త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Police Staff Support | కన్నీటి ఇంటికి ఖాకీ అండ.. జవాన్ కుటుంబానికి రూ.5.20 లక్షల చేయూత

Police Staff Support | ఒక్క ప్రమాదం.. ఓ కుటుంబాన్ని దిక్కుతోచని స్థితిలోకి నెట్టేసింది. ఇంటి పెద్దను కోల్పోయిన ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతుండగా, ఆయనతో కలిసి విధులు నిర్వర్తించిన సహచరులు అండగా నిలిచారు. రోడ్డు ప్రమాదంలో అకాలంగా మృతి చెందిన ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగం (ఐఎస్‌డబ్ల్యూ) జవాన్ అరే కిరణ్ కుటుంబానికి తోటి అధికారులు, సిబ్బంది తమ మానవత్వాన్ని చాటుతూ రూ.5.20 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు.

P

Telangana | Published On Jul 28, 2026, 6.11 pm IST

Police Staff Support | కన్నీటి ఇంటికి ఖాకీ అండ.. జవాన్ కుటుంబానికి రూ.5.20 లక్షల చేయూత
Advertisement

Police Staff Support | ఒక్క ప్రమాదం.. ఓ కుటుంబాన్ని దిక్కుతోచని స్థితిలోకి నెట్టేసింది. ఇంటి పెద్దను కోల్పోయిన ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతుండగా, ఆయనతో కలిసి విధులు నిర్వర్తించిన సహచరులు అండగా నిలిచారు. రోడ్డు ప్రమాదంలో అకాలంగా మృతి చెందిన ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగం (ఐఎస్‌డబ్ల్యూ) జవాన్ అరే కిరణ్ కుటుంబానికి తోటి అధికారులు, సిబ్బంది తమ మానవత్వాన్ని చాటుతూ రూ.5.20 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు. పోలీసు శాఖలో సహోద్యోగులుగా పనిచేసిన బంధాన్ని కేవలం విధులకే పరిమితం చేయకుండా.. కష్టకాలంలో కుటుంబానికి భరోసాగా నిలవాలన్న ఉద్దేశంతో విభాగానికి చెందిన అధికారులు, సిబ్బంది స్వచ్ఛందంగా విరాళాలు సేకరించారు. హైదరాబాద్‌లోని ఐఎస్‌డబ్ల్యూ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఓఎస్‌డీ వీబీ కమలాసన్ రెడ్డి చేతుల మీదుగా ఆ మొత్తాన్ని కిరణ్ కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఈ సందర్భంగా ఓఎస్‌డీ కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ.. కిరణ్ అకాల మరణం పోలీసు శాఖకు తీరని లోటని అన్నారు. కుటుంబం ఒంటరిగా భావించాల్సిన అవసరం లేదని, శాఖ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అందాల్సిన సర్వీస్ ప్రయోజనాలు, ప్రమాద బీమా నిధులు త్వరగా అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే కుటుంబంలో అర్హులైన వ్యక్తికి కారుణ్య నియామకం కల్పించేందుకు కూడా అవసరమైన చర్యలు చేపడతామని చెప్పారు.

జవాన్ కుటుంబానికి చేయూత అందించాలనే లక్ష్యంతో విరాళాల సేకరణను సమర్థంగా నిర్వహించిన ఆర్‌ఐ అడ్మిన్ శ్రీదర్ రెడ్డి, దినేష్ రెడ్డి, కే శ్రవణ్ కుమార్, కే సుమన్, ఎస్ సాగర్‌తో పాటు సహకరించిన సిబ్బందిని ఓఎస్‌డీ ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ఎస్పీ (అడ్మిన్) జీ చక్రవర్తి, డిప్లాయ్‌మెంట్ ఎస్పీ సయ్యద్ బాషా, ఎస్పీలు శ్రీనివాస్, రాంచందర్ రావు, అదనపు ఎస్పీలు, డీఎస్పీలు పాల్గొన్నారు. కిరణ్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ధైర్యంగా ఉండాలని ఓదార్చుతూ, శాఖ ఎప్పుడూ వారి వెంటే ఉంటుందని భరోసా కల్పించారు. విధుల్లో కలిసి నడిచిన త‌మ సహచరుడు లేకపోయినా.. అతని కుటుంబాన్ని ఒంటరిగా వదిలేయకుండా అండగా నిలిచిన తోటి జవాన్ల స్పందన మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.

Advertisement
Advertisement