త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | కొడంగ‌ల్ లంబాడీ బిడ్డ‌లే రేవంత్ రెడ్డికి రాజకీయ స‌మాధి క‌డుతారు : హ‌రీశ్‌రావు

Harish Rao | ప‌రిశ్ర‌మ‌ల పేరిట బడా బ‌డా కంపెనీల కోసం లంబాడీల భూములను సీఎం రేవంత్ రెడ్డి గుంజుకుంటున్నార‌ని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు. భ‌విష్య‌త్‌లో కొడంగ‌ల్ లంబాడీ బిడ్డే రేవంత్ రెడ్డికి రాజ‌కీయ స‌మాధి క‌డుతార‌ని హ‌రీశ్‌రావు హెచ్చ‌రించారు.

S

Telangana | Published On May 26, 2026, 3.05 pm IST

Harish Rao | కొడంగ‌ల్ లంబాడీ బిడ్డ‌లే రేవంత్ రెడ్డికి రాజకీయ స‌మాధి క‌డుతారు : హ‌రీశ్‌రావు
Advertisement

చేవెళ్ల డిక్లరేషన్ పేరుతో ఎస్సీ, ఎస్టీలకు ద‌గా
పోడు భూములకు పట్టాలు ఇస్తామని మోసం
50 వేల ఎకరాల ఎస్సీ, ఎస్టీ భూములను గుంజుకున్న దుర్మార్గ ప్రభుత్వం
తిరగబడిన లంబాడీ బిడ్డలకు బేడీలు వేసి జైళ్లకు పంపిండు
మోసం చేయడం తప్ప, రూపాయి ఇచ్చింది లేదు
ఈ పోరాటం ప్రతి తండాకు చేరాలి
ఖర్గే ఇంటి ముందు ధర్నా చేస్తం

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్ : ప‌రిశ్ర‌మ‌ల పేరిట బడా బ‌డా కంపెనీల కోసం లంబాడీల భూములను సీఎం రేవంత్ రెడ్డి గుంజుకుంటున్నార‌ని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు. భ‌విష్య‌త్‌లో కొడంగ‌ల్ లంబాడీ బిడ్డే రేవంత్ రెడ్డికి రాజ‌కీయ స‌మాధి క‌డుతార‌ని హ‌రీశ్‌రావు హెచ్చ‌రించారు. ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన లంబాడీ హక్కుల పోరాట సమితి ధర్నా కార్యక్రమంలో హ‌రీశ్‌రావు పాల్గొని ప్ర‌సంగించారు.

ఎల్‌హెచ్‌పీఎస్ ఆధ్వ‌ర్యంలో తెలంగాణ రాక‌ముందు అనేక ధ‌ర్నాలు ఇందిరా పార్క్ వ‌ద్ద చేశారు. హమారా తండా మే హమారా రాజ్ అని పోరాటం చేశారు. రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ఏనాడూ పట్టించుకోలేదు. కేసీఆర్ అధికారంలోకి వ‌చ్చాక 3146 తండాల‌ను గ్రామ‌పంచాయ‌తీలుగా తీర్చిదిద్ది.. లంబాడీల‌ను స‌ర్పంచ్‌లు చేశామ‌ని హ‌రీశ్‌రావు తెలిపారు.

రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పేందుకు సమరశంఖం

రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పేందుకు సమరశంఖం పూరించారు. ఇది ధర్నా కాదు, లంబాడీల ఆత్మ గౌరవ పోరాటం. మా గిరిజనులు మాటిస్తే మాట తప్పరు. సోనియా గాంధీ, రేవంత్ రెడ్డిలు చేవెళ్ల డిక్లరేషన్ అంటూ అనేక హామీలు గుప్పించారు. ఇవాళ కాంగ్రెస్ పాము అయ్యి కాటేస్తున్నది. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ అమలు చేస్తాం అని మోసం చేశారు. ఎన్నికల ముందు చేతులు జోడించారు, అధికారంలోకి వచ్చాక లంబాడీల చేతులకు బేడీలు వేశారు. భూములు గుంజుకోవద్దు అంటే ఆడవాళ్లు, గర్బిణులు చూడకుండా పోలీసులతో దాడులు చేయించారు, 45 మంది లంబాడీ బిడ్డలను జైల్లో పెట్టారని హ‌రీశ్‌రావు గుర్తు చేశారు.

కల్యాణ లక్ష్మి పథకం ప్రారంభ‌మైందే ఎస్సీల కోసం, ఎస్టీల కోసం

కల్యాణ లక్ష్మి పథకం ప్రారంభ‌మైందే ఎస్సీల కోసం, ఎస్టీల కోసం. ఆ తర్వాత అందరికీ పథకాన్ని విస్తరించారు. కేసీఆర్ లక్ష ఇచ్చిండు, మేం గెలిస్తే తులం బంగారం అన్నారు. పిల్లలు పుట్టిన తర్వాత కూడా కల్యాణ లక్ష్మి రావడం లేదు. కేసీఆర్ కిట్టు బంద్ పెట్టిండు రేవంత్ రెడ్డి. పుట్టిన బిడ్డకు రూ. 13 వేలు ఇవ్వడం బంద్ చేసిండు అని హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు.

చేవెళ్ల డిక్లరేషన్‌లో చెప్పిన ఒక్కటీ అమలు కాలేదు..

చేవెళ్ల డిక్లరేషన్‌లో చెప్పిన ఒక్కటీ అమలు కాలేదు. పోడు భూములకు పట్టాలు ఇస్తామని మోసం చేశారు. పట్టాలు ఇవ్వలేదు గానీ, 50వేల ఎకరాల ఎస్సీ, ఎస్టీ భూములు లాక్కున్నడు. పరిశ్రమల పేరిట బడా బడా కంపెనీల కోసం లాక్కున్నడు. భూముల గుంజుకుంటే అడ్డు తిరిగిన చేతులకు బేడీలు వేసిన రేవంత్‌కు బుద్ధి చెప్పాలి. కొడంగల్ లంబాడి బిడ్డలకు రేవంత్ రెడ్డికి రాజకీయ సమాధి కడతారని హెచ్చరిస్తున్నామ‌ని మాజీ మంత్రి పేర్కొన్నారు.

ఒక్క నోటిఫికేషన్ అయినా ఇచ్చావా రేవంత్

పది పాసైతే, ఇంటర్ పాసైతే, పీజీ పాసైతే డబ్బులు ఇస్తాం అన్నడు, ఒక్కరికీ ఇవ్వలేదు. నాలుగు ఐటీడీఏలు పెడుతం అన్నడు, కొత్తగా పెట్టలేదు. ఉన్న వాటికి రూపాయి ఇవ్వలేదు. నిధులు లేక ఐటీడీఏలు నీరసించి పోతున్నయి. కాంట్రాక్టుల్లో 12 శాతం రిజర్వేషన్లు అన్నడు, ఒక్క కాంట్రాక్టు ఇవ్వలేదు. బామ్మర్ది సృజన్ రెడ్డికి కాంట్రాక్టులు వచ్చాయి కానీ, లంబాడీలకు మాత్రం రాలేదు. బ్యాక్ లాగ్ పోస్టులు ఇస్తం అన్నడు, అదీ దిక్కు లేదు. రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని, 16వేల ఉద్యోగాలు ఇచ్చి చేతులు దులుపుకున్నడు. బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ కోసం ఒక్క నోటిఫికేషన్ అయినా ఇచ్చావా రేవంత్, గుండె మీద చేయి వేసుకొని చెప్పు అని డిమాండ్ చేశారు.

ఢిల్లీ వచ్చి మీ ఇంటి ముందు ధర్నా చేస్తం

ఇండ్లు కట్టుకుంటే ఎస్సీలకు, ఎస్టీలకు లక్ష రూపాయలు ఎక్కువ ఇస్తాం అన్నడు మాట తప్పిండు. సత్యవతి రాథోడ్‌కి ఎమ్మెల్సీ ఇచ్చి, మంత్రి పదవి ఇచ్చిండు కేసీఆర్. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంలో లంబాడీలకు మంత్రి పదవి లేదు. చిన్న చూపు చూస్తున్నడు. ఖర్గే నువ్వే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించావు, రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పు. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయించాలని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే నాలుగు రైళ్లు వేసుకొని ఢిల్లీ వచ్చి మీ ఇంటి ముందు ధర్నా చేస్తం, పోరాటం చేస్తాం. లంబాడీలు మంచి వాళ్లు, మోసం చేస్తే ఎంతకైనా తెగిస్తారని హెచ్చరిస్తున్నామ‌ని హ‌రీశ్‌రావు అన్నారు.

ఒక్క ఎకరాకు కూడా పట్టా ఇచ్చింది లేదు

కేసీఆర్ ఇచ్చిన ప్రతి మాట నిలుపుకున్నరు. విద్య ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లు కల్పించారు. మద్యం దుకాణాల్లో ఎస్టీలకు 5శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. పోడు భూములకు 4లక్షల 6వేల ఎకరాలకు పట్టా ఇచ్చింది బీఆర్ఎస్. పోడు భూములు ఇస్తమని చెప్పిన కాంగ్రెస్.. పోడు భూముల విషయంలో పొడించిందేం లేదు. ఒక్క ఎకరాకు కూడా పట్టా ఇచ్చింది లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గిరిజనుల మీద దాడులు పెరిగాయి, కేసులు పెడుతున్నార‌ని పేర్కొన్నారు.

సేవాలాల్ మహరాజ్‌ను కాంగ్రెస్ పార్టీ అవమాన పరిచింది

సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించింది బీఆర్ఎస్. ఏడాదికి రెండు కోట్ల రూపాయలు ఇచ్చి రాష్ట్ర పండుగగా నిర్వహించారు. బంజారాహిల్స్‌లో ఎకరం జాగా ఇప్పించి ఆత్మగౌరవ భవనాన్ని అద్బుతంగా కట్టించారు. వ్యాపారాలు చేసుకునేందుకు టిఎస్ ప్రైడ్ పెట్టి 13200 మందికి 800 కోట్లు ఇచ్చింది బిఆర్ఎస్. ఆడపిల్లలు చదువుకోవడానికి మహిళా డిగ్రీ రెసిడెన్షియల్ పెట్టించారు. రుణమాఫీ విషయంలో దేవుళ్ల మీద ఒట్టు పెట్టి మాట తప్పినోడు రేవంత్ రెడ్డి. సేవాలాల్ మహరాజ్‌ను కాంగ్రెస్ పార్టీ అవమాన పరిచింది. సేవాలాల్ మహరాజ్ పేరిట కార్పొరేషన్ పెట్టి ఒక్క రూపాయి ఇవ్వలేదు.కుమ్రం భీం కార్పొరేషన్, ఏకలవ్య కార్పొరేషన్‌కు ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఎస్సీ కార్పొరేషన్‌కు రూ. 2730 కోట్లు బడ్జెట్‌లో పెట్టి చేసిన ఖర్చు రూ. 50కోట్లు. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదు. నేను చాలెంజ్ చేస్తున్నా.. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రెండున్నరేళ్ల ద్వారా నయా పైసా ఇచ్చిన పాపాన పోలేదు. ఇచ్చింది ఏం లేదు, 50వేల భూములు గుంజుకున్నడు. ఎస్సీలకు, ఎస్టీలకు లోన్లు ఇస్తే పర్సంటెజీలు రావు అందుకే ఇవ్వడు. ఇందిరా పార్కులో ఇది ఆరంభం.. రేపు తండా తండాలో నగారా మోగాలి. తండాల నుంచి ఢిల్లీ పోయి ఖర్గే ఇంటి ముందు ధర్నా చేద్దాం. మల్లిఖార్జున్ ఖర్గే మీరంటే గౌరవం. దయచేసి ఇచ్చిన డిక్లరేషన్ అమలు చేయండి, రేవంత్ కు బుద్ధి చెప్పి అమలు చేయించండి అని హ‌రీశ్‌రావు కోరారు.

Advertisement

తాజావార్తలు

Advertisement