త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Heavy Rains | భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి.. క‌లెక్ట‌ర్ల‌కు సీఎస్ కీల‌క ఆదేశాలు..

Heavy Rains | రాష్ట్రంలో రానున్న రెండు మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజ‌య్ జాజు ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను సూచించారు.

P

Telangana | Published On Jul 28, 2026, 5.38 pm IST

Heavy Rains | భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి.. క‌లెక్ట‌ర్ల‌కు సీఎస్ కీల‌క ఆదేశాలు..
Advertisement

Heavy Rains | రాష్ట్రంలో రానున్న రెండు మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజ‌య్ జాజు ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను సూచించారు. మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం నుంచి కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, జిల్లా ఎస్పీలతో సీఎస్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో నెలకొన్న వాతావరణ పరిస్థితులు, వ్యవసాయ ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళిక, వనమహోత్సవం కార్యక్రమాల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ రాష్ట్రంలోని ఐదు నుంచి ఆరు జిల్లాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైందని, మిగిలిన 26 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ శాఖ రూపొందించిన ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికను జిల్లాల్లో అమలు చేస్తున్నట్లు చెప్పారు.

రైతులకు అవసరమైన విత్తనాలు అందుబాటులో ఉంచేందుకు జిల్లాల వారీగా సీడ్ మేళాలు నిర్వహిస్తున్నామని, ప్రత్యామ్నాయ పంటల సాగుకు ముందుకొచ్చే రైతులకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. అదే సమయంలో ఐఎండీ తాజా అంచనాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా రానున్న రెండు రోజుల్లో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రధాన కార్యదర్శి సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ విపత్తు నిర్వహణ చర్యలను సమర్థంగా అమలు చేయాలని ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం (భద్రాచలం), ములుగు, నిర్మల్ జిల్లాల్లో ఇప్పటికే జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) బృందాలను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. అవసరమైతే హైదరాబాద్‌తో పాటు ఇతర కేంద్రాల్లో ఉన్న అదనపు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను ప్రభావిత ప్రాంతాలకు వెంటనే తరలించేలా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో ముఖ్య కార్య‌ద‌ర్శి అహ్మద్ నదీమ్, కార్య‌ద‌ర్శులు దాసరి హరిచందన, సురేంద్ర మోహన్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement