త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Seethakka | ప‌నిచేసే గ్రామీణ మ‌హిళ‌ల కోసమే హాస్ట‌ళ్లు: మంత్రి సీతక్క

Seethakka | ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే మహిళలకు సురక్షిత వసతి కల్పించేందుకు వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లను ఏర్పాటు చేస్తున్నామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీత‌క్క‌ తెలిపారు. బంజారాహిల్స్ రోడ్ నెం.12లో నిర్మించిన వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ “సఖి నివాస్”, వన్ స్టాప్ సెంటర్ “సఖి సెంటర్”లను ఆమె మంగ‌ళ‌వారం ప్రారంభించారు.

S

Telangana | Published On May 26, 2026, 12.55 pm IST

Seethakka | ప‌నిచేసే గ్రామీణ మ‌హిళ‌ల కోసమే హాస్ట‌ళ్లు: మంత్రి సీతక్క
Advertisement
  • చిన్న పిల్ల‌ల‌తో వ‌చ్చే త‌ల్లుల‌కు ఉమెన్స్ హాస్టల్ లో ప్ర‌త్యేక సౌక‌ర్యాలు
  • తెలంగాణ అభివృద్ధి మ‌హిళ‌ల అభ్యున్న‌తిలోనే ఉంది
  • జూన్ 5న సీఎం చేతుల మీదుగా వారికి ఆర్టీసీ బ‌స్సులు అంద‌జేస్తాం
  • రేపు మధిర నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం భ‌ట్టి చేతుల మీదుగా సోలార్ విద్యుత్ ప్లాంట్లు ప్రారంభిస్తాం
  • బంజారాహిల్స్‌లో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్, సఖి సెంటర్‌ను ప్రారంభోత్స‌వంలో మంత్రి సీతక్క

Seethakka | త్రినేత్ర‌.న్యూస్: ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే మహిళలకు సురక్షిత వసతి కల్పించేందుకు వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లను ఏర్పాటు చేస్తున్నామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీత‌క్క‌ తెలిపారు. మహిళా వారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెం.12లో నిర్మించిన వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ “సఖి నివాస్”, వన్ స్టాప్ సెంటర్ “సఖి సెంటర్”లను ఆమె మంగ‌ళ‌వారం ప్రారంభించారు. ఈ హాస్టల్‌లో సుమారు 150 మంది మహిళలకు వసతి సౌకర్యం కల్పించామని చెప్పారు. చిన్నపిల్లలతో వచ్చే తల్లులు కూడా ఇక్కడ ఉండేలా ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు.

మ‌హిళా శ‌క్తి ముందు విమ‌ర్శ‌లు నిల‌వ‌వ్‌..

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మహిళల భద్రత, గౌరవం, ఆత్మవిశ్వాసం, ఆర్థిక స్వావలంబన కోసం తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో పనిచేస్తోందని పేర్కొన్నారు. మహిళల అభివృద్ధిని జీర్ణించుకోలేక కొందరు విమర్శలు చేస్తున్నారని, అలాంటి విమర్శలు మహిళా శక్తి ముందు నిలవవని చెప్పారు. మహిళల పురోగతిని తట్టుకోలేని ప్రతిపక్ష పార్టీలకు మహిళలే తగిన బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు.

మ‌హిళా సంఘాల‌కు రైస్ మిల్లులు, పెట్రోల్ బంకులు..

రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు వడ్డీలేని రుణ పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలకు పెంచిందని తెలిపారు. మహిళా సంఘాలకు రైస్ మిల్లులు, పెట్రోల్ బంకులు, మహిళా సూపర్ మార్కెట్లు వంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. ఒకప్పుడు ఖర్చుల కోసం ఇతరులపై ఆధారపడే పరిస్థితి ఉండేదని.. ఇప్పుడు ఇంటి ఖర్చులు భరించే స్థాయికి, పిల్లల చదువుల బాధ్యత తీసుకునే స్థాయికి, మరో నలుగురికి ఉపాధి కల్పించే స్థాయికి మహిళలు ఎదుగుతున్నారని వివ‌రించారు. మహిళలను సంపద సృష్టించే శక్తిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. మహిళల ఆదాయం పెరిగితే కుటుంబం బలపడుతుందన్నారు. రాష్ట్రం సుభిక్షంగా మారుతుందని పేర్కొన్నారు. ప్రతి కుటుంబంలో ఒక మహిళ ఉన్నత స్థాయికి ఎదగాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని స్ప‌ష్టం చేశారు.

జూన్ 5న మ‌హిళ‌ల‌కు ఆర్టీసీ బ‌స్సులు..

మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ ప్లాంట్లను బుధవారం ప్రారంభించనున్నట్లు సీతక్క వెల్లడించారు. మధిర నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేతుల మీదుగా వాటిని ప్రారంభిస్తామని తెలియ‌జేశారు. జూన్ 5న సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు ఆర్టీసీ బస్సులను అందజేస్తారని చెప్పారు. గ్రామాగ్రామాన మహిళలు సాధిస్తున్న విజయాలను సమాజానికి చాటిచెప్పాలని, తెలంగాణ అభివృద్ధి మహిళల అభ్యున్నతిలోనే ఉందని మంత్రి సీత‌క్క‌ స్ప‌ష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ విజయలక్ష్మి, బాలల కమిషన్ చైర్‌పర్సన్ సీతా దయాకర్ రెడ్డి, బాలల హక్కుల కమిషన్ సభ్యులు బండి అపర్ణ, వందన గౌడ్, మారిపల్లి చందన, సరిత, ప్రేమలత అగర్వాల్, మహిళా అభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్ బండ్రు శోభారాణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement