త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | పేద విద్యార్థిని వైద్య విద్య కోసం.. త‌న ఇంటిని త‌న‌ఖా పెట్టిన హ‌రీశ్‌రావు

Harish Rao | మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్నారు. ఓ పేద విద్యార్థిని వైద్య విద్య కోసం త‌న సొంతింటిని హ‌రీశ్‌రావు తాక‌ట్టు పెట్టారు. రూ. 20 ల‌క్ష‌ల రుణం ఇప్పించి.. ఆ పేద విద్యార్థిని పీజీ వైద్య విద్య‌కు ఆర్థిక చేయూత‌నందించారు హ‌రీశ్‌రావు.

S

Telangana | Published On Dec 19, 2025, 1.42 pm IST

Harish Rao | పేద విద్యార్థిని వైద్య విద్య కోసం.. త‌న ఇంటిని త‌న‌ఖా పెట్టిన హ‌రీశ్‌రావు
Advertisement

Harish Rao | హైద‌రాబాద్ : మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్నారు. ఓ పేద విద్యార్థిని వైద్య విద్య కోసం త‌న సొంతింటిని హ‌రీశ్‌రావు తాక‌ట్టు పెట్టారు. రూ. 20 ల‌క్ష‌ల రుణం ఇప్పించి.. ఆ పేద విద్యార్థిని పీజీ వైద్య విద్య‌కు ఆర్థిక చేయూత‌నందించారు హ‌రీశ్‌రావు. అంతేకాకుండా హాస్ట‌ల్ ఫీజు నిమిత్తం రూ. ల‌క్ష అందించి ఆమె జీవితంలో హ‌రీశ్‌రావు వెలుగులు నింపారు.

సిద్దిపేట జిల్లాకు చెందిన కొంక మ‌మ‌త విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ఆమెక మహబూబ్‌నగర్‌లో ఉన్న ఎస్వీఎస్ మెడికల్ కాలేజీలో పీజీ (ఆప్తాల్మాలజీ) సీటు లభించింది. పీజీ వైద్య విద్య‌కు మూడేండ్ల పాటు ఏడాదికి రూ. 7.50 ల‌క్ష‌ల ట్యూష‌న్ ఫీజు చెల్లించాలి. కానీ మ‌మ‌త తండ్రి రామ‌చంద్రం వృత్తిరీత్యా టైల‌ర్. ఆయ‌న వ‌ద్ద అంత డ‌బ్బుల్లేవు. దీంతో ఎడ్యుకేష‌న్ లోన్ కోసం బ్యాంకును ఆశ్ర‌యించ‌గా, ఏదైనా ఆస్తిని త‌న‌ఖా పెట్టాల‌ని అధికారులు ఆదేశించారు. రామ‌చంద్రంకు సొంత ఆస్తులు లేక‌పోవ‌డంతో.. మాజీ మంత్రి హ‌రీశ్‌రావును సంప్ర‌దించారు. డిసెంబ‌ర్ 18లోగా ట్యూష‌న్ ఫీజు చెల్లించాల‌ని లేక‌పోతే అడ్మిష‌న్ ర‌ద్దు అవుతుంద‌ని హ‌రీశ్‌రావు దృష్టికి రామ‌చంద్రం తీసుకెళ్లారు. హ‌రీశ్‌రావు క్ష‌ణం కూడా ఆల‌స్యం చేయ‌కుండా బ్యాంకు యాజ‌మాన్యంతో మాట్లాడి.. సిద్దిపేట‌లోని త‌న సొంతింటిని త‌న‌ఖా పెట్టి రూ. 20 ల‌క్ష‌ల రుణం ల‌భించేలా స‌హాయం చేశారు.

పీజీ సీటు పోతుందని బాధపడ్డాను : మమత

మా అమ్మానాన్నలు కష్టపడి టైలరింగ్ చేస్తూ నన్ను ఎంబీబీఎస్ దాకా చదివించారు. అహర్నిశలు శ్రమించి పీజీ ప్ర‌వేశ‌ప‌రీక్ష‌లో సీటు దక్కిందని సంతోష పడ్డాను. ఉచితంగానే సీటు వచ్చినా కానీ ప్రతి సంవత్సరం ట్యూషన్ ఫీజు రూ.7.50 లక్షల చొప్పున మూడేళ్లు రూ.22.50 లక్షలు కట్టాలని చెప్పడంతో ఇక సీటు అసాధ్యమని అనుకున్నా. పీజీ చదివే యోగ్యం లేదని బాధపడ్డాను. కానీ ఆనాడు నాతో పాటు మా చెల్లెళ్ళకు ఎంబీబీఎస్ చదవడానికి హరీష్ రావు సార్ హెల్ప్ చేశారు. కానీ ఇది పెద్ద విషయం కావడంతో సార్ చేస్తారో.. లేదో అని టెన్షన్ పడ్డాము. మేము అడగడమే ఆలస్యం.. తన ఇంటిని బ్యాంకులో మార్టిగేజ్ చేసి ఎడ్యుకేషన్ లోన్ ఇప్పిస్తానని వెంటనే బ్యాంకు వారికి కూడా ఫోన్ చేసి చెప్పారు. చదువు విలువ, నిరుపేద విద్యార్థులు పడే ఇబ్బందుల గురించి క్షుణ్ణంగా తెలిసిన హరీష్ రావు సార్ మన సిద్దిపేట ఎమ్మెల్యే కావడం మనందరి అదృష్టం అని మ‌మ‌త ఆనంద భాష్పాలు రాల్చారు.

హరీషన్నది తీర్చుకోలేని రుణం : కొంక రామచంద్రం

నా బిడ్డ కష్టపడి చదివి ప్రభుత్వ కన్వీనర్ కోటాలో సీటు సంపాదించినప్పటికీ ఆర్థిక స్తోమత లేక ట్యూషన్ ఫీజు కూడా చెల్లించే పరిస్థితి లేదు. మేం చేసిన ప్రయత్నాలకు అన్ని దారులు మూసుకుపోయాయి. కానీ ఆపద వచ్చినవారి కోసం నిరంతరం తన ఇంటి తలుపులు తెరిచి ఉంచే హరీష్ అన్న ఏకంగా తన ఇంటిని మాకోసం తాకట్టు పెడతాడని కలలో కూడా ఊహించలేదు. నా నలుగురు బిడ్డలు హరీష్ అన్న స్ఫూర్తితోనే, ఆయన చేసిన సహాయంతోనే ఎంబీబీఎస్ వైద్య విద్య చదువుతున్నారు. పెద్ద బిడ్డ ప్రస్తుతం పీజీ సీటు దక్కించుకోగా.. రెండో అమ్మాయి ఎంబీబీఎస్ హౌస్ సర్జన్ చేస్తున్నది. మరో ఇద్దరు అమ్మాయిలు జగిత్యాలలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్నారు. సిద్దిపేట నియోజకవర్గంలోని 3 లక్షల మందిలో మేము ఒకరం. అంతే తప్ప మరెలాంటి సంబంధం లేదు. అయినా మా పాప భవిష్యత్తు కోసం ఒక్క క్షణం ఆలోచించకుండా తన ఇంటిని తాకట్టు పెట్టిన హరీష్ అన్న రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేము అని కొంక రామచంద్రం భావోద్వేగానికి లోన‌య్యారు.

Advertisement

తాజావార్తలు

Advertisement