త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | క‌రువు కోర‌ల్లో తెలంగాణ‌.. ప‌ట్టింపు లేని త‌నంతో కాంగ్రెస్ స‌ర్కార్

Harish Rao | కరువు, ఎల్‌నినో పరిస్థితులు రాష్ట్రంలో ఉంటే ప్రభుత్వం పట్టింపులేని తనంతో ఉంది అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు.

S

Telangana | Published On Oct 12, 2026, 3.30 pm IST

Harish Rao | క‌రువు కోర‌ల్లో తెలంగాణ‌.. ప‌ట్టింపు లేని త‌నంతో కాంగ్రెస్ స‌ర్కార్
Advertisement

రైతుల‌తో చిన్న పిల్ల‌ల ఆట‌లాడుతున్నారా..?
అన్న‌దాత‌ల ప‌ట్ల ఈ ప్ర‌భుత్వానికి ఎందుకింత నిర్ల‌క్ష్యం
యాసంగిలో పంట‌లు వేయొద్దంటే..
రైతులు, రైతు కూలీలు ఎలా బ‌త‌కాలి..?
రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయిలా మారింది
రేవంత్ స‌ర్కార్ తీరుపై హ‌రీశ్‌రావు ఫైర్

Harish Rao | త్రినేత్ర న్యూస్ : కరువు, ఎల్‌నినో పరిస్థితులు రాష్ట్రంలో ఉంటే ప్రభుత్వం పట్టింపులేని తనంతో ఉంది అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు. తెలంగాణ భ‌వన్‌లో బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు సోమ‌వారం మీడియాతో మాట్లాడారు.

రైతులంతా ఈరోజు ఉదయం 11 గంటలకు రైతు వేదికలకు రావాలని, సీఎం మాట్లాడతారు అని నిన్న మెసేజ్‌లు పంపారు. 12 గంటలకు సీఎం వీడియో కాన్ఫరెన్స్ ఉంటుంది అని నిన్న రాత్రి ఎమ్మెల్యేలకు మెసేజ్ పంపారు. ఉదయం 9.52 నిమిషాలకు వీడియో కాన్ఫరెన్స్ రద్దు అని పంపారు. మళ్లీ 11 గంటలకు ఉంటుందని మెసేజ్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్లీ రద్దు చేశారు. ఇప్పుడు మధ్యాహ్నం ఒంటి గంటకు సీఎం రాడు కానీ డిప్యూటీ సీఎం వస్తాడు అని చెబుతున్నారు. రాష్ట్ర రైతులతో చిన్నపిల్లల ఆటలాడుతున్నారా? మొన్న ముఖ్యమంత్రి అధ్యక్షతన సమావేశం ఉంటుందని పొంగులేటి చెప్పారు. సీరియస్‌గా మాట్లాడతాం అన్నారు. నిన్న ముఖ్యమంత్రి గోవా వెళ్లారు. మంత్రులు డిల్లీ వెళ్ళారు. పొంగులేటి మాటలు తుస్సు అయ్యాయని హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు.

ప్రభుత్వానికి ఉన్న బాధ్యత ఇదేనా?

వ్యవసాయ శాఖ అధికారులు రైతులందరూ రావాలని పిలిచారు. ఆ తర్వాత టెక్నికల్ సెషన్ అన్నారు. తర్వాత సీఎస్, ఆ తర్వాత డిప్యూటీ సీఎం మాట్లాడతారని చెప్పారు. ఇంత తీవ్రమైన సమస్యపై ప్రభుత్వానికి ఉన్న బాధ్యత ఇదేనా? కేబినెట్ సమావేశం లేదు. వీడియో కాన్ఫరెన్స్ కూడా సక్రమంగా నిర్వహించలేని పరిస్థితి. రైతుల పట్ల, రాష్ట్రం పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో అర్థమవుతోంది అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

రైతులు పంటలు వేయకపోతే ఏం చేయాలి?

ఎల్‌నినో ప్రభావంపై గత తొమ్మిది నెలలుగా ప్రపంచ శాస్త్రవేత్తలు, భారత ప్రభుత్వ సంస్థలు హెచ్చరిస్తున్నా ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోయింది. తొమ్మిది నెలలుగా రైతుల కోసం తీసుకున్న చర్యలేంటో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. పంటలు వేయొద్దంటూ లీకులు ఇప్పించి వార్తలు రాయిస్తున్నారు. రైతులు పంటలు వేయకపోతే ఏం చేయాలి? రైతు కూలీల పరిస్థితి ఏంటి? రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు ఎలా బతకాలి? ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతో బల్లలు చరిచారు తప్ప, క్షేత్రస్థాయిలో ఏం చేశారు? దళిత, గిరిజన కుటుంబాలంటే ఈ ప్రభుత్వానికి చిన్నచూపా? కాంట్రాక్టులు, విదేశీ పర్యటనలకు సమయం ఉంటుంది కానీ, పేదలకు భరోసా కల్పించడానికి సమయం లేదా? అసలు ప్రత్యామ్నాయ కార్యాచరణ ఏది? తుమ్మల, పొంగులేటి రైతులకు ఉచిత సలహాలు ఇవ్వడం కాదు.. ప్రభుత్వం ఏం చేయబోతుందో స్పష్టంగా చెప్పాలి. రైతులు రైతు కూలీలు వలసలు పోవాలా? అని హ‌రీశ్‌రావు నిల‌దీశారు.

పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని ఢిల్లీకి వెళ్తారా?

పాలమూరు జిల్లా కూలీలు ఉపాధి కోసం కర్ణాటకకు వలస వెళ్లి రోడ్డు ప్రమాదంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. గద్వాల జిల్లాకు చెందిన పలువురు కూలీలు ప్రమాదానికి గురయ్యారు. వారిలో ఇద్దరు, ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఎక్కువ మంది దళిత బిడ్డలే. మేం అధికారంలో ఉన్నప్పుడు వలసలు పోయిన వారిని తిరిగి తీసుకొచ్చాం. కాంగ్రెస్ పాలనలో మళ్లీ పొట్ట చేత పట్టుకుని వలసలు వెళ్లే పరిస్థితి వచ్చింది. ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? యాసంగిలో పంటలు వేయొద్దంటే రైతులు, రైతు కూలీలు ఎలా బతకాలి? కేబినెట్ సమావేశం నిర్వహించి స్పష్టమైన నిర్ణయం తీసుకోలేరా? రైతుల సమస్యల కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని ఢిల్లీకి వెళ్తారా? ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉంటే కనీసం వీడియో కాన్ఫరెన్స్‌లోనైనా పాల్గొనలేరా? అని ప్ర‌శ్నించారు.

బూతులు మాట్లాడాలంటే ముందుంటారు

రైతులకు భద్రత కల్పించాలి. భరోసా ఇవ్వాలి. కానీ ఈ ప్రభుత్వం రైతులను భయపెడుతోంది. ఈ రెండు బాధ్యతల్లోనూ పూర్తిగా విఫలమైంది. రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయిలా మారింది. బొగ్గు కొరతకు, విద్యుత్ కోతలకు మీ నిర్లక్ష్యమే కారణం. బొగ్గు లేదంటే ఎల్‌నినో అంటారు. కరెంట్ లేదంటే ఎల్‌నినో అంటారు. నీళ్లు లేవంటే ఎల్‌నినో అంటారు. అసలు బొగ్గు కొరతకు ఎల్‌నినోకు సంబంధం ఏమిటి? నైనీ బొగ్గు గనిలోని బొగ్గును తీసుకొచ్చి ముందుగానే నిల్వలు ఎందుకు ఏర్పాటు చేసుకోలేదు? మీ ముందుచూపు లేమి, వైఫల్యం, నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి ఏర్పడింది. బూతులు మాట్లాడాలంటే ముందుంటారు. డైవర్షన్ రాజకీయాలు చేయాలంటే ముందుంటారు. కానీ రైతుల సమస్యలు పరిష్కరించాల్సి వస్తే మాత్రం పట్టించుకోరు అని హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు.

కరెంట్ కొరత తెలంగాణలోనే ఎందుకు ఉంది?

