త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Niranjan Reddy | అసలు రైతులకు శిక్ష.. కౌలు రైతులపై కక్ష.. యూరియా యాప్‌పై నిరంజ‌న్ రెడ్డి ధ్వ‌జం

Niranjan Reddy | యూరియా పంపిణీ కోసం యాప్ విధానం అమలులోకి తేవడాన్ని మాజీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.

S

Telangana | Published On Dec 16, 2025, 5.23 pm IST

Niranjan Reddy | అసలు రైతులకు శిక్ష.. కౌలు రైతులపై కక్ష.. యూరియా యాప్‌పై నిరంజ‌న్ రెడ్డి ధ్వ‌జం
Advertisement

Niranjan Reddy | హైద‌రాబాద్ : యూరియా పంపిణీ కోసం యాప్ విధానం అమలులోకి తేవడాన్ని మాజీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. సినిమా టికెట్ల మాదిరే ఆన్‌లైన్‌లో యూరియా కోసం బుకింగ్ చేసుకునేందుకు వీలు క‌ల్పిస్తున్న‌ట్లు అగ్రిక‌ల్చ‌ర్ డైరెక్ట‌ర్ చేసిన ప్ర‌క‌ట‌న‌.. అస‌లు రైతుల‌కు శిక్ష‌.. కౌలు రైతుల‌పై క‌క్ష‌లా ఉంద‌ని మాజీ మంత్రి నిరంజ‌న్ రెడ్డి ధ్వ‌జ‌మెత్తారు.

ప్ర‌భుత్వ యూరియా పంపిణీ వ్య‌వ‌హారం ఆడ‌లేక మ‌ద్దెలోడు అన్న‌ట్లు ఉంద‌ని మాజీ మంత్రి విమ‌ర్శించారు. కాంగ్రెస్ పాలనలోనే యూరియా కొరత ఎందుకు వస్తోంది..? అని నిల‌దీశారు. టెనెన్సీ యాక్ట్ ప్రకారం ఇది అసలు రైతులు, కౌలు రైతుల మధ్య చిచ్చుపెట్టేలా ఉందని తెలిపారు. అసలు రైతులు ధైర్యంగా కౌలు ఇచ్చేందుకు ముందుకు వచ్చే సాహసం చేయకపోవచ్చు. ఈ చర్య సాగును తగ్గించే కుట్రలా కనిపిస్తుందని నిరంజ‌న్ రెడ్డి అన్నారు.

ఇంటి నుండే యూరియా బుకింగ్ అనే నిర్ణయం కూడా అనుమానాస్పదంగా ఉంది.. దళారులు రైతుల పేర్ల మీద యూరియా బుక్ చేసే అవకాశం ఉంది.. నిరక్షరాస్యులైన రైతులు, స్మార్ట్ ఫోన్ వాడడం రాని రైతులకు ఈ నిర్ణయంతో ఇబ్బంది త‌లెత్తె ప్ర‌మాదం ఉంద‌న్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో నెట్ వర్క్ లేని చోట సమస్యను ఎలా పరిష్కరిస్తారు? యూరియా వాడకంపై రైతులకు అవగాహన కల్పించకుండా సర్కారు పిల్లిమొగ్గలు వేస్తుంది. మొదట కొన్ని జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయకుండా మొత్తం రాష్ట్రంలో అమలు చేయాలనుకోవడం అనాలోచిత చర్య అని నిరంజ‌న్ రెడ్డి నిప్పులు చెరిగారు.

యూరియా ధర కన్నా రైతులకు రవాణా కిరాయి అధిక భారం పడేలా సర్కారు చర్యలు ఉన్నాయి. ఆధార్, పట్టాదార్ పాసుబుక్‌, ఓటీపీ, ఇదంతా ఓ ప్రహసనంగా ఉంది. కేసీఆర్ పాలనలో రాజులా బతికిన రైతు, కాంగ్రెస్ పాలనలో సాగు నుండి పంట అమ్మకాల వరకు అవస్థలు ఎదుర్కొంటున్నాడు. అధికారంలోకి వస్తే ఎకరాకు రూ.15 వేల రైతుభరోసా అన్నారు .. దానిని రూ.12 వేలకు కుదించి నాలుగు సార్లు ఎగ్గొట్టారు. కౌలు రైతులకూ రైతుభరోసా అని చెప్పి వారికి మొండి చేయి చూపించారు. ధాన్యం క్వింటాలుకు రూ.500 బోనస్ అన్నారు.. దాని జాడనే లేకుండా పోయింది.. పాత బకాయిలు ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందో అని రైతులు ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై కక్ష కట్టింది. అందుకే అడుగడుగునా అవాంతరాలు సృష్టిస్తున్నారు అని నిరంజ‌న్ రెడ్డి ధ్వ‌జ‌మెత్తారు.

 

Advertisement

తాజావార్తలు

Advertisement