త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Peddapalli | రోడ్ల అభివృద్ధికి భారీగా నిధులు : మంత్రి కోమ‌టిరెడ్డి

Peddapalli | రాష్ట్రంలో రహదారి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తోందని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. రహదారుల అభివృద్ధితో పారిశ్రామిక, వ్యాపార కార్యకలాపాలు పెరిగి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చెప్పారు.

P

Telangana | Published On Aug 19, 2026, 7.18 pm IST

Peddapalli | రోడ్ల అభివృద్ధికి భారీగా నిధులు : మంత్రి కోమ‌టిరెడ్డి
Advertisement

Peddapalli | రాష్ట్రంలో రహదారి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తోందని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. రహదారుల అభివృద్ధితో పారిశ్రామిక, వ్యాపార కార్యకలాపాలు పెరిగి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చెప్పారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం గారెపల్లిలో బుధవారం రూ.219.67 కోట్ల విలువైన హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌, నాన్‌-ప్లాన్‌ రహదారి పనులకు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ప్రభుత్వ విప్‌ చింతకుంట విజయరమణారావు తదితరులతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ పనులను రెండేళ్లలో పూర్తి చేస్తామని, వారం రోజుల్లోనే క్షేత్రస్థాయి పనులు ప్రారంభమవుతాయని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో రూ.13 వేల కోట్లు, పంచాయతీరాజ్‌ శాఖలో మరో రూ.17 వేల కోట్లతో రహదారి పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇంత పెద్దఎత్తున రోడ్ల పనులు జరగడం లేదన్నారు. హెచ్‌ఏఎం విధానంలో ప్రాజెక్టు వ్యయంలో 40 శాతం ప్రభుత్వమే భరిస్తుందని, మిగిలిన 60 శాతం కాంట్రాక్టర్‌ భరిస్తారని వివరించారు. హైదరాబాద్‌–రామగుండం మధ్య కొత్త గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి నిర్మాణంపై కేంద్ర మంత్రితో చర్చించామని, ప్రతిపాదిత మార్గంలో సుల్తానాబాద్‌ బైపాస్‌కు అనుమతి సాధించేందుకు కృషి చేస్తామని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన నెలలోనే పెద్దపల్లి బైపాస్‌కు నిధులు మంజూరయ్యాయని, ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.

గత ప్రభుత్వం సుమారు రూ.40వేల కోట్ల పెండింగ్‌ బిల్లులు వదిలి వెళ్లిందని ఆరోపించారు. చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, తమ ప్రభుత్వం శ్రీపాద ఎల్లంపల్లి జలాశయం నుంచి నీటిని ఎత్తిపోస్తూ స్థానిక సాగుకు మద్దతు ఇస్తోందన్నారు. వాహనదారులు, ప్రజలు రహదారి భద్రతా నిబంధనలు పాటించి ప్రమాదాలను నివారించాలని సూచించారు. ఎమ్మెల్యే విజయరమణారావు జిల్లా అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్నారని ప్రశంసించారు.

Advertisement
Advertisement