లోడ్ అవుతోంది...


ఆరోగ్య శాఖలో 9572 ఉద్యోగాల భర్తీ..
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రతి పోస్టును భర్తీ చేస్తాం..
ఆరోగ్య తెలంగాణే మా లక్ష్యం
మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడి
Damodar Raja Narasimha | త్రినేత్ర.న్యూస్ : త్వరలోనే మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరోగ్య శాఖలో 9572 ఉద్యోగాలు భర్తీ చేశామని, మరో 7267 ఉద్యోగాల భర్తీ చివరి దశలో ఉందని దామోదర రాజనర్సింహ తెలిపారు. మంగళవారం కోటిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీ గ్రౌండ్‌లో 1257 మంది ల్యాబ్ టెక్నీషియన్లకు(గ్రేడ్-2) ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి మంత్రి దామోదర రాజనర్సింహ అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా వేగంగా ఈ నియామక ప్రక్రియను పూర్తి చేశామన్నారు. 2024 సెప్టెంబర్ 11న నోటిఫికేషన్ విడుదల చేయగా, 2025 నవంబర్ నాటికి నియామక ప్రక్రియను పూర్తి చేశామన్నారు. మొత్తం 23,323 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా, 1257 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని మంత్రి తెలిపారు. డీఎంఈ పరిధిలో 764, డీపీహెచ్‌లో 300, టీవీవీపీలో 180, ఎంఎన్‌జేలో 13 మందికి పోస్టింగ్స్ ఇచ్చామన్నారు.
ఒకప్పుడు రోగి లక్షణాలను బట్టి వైద్యం చేసేవారు. కానీ నేడు రోగ నిర్ధారణ జరిగిన తర్వాతే చికిత్స ప్రారంభిస్తున్నారు. ల్యాబ్ టెక్నీషియన్లు ఇచ్చే రిపోర్టులే డాక్టర్లకు ప్రామాణికం. వైద్య వ్యవస్థకు మీరు కళ్లు, చెవుల్లాంటి వారు. మీ రిపోర్టుల్లో కచ్చితత్వం ఎంతో ముఖ్యం. ఎన్ఏబీఎల్ ప్రమాణాలకు అనుగుణంగా ప్రభుత్వ ల్యాబ్స్‌ను తీర్చిదిద్దాల్సిన బాధ్యత ల్యాబ్ టెక్నీషియన్లు తీసుకోవాలి అని మంత్రి సూచించారు.
నిరుద్యోగుల ఆకాంక్షలను నెరవేరుస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం గత రెండేళ్లలో 70 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసిందని మంత్రి గుర్తుచేశారు. ఒక్క ఆరోగ్య శాఖలోనే ఇప్పటివరకు 9,572 పోస్టులను భర్తీ చేశామని, మరో 7,267 పోస్టుల నియామక ప్రక్రియ వివిధ దశల్లో ఉందని తెలిపారు. ఆర్థిక శాఖ అనుమతి ఉన్న మరో 996 పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని, అదనంగా 2,344 పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు పంపామని మంత్రి స్పష్టం చేశారు.
తెలంగాణను ఆరోగ్య రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఉస్మానియా నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన, ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంపు, ప్రతీ జిల్లాలో ఎన్‌సీడీ క్లినిక్స్, క్యాన్సర్ డే కేర్ సెంటర్లు, ట్రాన్స్‌జెండర్ల కోసం మైత్రి క్లినిక్స్, గాంధీ ఆసుపత్రిలో ఉచిత ఐవీఎఫ్ సేవలు అందుబాటులోకి తెచ్చామని వివరించారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ను సెకండరీ హెల్త్ కేర్‌గా మారుస్తున్నామని మంత్రి వెల్లడించారు.





Developed & Published by TRINETHRA MEDIA HOUSE PVT. LTD,
Sai Madhu Towers, Plot No. 17, Rohini Layout Rd, Jaihind Enclave, Madhapur, Hyderabad, Telangana 500081.
Copyright © 2025 . All rights reserved. - Powered by : Veegam