త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | వ్యాట్స‌ప్‌లో ప్రూఫ్స్‌ పంపుతున్నా.. చీము నెత్తురుంటే రాజీనామా చెయ్‌

Harish Rao | మంత్రి జూప‌ల్లి కృష్ణారావుకు హ‌రీశ్‌రావు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్ర‌భుత్వం చేసిన అప్పు రూ.4.15 ల‌క్ష‌ల కోట్ల‌ని మ‌రోసారి తేల్చి చెప్పారు. నేను చెప్పింది, కాగ్ చెప్పింది ఒక్క‌టేన‌ని స్ప‌ష్టం చేశారు.

S

Telangana | Published On Jul 3, 2026, 2.05 pm IST

Harish Rao | వ్యాట్స‌ప్‌లో ప్రూఫ్స్‌ పంపుతున్నా.. చీము నెత్తురుంటే రాజీనామా చెయ్‌
Advertisement
  • రెండున్న‌రేండ్ల‌లో రూ. 1,77,058 కోట్లు అప్పు చేశామ‌ని జూప‌ల్లి నాకు లేఖ రాశాడు
  • రిజ‌ర్వ్ బ్యాంక్ లెక్క‌ల ప్ర‌కారం లక్షా 86 వేల 67 కోట్లు అప్పు చేశారు
  • రేవంత్‌రెడ్డి, జూప‌ల్లి నెల‌కో లెక్క చెబుతున్న‌రు
  • ఇప్పుడు ఎవ‌రు రాజీనామా చేయాలో నువ్వే చెప్పు
  • మంత్రి జూప‌ల్లి స‌వాల్‌కు హ‌రీశ్‌రావు ప్ర‌తిస‌వాల్‌

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్‌: మంత్రి జూప‌ల్లి కృష్ణారావుకు హ‌రీశ్‌రావు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్ర‌భుత్వం చేసిన అప్పు రూ.4.15 ల‌క్ష‌ల కోట్ల‌ని మ‌రోసారి తేల్చి చెప్పారు. నేను చెప్పింది, కాగ్ చెప్పింది ఒక్క‌టేన‌ని స్ప‌ష్టం చేశారు. కావాలంటే తాను అసెంబ్లీలో మాట్లాడిన వీడియో, రేవంత్‌రెడ్డి మాట్లాడిన వీడియో, ఆర్బీఐ లెక్క‌లు మీకు వాట్స‌ప్‌లో పంపుతున్నా చ‌దువుకో అని ఫైర‌య్యారు. మంత్రి జూప‌ల్లి లెటర్ విడుదల చేసిన నిమిషాల వ్యవధిలోనే సంగారెడ్డిలోని పీపీటీ ద్వారా కడిగి పాడేశారు. రేవంత్, జూప‌ల్లి పూట‌కో లెక్క చెబుతున్నార‌ని, చీము నెత్తురు ఉంటే వెంట‌నే రాజీనామా చేయాల‌ని సవాల్ విసిరారు. శుక్ర‌వారం సంగారెడ్డిలో బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ నిప్పులు చెరిగారు.

పూట‌కో స‌వాల్‌.. రోజుకో అడ్ర‌స్‌..

జూప‌ల్లి ఈరోజు ఉత్తం రాసిండు. వాట్సప్ పెట్టిండు. కేటీఆర్, హరీశ్ రావు రావాలన్నడు. మేం వస్తే కేసీఆర్ రావాలె అంటున్నడు. అప్పుల మీద చర్చ అని జూపల్లి కృష్ణారావు నిన్న పారిపోయిండు. నేను తెలంగాణ భవన్‌కు వచ్చి ఎదురుచూస్తూ అస‌లు రానేలేదు. రాకుండా ముఖం చాటేసిండు. తెలంగాణ భవన్‌కు వస్తానని తోక ముడిచిండు. మొన్న తెలంగాణ భవన్ అన్నడు, నిన్న గన్ పార్క్ అన్నడు, నేడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అన్నడు.. నిన్న నేనే గన్‌పార్క్‌కు వస్తా అంటే పోలీసులను పెట్టి అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌లో పెట్టిండు. పోలీసుస్టేషన్‌కు రమ్మంటే రాలేదు. పూటకో సవాల్, రోజుకో అడ్రస్ అని హ‌రీశ్‌రావు తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు.

కేసీఆర్ వ‌స్తెనే వ‌స్తా అని త‌ప్పించుకుండు..

నేను చాలా సీనియర్, ఐదుగురు మంత్రుల దగ్గర పని చేసినా.. కేసీఆర్ వస్తనే వస్తా అని తప్పించుకుండు. నువ్వెంత సీనియర్ మంత్రివో నీ లేఖ చూస్తనే తెలుస్తున్నది జూప‌ల్లి. కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం రెండున్నర ఏండ్లలో చేసిన అప్పు లక్షా 77 వేల 58 కోట్లు అని లేఖలో రాసిండు. నిజానికి రిజర్వ్ బ్యాంకు లెక్కల ప్రకారం జూన్ 30, 2026 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు లక్షా 86 వేల 67 కోట్లు. 2026, మార్చి 18న‌ రేవంత్ అసెంబ్లీలో ఏం చెప్పిండంటే.. మేం చేసిన అప్పు 3 లక్షల 47 వేల 294 కోట్లు అన్నడు. నెలకో లెక్క చెబుతాారా? ఈ డబ్బులు ఎవరి జేబుల్లోకి పోతున్నాయి. లెక్కలు తప్పు చెప్పినందుకు పాలమూరు బిడ్డవు అయితే చీము నెత్తురు ఉంటే వెంటనే రాజీనామా చేయాలి అని మాజీ మంత్రి డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు 4.17లక్షల కోట్లు మాత్రమేనని క్యాబినెట్ మొత్తాన్ని అసెంబ్లీలో కూర్చోబెట్టి చెప్పిన. తప్పయితే చెప్పండి. నేను చర్చకు సిద్దం అంటే ఆనాడు ఒక్కరూ లెవ్వలేదు. తలలు కిందకు వేసుకున్నరు. సీనియర్ మంత్రి అంటున్న‌వ్‌.. మీ క్యాబినెట్ ఎంత అప్పు చేసిందో తెల్వదా. మీదో చర్చ.. మీదో మాట అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

సంగారెడ్డిలో పాద‌యాత్ర చేస్తం..

సంగారెడ్డి జిల్లాలో 4 లక్షల ఎకరాలకు సాగునీటిని ఇచ్చే సంగమేశ్వర - బసవేశ్వర ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కించింది. సంగమేశ్వర - బసవేశ్వర ప్రాజెక్టుకు నిధులు కేటాయించి, యుద్ధప్రాతిపదికన పనులు జరపకపోతే రైతులను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. సంగారెడ్డి జిల్లాలో పాదయాత్ర కార్యక్రమం కూడా చేపడతాం అని హ‌రీశ్ పేర్కొన్నారు.

కాగ్ రిపోర్టు కూడా చెప్పింది. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు 4.15 లక్షల కోట్లు అని. నేను చెప్పింది, కాగ్ చెప్పింది ఒక్కటే. అబద్దాలు చెబుతూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. జూపల్లి ఒక మాట చెబుతున్నాడు, రేవంత్ రెడ్డి ఇంకో మాట చెబుతున్నాడు.. ఇప్పుడు రాజీనామా ఎవరు చేయాలి? అని హ‌రీశ్‌రావు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు.

 

Advertisement
Advertisement