త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Excise Constable Sowmya | మృత్యువుతో పోరాడి ఓడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య‌

Excise Constable Sowmya | గంజాయి బ్యాచ్‌ కారుతో ఢీ కొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడి నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృత్యువుతో పోరాడి ఓడింది.

S

Telangana | Published On Jan 31, 2026, 11.09 pm IST

Excise Constable Sowmya | మృత్యువుతో పోరాడి ఓడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య‌
Advertisement

Excise Constable Sowmya |

గంజాయి బ్యాచ్‌ కారుతో ఢీ కొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడి నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల‌ సౌమ్య(25) మృత్యువుతో పోరాడి ఓడింది. శ‌నివారం రాత్రి 9.41 గంట‌ల‌కు క‌న్నుమూసిన‌ట్లు నిమ్స్ వైద్యులు ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప శ‌నివారం సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. “ప్రస్తుతం ఆమె ఐసీయూలో అత్యవసర వైద్య పర్యవేక్షణలో ఉన్నారు. రక్తపోటు తీవ్రంగా పడిపోవడంతో అధిక మోతాదులో మందుల సహాయంతో రక్త ప్రసరణ కొనసాగించాల్సి వస్తోంది. అత్యధిక వైద్య ప్రయత్నాలు చేసినప్పటికీ రక్తపోటును స్థిరంగా నిలుపుకోవడం చాలా కష్టసాధ్యంగా మారింది. ఆమె శరీరంలోని పలు అవయవాల పనితీరు క్రమంగా దెబ్బతింటోంది. కిడ్నీ పనితీరుకు రెనల్ రీప్లేస్‌మెంట్ థెరపీ (డయాలిసిస్ విధానం), శ్వాసకు వెంటిలేటర్ సపోర్ట్, ఇతర అధునాతన లైఫ్ సపోర్ట్ చికిత్సలు అందిస్తున్నాము. అయినప్పటికీ చికిత్సకు శరీరం ఇచ్చే ప్రతిస్పందన పరిమితంగానే ఉంది. ప్రస్తుతం ఆమె స్పృహలో లేకుండా పూర్తి లైఫ్ సపోర్ట్‌పై ఉన్నారు. ఆధునిక క్రిటికల్ కేర్ పరికరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోంది. ఎమర్జెన్సీ మెడిసిన్, నెఫ్రాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, న్యూరాలజీ తదితర విభాగాల నిపుణుల బృందాలు రౌండ్ ది క్లాక్ సేవలు అందిస్తూ, పరిస్థితిని స్థిరపరచడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమె ప్రాణాలను కాపాడేందుకు అందుబాటులో ఉన్న ప్రతి వైద్య సహాయాన్ని అందిస్తూ, వైద్య బృందం నిరంతరంగా కృషి చేస్తోంది” అని నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప తెలిపారు.

మొత్తానికి ఈ హెల్త్ బులెటిన్ విడుద‌ల చేసిన కొన్ని గంట‌ల‌కే సౌమ్య తుదిశ్వాస విడిచారు. దీంతో ఆమె కుటుంబ స‌భ్యులు శోక‌సంద్రంలో మునిగిపోయారు. సౌమ్య మృతికి కార‌ణ‌మైన గంజాయి బ్యాచ్‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

ఈ కేసులో ముగ్గురు అరెస్ట్

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గ‌త శుక్ర‌వారం రాత్రి గంజాయి త‌ర‌లిస్తున్న స్మ‌గ్ల‌ర్లు తాము ప్ర‌యాణిస్తున్న కారుతో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య‌ను ఢీకొట్టిన కేసులో ఇప్ప‌టి వ‌ర‌కు ముగ్గురిని అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో మ‌తిన్, స‌ఫియుద్దీన్, స‌య్య‌ద్ సోహైల్ ఉన్నారు. సౌమ్య శరీరంలోని అవయవాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, ఓ కిడ్నీ తొలగించామని వైద్యులు తెలిపారు.

 

Advertisement

తాజావార్తలు

Advertisement