కల్పించనున్నారు. అయితే.. ఎంపీలు ధర్మపురి అర్వింద్, కొండా విశ్వేశ్వర్ రెడ్డిలు కూడా కేబినెట్‌లో బెర్త్ కోసం తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నట్టు సమాచారం. కాగా, ఇప్పటికే ఎన్డీఏలో చేరిన తృణమూల్ పార్టీ అసమ్మతి ఎంపీలు, శివసేన, ఎన్సీపీ నుంచి వేరు పడిన ఎంపీల్లో కొంతమందికి చోటు దక్కే అవకాశం ఉన్నది. సీనియర్లైన కేంద్రమంత్రుల వద్ద రెండు, మూడేసి శాఖలున్నాయి. అశ్వినీ వైష్ణవ్ వద్ద 3 , ప్రహ్లాద్ జో్షి వద్ద 3, మనోహర్ లాల్, జ్యోతిరాదిత్య సింధియా, మన్ సుఖ్ మాండవీయ, అమిత్ షా లవద్ద రెండేసి శాఖలు ఉన్నాయి. వీటిని కొత్త వారికి అప్పగించనున్నారు.

రంగంలోకి సునీల్ బన్సల్

ఎన్నో ఏళ్ల ప్రయత్నం తర్వాత బెంగాల్ పీఠం దక్కించుకున్న బీజేపీ.. ఇక తదుపరి లక్ష్యమైన తెలంగాణపై సీరియస్‌గా ఫోకస్ చేస్తున్నది. అధికారం వచ్చేందుకు అన్ని విధాలా ఇది సరైన సమయమని.. ఆరు నూరైనా పీఠం దక్కించుకోవాల్సిందేనని భావిస్తున్నది. ఈ నేపథ్యంలో.. ఆయా రాష్ట్రాల్లో బీజేపీని గద్దెనెక్కించిన ఎన్నికల మాస్టర్ మైండ్, బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ బన్సల్‌ను రంగంలోకి దించనున్నది. రేపో మాపో ఆయనకు తెలంగాణ అదనపు ఇంచార్జిగా ఫుల్ టైం బాధ్యతలు అప్పగించనున్నది. తెలంగాణలో ఎన్నికలు ముగిసే వరకు.. ఆయన ఇక్కడి నుంచే పనిచేయనున్నారు.

బీజేపీకి ఎలక్షన్ ఇంజనీర్

మీడియా ప్రచారానికి దూరంగా ఉండే సునీల్ బన్సల్.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు అత్యంత సన్నిహితుడు. బీజేపీ ఆయనను ఎలక్షన్ ఇంజినీర్‌గా పిలుచుకుంటూ ఉంటుంది. యూపీ, ఒడిశా, బెంగాల్ పీఠాల్లో బీజేపీని గెలిపించడంలో ఆయనదే ప్రధాన పాత్ర అని చెబుతుంటారు. 1990 నుంచి ఆర్ఎస్ఎస్‌లో ప్రచారక్‌లో చేరిన ఆయన తొలిసారిగా 2014లో ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో.. బీజేపీ గెలుపు కోసం పనిచేశారు. దాంతో ఆ ఎన్నికల్లో 80కి గాను బీజేపీ 73 ఎంపీ స్థానాల్లో గెలిచింది. అక్కడ 2017, 2022 లో యోగి ఆదిత్య నాథ్ ప్రభుత్వం మళ్లీ మళ్లీ గెలిచేందుకు ఆయన వ్యూహాలే కారణమని పార్టీ ప్రగాఢంగా భావిస్తుంటుంది. 2024 లోక్ సభ ఎన్నికల్లో ఒడిశాలో 21కి గాను 20 ఎంపీ స్థానాలు బీజేపీ గెలిచినా.. బెంగాల్‌లో మమతా బెనర్జీని గద్దె దింపినా.. సునీల్ బన్సల్ వ్యూహాలే కారణమని కీలక నేతలు ఆయనకు కితాబునిస్తుంటారు. బీజేపీ మాజీ అధ్యక్షుడు జేపీ నడ్డా తర్వాత.. బన్సల్‌కే అధ్యక్ష పదవి ఇవ్వాలన్న చర్చ కూడా పార్టీలో జరిగింది.

2029కి మోదీ.. రెడీ

పార్టీని ఇప్పటికే పునర్ వ్యవస్థీకరించిన బీజేపీ.. ఇక తదుపరి మంత్రి వర్గ మార్పులు చేర్పులపై దృష్టి పెట్టింది. అదే సమయంలో 2029 ఎన్నికలే లక్ష్యంగా అనేక సంస్కరణలను తీసుకురానున్నది. ఇందులో భాగంగా.. మోదీ.. వచ్చే అక్టోబర్ 2 న జనాకర్షక పథకాలను ప్రకటించనున్నారు. ముఖ్యంగా జెన్ జీ ఆందోళనల నేపథ్యంలో.. యువతను ఆకట్టుకునేందుకు ఇప్పటికే.. ఫ్రీ కోచింగ్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో పాటు.. 20 నుంచి 30 ఏళ్ల వయసున్న యువతను తమవైపు తిప్పుకునే స్కీంలను ప్రకటించనున్నట్టు సమాచారం.

Advertisement
Advertisement