త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | హైడ్రాపై వెనక్కి తగ్గం.. మరింత బలోపేతం చేస్తాం

CM Revanth Reddy | హైడ్రాపై ఏ మాత్రమూ వెనక్కి తగ్గేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) స్పష్టం చేశారు. దొంగలు, కబ్జాదారులు, బీఆర్ఎస్‌ వారే.. హైడ్రా( HYDRAA )ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల్లో హైడ్రా ఏర్పాటు ముఖ్యమైనదని కొనియాడారు.

S

Telangana | Published On Jul 28, 2026, 6.15 pm IST

CM Revanth Reddy | హైడ్రాపై వెనక్కి తగ్గం.. మరింత బలోపేతం చేస్తాం
Advertisement

హైడ్రా పనులను కొనసాగిస్తాం
ఒక అధికారిని ఎక్కడ నియమించాలో
ప్రభుత్వానికే.. విచక్షణాధికారం ఉంటుంది
ఆ విచక్షణను ఎవ్వరూ గుంజుకోలేరు
మేం తెచ్చిన సంస్కరణల్లో
హైడ్రా ఏర్పాటు.. అతి గొప్పది...
ఫీజు రీయంబర్స్‌మెంట్ సమస్యను పరిష్కరిస్తాం
గత ప్రభుత్వపు బకాయిలే మాకు భారమయ్యాయి
కరువు బృందాలను పంపాలని కేంద్రాన్ని కోరాం
ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : హైడ్రాపై ఏ మాత్రమూ వెనక్కి తగ్గేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) స్పష్టం చేశారు. దొంగలు, కబ్జాదారులు, బీఆర్ఎస్‌ వారే.. హైడ్రా( HYDRAA )ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల్లో హైడ్రా ఏర్పాటు ముఖ్యమైనదని కొనియాడారు.రాష్ట్రంలో ఏర్పడిన కరుపు పరిస్థితులపై కేంద్రానికి విన్నవించి సాయం అడిగామని చెప్పారు. మంగళవారం ఆయన ఢిల్లీలో కేంద్ర వ్య‌వ‌సాయ‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌తో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.

ఆ అధికారం మాకే ఉంటుంది..

హైడ్రాపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. "హైకోర్టు తీర్పును నేనింకా పరిశీలించలేదు. హైడ్రా పనితీరుపై, కార్యాచరణపై మాకు పూర్తి స్పష్టత ఉంది. నగరంలో చెరువులు, నాలాలను కాపాడేందుకు, ప్రభుత్వ భూముల్లో కబ్జాలను అరికట్టేందుకు మేం హైడ్రాను ఏర్పాటు చేశాం. మేం తీసుకొచ్చిన సంస్కరణల్లో హైడ్రా ఏర్పాటు అతి గొప్పది. హైడ్రా .. చేసిన పనుల ద్వారా కబ్జాదారుల్లో చిక్కుకున్న భూమి ప్రభుత్వానికి అందింది. కోర్టు ధిక్కరణ కేసులు వేసిన వారంతా కబ్జాదారులే. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై 63 ధిక్కరణ కేసులు ఉన్నాయంటున్నారు. నాడు కేసీఆర్ హయాంలో చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్‌పైన 400 ధిక్కరణ కేసులు ఉన్నాయి. వాటి గురించి ఎందుకు మాట్లాడరు? హైకోర్టు తీర్పుపై మేం సమీక్షించుకుంటాం. ఒక అధికారిని ఎక్కడ నియమించాలనే విచక్షణాధికారం ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది. ఆ విచక్షణను మా నుంచి ఎవ్వరూ గుంజుకోలేరు. హైడ్రాను మరింత బలోపేతం చేస్తాం. హైడ్రా పనులను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాం" అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

ఇక నుంచి ఫీజు రీయంబ‌ర్స్‌మెంట్ ..పెండింగ్ ఉండదు

ఫీజు రీయంబర్స్‌మెంట్ చెల్లింపులపై బీజేపీ, బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి ఇలా బదులిచ్చారు. " ఏటా ఫీజు రీయంబర్స్‌మెంట్ వ్యయం రూ. 2800 కోట్ల వరకు ఉంటుంది. దాన్ని ఇక నుంచి ఎప్పటికప్పుడు అదే విద్య సంవత్సరంలో చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. గత ప్రభుత్వం రూ. 8 వేల కోట్ల ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలను మిగిల్చి పోయింది. ఇప్పుడవే మాకు భారంగా మారాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ కృష్ణయ్య.. మాపై విమర్శలు చేసేముందు.. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఏపీలో రూ. 10 వేల కోట్ల రీయంబర్స్‌మెంట్ బిల్లులు క్లియర్ చేయాలి. ఆ తర్వాతే మా గురించి మాట్లాడితే బావుంటుంది.." అని చెప్పారు.

కరువు బృందాలను పంపాలని కోరాం

కేంద్ర వ్యవసాయ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో భేటీ వివరాలను సీఎం రేవంత్ రెడ్డి.. మీడియాకు వెల్లడించారు. " కరువు పరిస్థితులను పరిశీలించి.. కరువు బృందాలను పంపాలని కోరాం. ఇందిరమ్మ ఇండ్లు, ఉపాధి హమీ పనులపై లిఖిత పూర్వకంగా విన్నవించాం. రాష్ట్ర పర్యటనకు రమ్మని కేంద్ర మంత్రిని ఆహ్వానించాం" అని చెప్పారు.

11.56 లక్షల ఇండ్లు ఇవ్వండి

కాగా అంతకు ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర వ్య‌వ‌సాయ‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌తో భేటీ అయ్యారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా తెలంగాణకు 11.56 లక్షల ఇండ్లు కేటాయించాలని కోరారు. ఎల్ నినో నేపథ్యంలో.. రైతుల జీవనోపాధి మెరుగు కోసం ఉపాధి హామీ పథకంలో 10 కొత్త పనులను చేర్చాలని సీఎం విజ్ఞప్తి చేశారు. కూరగాయల పందిళ్లు, పశుగ్రాస ప్లాట్లు, మల్బరీ తోటలు, పట్టు పురుగుల పెంపక షెడ్లు వంటి పనులను ఉపాధి హామీలో చేర్చాలని కోరారు. ఇందిరమ్మ ఇండ్ల పనులను కూడా ఉపాధి హామీ పనుల జాబితాలో చేర్చి ల‌బ్ధిదారుల‌కు 90 రోజులు ప‌ని క‌ల్పించాల‌ని విన్నవించారు.

Advertisement
Advertisement