త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Adilabad | మేన‌త్త కొడుకుని ప్రేమించింద‌ని.. చున్నీతో ఉరేసి చంపేశాడు..

Adilabad | మేన‌త్త కొడుకుని ప్రేమించినందుకు క‌న్న కూతుర్ని క‌ర్క‌షంగా చంపేశాడో తండ్రి. ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని అంద‌ర్నీ న‌మ్మించి నాలుగు గంట‌ల్లోపే అంత్య‌క్రియ‌లు పూర్తి చేశాడు.

G

Telangana | Published On Nov 26, 2026, 9.58 am IST

Adilabad | మేన‌త్త కొడుకుని ప్రేమించింద‌ని.. చున్నీతో ఉరేసి చంపేశాడు..
Advertisement

Adilabad | త్రినేత్ర న్యూస్‌: మేన‌త్త కొడుకుని ప్రేమించినందుకు క‌న్న కూతుర్ని క‌ర్క‌షంగా చంపేశాడో తండ్రి. ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని అంద‌ర్నీ న‌మ్మించి నాలుగు గంట‌ల్లోపే అంత్య‌క్రియ‌లు పూర్తి చేశాడు. అయితే అనుమానాస్పద మృతిపై ద‌ర్యాప్తు చేప‌ట్టిన పోలీసులు అస‌లు గుట్టు బ‌య‌ట‌పెట్టారు. ఈ ఘ‌ట‌న ఆదిలాబాద్‌ (Adilabad) జిల్లా నార్నూర్‌ మండలం ఉమ్రి గ్రామంలో జ‌రిగింది.

ఉమ్రి గ్రామానికి చెందిన అడే కైలాస్‌–సమిత్ర దంపతుల కుమార్తె కళ్యాణి (18)కి నార్నూర్‌కు చెందిన ఓ యువకుడితో పెండ్లి కుదిరింది. ఈ నెల 25న నిశ్చితార్ధం జరగాల్సి ఉంది. అయితే సోమ‌వారం (న‌వంబ‌ర్‌ 23న) ఉదయం తల్లిదండ్రులతో పాటు ప‌త్తి ఏరేందుకు చేనుకు వెళ్లిన‌ కళ్యాణి.. కొద్దిసేపటి తర్వాత కడుపునొప్పిగా ఉందని ఇంటికి తిరిగి వచ్చింది. సాయంత్రం వచ్చిన తల్లిదండ్రులు బిడ్డ దిగులుగా ఉండటాన్ని గమనించారు. ఇలా ఎందుకు ఉన్నావని ప్రశ్నించ‌డంతో మేనత్త కుమారుడిని ప్రేమిస్తున్నాని చెప్పింది.

దీంతో ఆమెపై కోపం పెంచుకున్న తండ్రి.. మంగళవారం వేకువజామున సుమారు 3 గంటల సమయంలో కుమార్తె ఉన్న గదికి వెళ్లి గొంతు నులిమి చంపేశాడు. మృతదేహాన్ని మరో గదిలోకి తీసుకెళ్లి చున్నీతో ఉరేసుకున్నట్లు చిత్రీకరించాడు. అనంతరం తన గదిలోకి వెళ్లి నిద్రపోయినట్లు నటించాడు. ఉదయం 5 గంటలకు నిద్రలేచిన తల్లి కుమార్తెను లేపేందుకు వెళ్లింది. మంచంపై కనిపించకపోవడంతో మరోవైపు చూడగా ఉరికి వేలాడుతూ విగతజీవిగా కనిపించింది. ఆమె పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి వ‌చ్చారు. ఇష్టం లేని పెండ్లి చేస్తుండ‌టంతో ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని అంద‌రినీ న‌మ్మించాడు. కొద్ది గంట‌ల్లోనే అంత్య‌క్రియ‌లు పూర్తిచేశాడు.

అయితే లంబాడా సంప్ర‌దాయం ప్ర‌కారం వివాహం కాని యువ‌తి చ‌నిపోతే ఖ‌న‌నం చేయ‌డం ఆన‌వాయితీ. అయితే క‌ళ్యాణీని ద‌హ‌నం చేయ‌డంతో అనుమానాల‌కు తావిచ్చింది. స్థానికుల స‌మాచారంతో ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు.. కుటుంబ స‌భ్యుల‌ను విచారించారు. పెండ్లి ఇష్టం లేక ఆత్మహత్య చేసుకుందని తండ్రి చెప్పాడు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతిపై దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో మృతురాలి తండ్రిని విచారించగా, పరువు పోతుందనే కారణంతో కుమార్తెను తానే హత్య చేసినట్లు అతడు అంగీకరించాడు.

Advertisement
Advertisement