Harish Rao on Singareni Scams | సింగరేణిలో కాంగ్రెస్ వేల కోట్ల దోపిడీ.. రేవంత్ బామ్మర్దికే ఓబీ టెండర్లు: పీపీటీతో హరీష్ రావు సంచలన ప్రజెంటేషన్
సింగరేణిని కాంగ్రెస్ ప్రభుత్వం ఏటీఎంలా వాడుకుంటోందని మాజీ మంత్రి హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ బామ్మర్దికి టెండర్లు మొదలుకొని 40 లక్షల టన్నుల బొగ్గు మాయం వరకు ఆయన పీపీటీ ద్వారా బయటపెట్టిన స్కామ్‌ల వివరాలివే.
- మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో సింగరేణి కార్మికుల సమ్మేళనంలో పీపీటీ (PPT) ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వ స్కామ్‌లను వివరించిన హరీష్ రావు
- నిబంధనలు మార్చి సీఎం రేవంత్ రెడ్డి బామ్మర్ది సృజన్ రెడ్డికి ఓబీ (OB) టెండర్లు కట్టబెట్టారని సంచలన ఆరోపణ
- సోలార్ పవర్, జైపూర్ పవర్ ప్లాంట్, జెలటిన్ స్టిక్స్, డీజిల్ కొనుగోళ్లలో వేల కోట్ల అవినీతి జరిగిందని విమర్శలు
- రూ.1,600 కోట్ల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని, దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు సీబీఐ విచారణ వేయడం లేదని నిలదీత
Harish Rao on Singareni Scams | త్రినేత్ర.న్యూస్ : గత రెండున్నరేళ్లుగా కాంగ్రెస్ (Congress) పాలనలో సింగరేణి సంస్థను కుంభకోణాల ఖనిగా మార్చేశారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే ఈ స్కామ్‌లకు ప్రధాన సూత్రధారి అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ (BRS) నేత హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో నిర్వహించిన సింగరేణి కార్మికుల సమ్మేళనంలో ఆయన పీపీటీ ప్రజెంటేషన్ (PPT Presentation) ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, స్కామ్‌లను ఆధారాలతో సహా వివరించారు. ఈ వ్యవహారంలో మంత్రి భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
నిబంధనలు మార్చి.. బామ్మర్దికి టెండర్లు
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో లేని 'సైట్ విజిట్ సర్టిఫికెట్' (Site Visit Certificate) అనే కొత్త నిబంధనను తెచ్చి ఓబీ టెండర్లను (OB Tenders) కొల్లగొట్టారని హరీష్ రావు ఆరోపించారు. మైనస్ 20కి వెళ్లాల్సిన టెండర్‌ను ప్లస్ 15కు అప్పగించడం సింగరేణికి నష్టం కాదా అని ప్రశ్నించారు. ఈ నిబంధన ద్వారా లబ్ధి పొందిన మొదటి వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి బామ్మర్ది సృజన్ రెడ్డి అని, ఆయనకు చెందిన 'షోద కన్స్ట్రక్షన్స్'కు వెంకటేష్ ఖని ఓబీ టెండర్ కట్టబెట్టడం వాస్తవం కాదా? అని నిలదీశారు. కమీషన్ల కోసం సింగరేణిని ముంచుతామంటే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.
40 లక్షల టన్నుల బొగ్గు మాయం
సింగరేణిలో ఏకంగా రూ.1,600 కోట్ల విలువ చేసే 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయమైందని హరీష్ రావు ఆరోపించారు. రికార్డుల్లో గొప్పల కోసం తవ్వని బొగ్గును ఉన్నట్లుగా చూపిస్తూ, దానికి ఇన్కమ్ ట్యాక్స్, కోల్ సెస్ కడుతూ సంస్థ కొంప ముంచుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ జెన్కో వద్ద 25 లక్షల టన్నుల బొగ్గు ఉండాల్సి ఉంటే కేవలం 5 లక్షల టన్నులు మాత్రమే ఉందన్నారు. బొగ్గు నిల్వలు తనిఖీ చేయడానికి వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులను అడ్డుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.
వృథాగా వెయ్యి కోట్లు.. అప్పుల్లో సింగరేణి
సోలార్ పవర్ (Solar Power), జైపూర్ పవర్ ప్లాంట్ల పేరుతో సింగరేణి సంస్థ తీవ్రంగా నష్టపోయిందన్నారు. ఎన్టీపీసీ (NTPC) సోలార్ పవర్ మెగావాట్ రూ.3 కోట్లకు ఇస్తుంటే, సింగరేణి మాత్రం మెగావాట్‌కు రూ.7 కోట్లు వెచ్చించిందని, దీనివల్ల దాదాపు రూ.1000 కోట్లు వృథా అయ్యాయని తెలిపారు. జైపూర్ పవర్ ప్లాంట్‌కు తెలంగాణ ప్రభుత్వ అప్రూవల్ లేకున్నా రాజస్థాన్ ప్రభుత్వంతో పీపీఏ (PPA) చేసుకున్నారని, దీనివల్ల రోజుకు రూ.2.5 కోట్ల నష్టం వస్తోందన్నారు. కేవలం పదేళ్లలో బీఆర్ఎస్ రూ.6 వేల కోట్ల లాభాల్లో ఉంచిన సింగరేణిని.. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండున్నరేళ్లలో రూ.4,300 కోట్ల ఓడీ (OD) స్థాయికి దిగజార్చిందని, ఉద్యోగుల జీతాలకు కూడా అప్పులు తేవాల్సిన పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
డిపెండెంట్ ఉద్యోగాల్లో మహా మోసం
తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికుల పాత్ర మరువలేనిదని, అందుకే కేసీఆర్ 16 వేల మందికి డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చారని హరీష్ గుర్తుచేశారు. కానీ, రేవంత్ ప్రభుత్వం డిపెండెంట్ ఉద్యోగాలను బంద్ పెట్టి, వాటిపై విజిలెన్స్ ఎంక్వైరీ వేసి కార్మికులపై పగ తీర్చుకుంటోందని మండిపడ్డారు. కాంట్రాక్టులు, కమీషన్ల కోసం డీజిల్, జెలటిన్ స్టిక్స్ (Gelatin sticks) కొనుగోళ్లలో సైతం వందల కోట్ల కుంభకోణాలు చేశారని ఆరోపించారు.
బడే భాయ్, ఛోటే భాయ్ బంధం ఏంటి?
సింగరేణిలో 49 శాతం వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వం ఈ స్కామ్‌లపై ఎందుకు మౌనంగా ఉందని హరీష్ రావు ప్రశ్నించారు. అవినీతిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాస్తే.. ఆయన చర్యలు తీసుకోకుండా తిరిగి రేవంత్ రెడ్డికే లేఖ రాశారని ఎద్దేవా చేశారు. అసలు కిషన్ రెడ్డికి, రేవంత్ రెడ్డికి మధ్య ఉన్న 'బడే భాయ్ - ఛోటే భాయ్' బంధం ఏమిటో బయటపెట్టాలన్నారు. బొగ్గు శాఖకు సంబంధం లేకపోతే సింగరేణిలో అవినీతిపై తక్షణం సీబీఐ (CBI), సెంట్రల్ విజిలెన్స్ విచారణ జరిపించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. 'కాంగ్రెస్ కో హటావో.. సింగరేణి కో బచావో' అనే నినాదంతో కార్మికుల పక్షాన బీఆర్ఎస్ నిరంతరం పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు.
తాజావార్తలు
- ●Ilaiyaraaja | కాపీ రైట్ వివాదం కేసు.. ఢిల్లీ హైకోర్టులో మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజాకు షాక్..!
- ●Pasham Yadagiri | 'ఇడుపు కాయితం'పై ఎందుకంత రచ్చ? తెలంగాణ సీఎం రేవంత్ కాదు.. చంద్రబాబే
- ●TTD | శ్రీవారి భక్తులకు అలర్ట్.. నో హారన్ జోన్‌గా తిరుమల
- ●Harish Rao | సింగరేణి అధికారులు సమ్మెబాట పట్టడం చరిత్రలో తొలిసారి
- ●Hyderabad | అధిక వడ్డీ ఆశజూపి.. రూ. 50 కోట్లతో భార్యాభర్తలు పరార్
- ●Satavahana Express | జములాపురం ఉత్సవాలు.. వేళ శాతవాహన ఎక్స్‌ప్రెస్‌కు స్పెషల్ హాల్ట్

Ilaiyaraaja | కాపీ రైట్ వివాదం కేసు.. ఢిల్లీ హైకోర్టులో మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజాకు షాక్..!

Pasham Yadagiri | 'ఇడుపు కాయితం'పై ఎందుకంత రచ్చ? తెలంగాణ సీఎం రేవంత్ కాదు.. చంద్రబాబే

TTD | శ్రీవారి భక్తులకు అలర్ట్.. నో హారన్ జోన్‌గా తిరుమల

Harish Rao | సింగరేణి అధికారులు సమ్మెబాట పట్టడం చరిత్రలో తొలిసారి