ఇతర రాష్ట్రాలు ముందుగానే అప్రమత్తమై విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ ప్రభుత్వం మాత్రం యూనిట్‌కు రూ.10, రూ.15 పెట్టినా విద్యుత్ దొరకడం లేదని చెబుతోంది. ముందు ఎందుకు ఒప్పందాలు చేసుకోలేదు. అక్కడ లేని కరెంట్ కొరత తెలంగాణలోనే ఎందుకు ఉంది? మీ నిర్లక్ష్యమే కారణం కాదా? రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా ఆరు నుంచి ఏడు గంటల విద్యుత్ కూడా సక్రమంగా రావడం లేదు. చేతికొచ్చిన పంటలు ఎండిపోతున్నాయి. పొలాల్లో ఉండాల్సిన రైతులు సబ్‌స్టేషన్ల ముందు ఆందోళనలు చేస్తున్నారు. మీ పాలన పాపం రైతులకు శాపంగా మారిందని ధ్వ‌జ‌మెత్తారు.

రిజర్వాయర్లను మూడేళ్లయినా ఎందుకు నింపలేకపోతున్నారు?

నీళ్లు ఉన్నా మోటార్లు నడపలేని అసమర్థ ప్రభుత్వం. కృష్ణా నీళ్లను 700 వందల కిలోమీటర్ల దూరంలోని కుప్పానికి చంద్రబాబు తరలిస్తున్నడు. 500 టీఎంసీల కృష్ణా జలాలను మళ్లించామని చెబుతున్నడు. కానీ తెలంగాణలో దేవాదుల ప్రాజెక్టు మోటార్లు నడపరు. కన్నెపల్లి పంప్‌హౌస్‌ను సక్రమంగా వినియోగించరు. పాలమూరు నీళ్లను ఎత్తకుండా, ఇక్కడి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడం వల్ల ఇతర ప్రాంతాలకు నీళ్లు తరలించే పరిస్థితి వస్తోంది. పాలమూరు ప్రజలకు నీళ్లు అందించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అందుకే రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహిగా మిగిలిపోతున్నారు. కేసీఆర్ ట్రయల్ రన్ నిర్వహించిన ప్రాజెక్టుల రిజర్వాయర్లను మూడేళ్లయినా ఎందుకు నింపలేకపోతున్నారు? సమ్మక్క సాగర్ వద్ద ఈరోజు కూడా సుమారు 30 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంది. దాదాపు రెండున్నర టీఎంసీల నీరు ప్రవహిస్తోంది. అలాంటి పరిస్థితిలో దేవాదుల మోటార్లు నడపమంటే ఎనిమిది గంటలే నడుపుతామని చెబుతున్నారు. మీ అసమర్థత వల్లే వరంగల్ జిల్లాలో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. మోటార్లను ఆన్ అండ్ ఆఫ్ చేస్తే వాటి జీవితకాలం తగ్గుతుందని చెప్పినా పట్టించుకోలేదు. పది మోటార్లు నడవాల్సిన దేవాదులలో రెండు మోటార్ల బేరింగులు దెబ్బతిన్నాయి. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు. కల్వకుర్తిలో ఐదు మోటార్లను 24 గంటలూ నడిపితే పాలమూరులో సగం ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయవచ్చు. మూడేళ్లుగా పనులు సక్రమంగా చేసి ఉంటే పాలమూరు ప్రాజెక్టులో 50 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉండేది. మీ వైఫల్యం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

దసరాకు మద్యం కొరత ఉండకూడదట..

బొగ్గు లేక కరెంట్ లేదు. కరెంట్ లేక నీళ్లు లేవు. నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. సింగూరు ప్రాజెక్టును ఎందుకు నిర్లక్ష్యం చేశారు? గత ఏడాది సింగూరు ప్రాజెక్టులో 29 టీఎంసీల నీరు ఉండేది. ప్రాజెక్టును ఏడాదిలో బాగు చేస్తామని చెప్పి, ఉన్న నీటిని వదిలేశారు. కానీ ఒక్క పని కూడా పూర్తి చేయలేదు. సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలతో పాటు హైదరాబాద్‌కు నీటిని అందించే కీలకమైన సింగూరు ప్రాజెక్టు నేడు ఖాళీగా ఉంది. మరమ్మతులు చేయడంలో ఎందుకు విఫలమయ్యారు? దీనికి బాధ్యులెవరు? బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ప్రస్తుతం ప్రాజెక్టులో మూడు టీఎంసీల నీరు మాత్రమే ఉందని, అందులో ఒక టీఎంసీ డెడ్ స్టోరేజీ అని చెబుతున్నారు. మిగిలిన నీటిలోనూ బీర్, లిక్కర్ కంపెనీల ఉత్పత్తికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎక్సైజ్ మంత్రి లిక్కర్ ఉత్పత్తి పూర్తి స్థాయిలో ఉండాలని, ఎక్కడా నీటి కొరత లేదన్నట్లు మాట్లాడుతున్నారు. దసరాకు మద్యం కొరత ఉండకూడదట. మద్యం కంపెనీలకు నీళ్లు అందుబాటులో ఉంటాయి. కానీ తాగునీరు, సాగునీటి కోసం మాత్రం ప్రజలు ఇబ్బందులు పడాలా? అని నిల‌దీశారు.

రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి ఎందుకింత చిన్నచూపు?

బీడీఎల్, ఓహెచ్‌ఈఎల్, ఐఐఐటీ హైదరాబాద్ వంటి సంస్థలకు నీటి వినియోగంపై నోటీసులు ఇస్తున్న పరిస్థితి ఏర్పడింది. సింగూరు ప్రాజెక్టుకు మరమ్మతులు చేయకుండా నిర్లక్ష్యం చేశారు. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక ఏమిటి? రైతులపై కేసులు.. నీటి దుర్వినియోగంపై చర్యలేవి? వ్యవసాయం అనేది రైతులకు జీవనాధారం. జూరాలలో కళ్లముందే నీళ్లు కనిపిస్తున్నా, ఎండిపోతున్న పంటలను కాపాడుకునేందుకు గేట్లు తెరిచి నీళ్లు తీసుకున్న రైతులపై 14 మందికి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. లగచర్ల రైతుల చేతులకు బేడీలు వేశారు. దేశానికి అన్నం పెట్టే రైతులు తమ పంటలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తే కేసులు పెడతారా? తాగు, సాగునీటికి ఇబ్బందులు ఉన్న సమయంలో బీర్ కంపెనీలకు నీళ్లు ఎలా కేటాయిస్తున్నారు. పంట పొలాలకు నీళ్లు తీసుకున్న రైతులపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టిన మీరు, తాగు, సాగు నీళ్లను బీర్ల ఉత్పత్తి కోసం పంపిస్తుంటే ఎందుకు కేసులు పెట్టరు. అలాంటి నిర్ణయాలు తీసుకునే వారిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదు? రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి ఎందుకింత చిన్నచూపు? అని ప్ర‌శ్నించారు.

రైతులకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలి

రైతు బీమా ఎక్కడ? రైతులకు భరోసా ఏది? రైతు బీమా అమలు నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. ఆగస్టు నుంచి ఎంతోమంది రైతులు చనిపోయినా, వారి కుటుంబాలకు బీమా సొమ్ము అందడం లేదు. మేం ఆవేదనతో మాట్లాడుతున్నాం. ప్రభుత్వం ఉచిత సలహాలు ఇవ్వడం కాదు.. రైతులకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలి. కేంద్రానికి లేఖ రాసి చేతులు దులుపుకుంటే సరిపోదు. ప్రజలను భయపెట్టడం కాదు.. ‘మేమున్నాం’ అని ధైర్యం చెప్పాలి. కరోనా సమయంలో కేసీఆర్ ప్రజలకు అండగా నిలిచారు. ప్రజలను కడుపులో పెట్టుకుని కాపాడుకున్నారు. కానీ నేడు ఈ ప్రభుత్వం బొగ్గు నిల్వలు ఏర్పాటు చేసుకోలేక, నీటిని ఎత్తిపోసే మోటార్లు నడపలేక, రైతులకు సాగునీరు అందించలేక చేతులెత్తేసింది. రైతుల పంటలకు నీళ్లు ఇవ్వకుండా మద్యం కంపెనీలకు నీళ్లు ఇస్తున్నారు దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు.

పక్క రాష్ట్రాల్లో లేని కరువు తెలంగాణలోనే ఎందుకు వచ్చింది?

పక్క రాష్ట్రాల్లో లేని కరువు తెలంగాణలోనే ఎందుకు వచ్చింది? ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలు, నిర్లక్ష్యం వల్లే రైతులు రోడ్డున పడుతున్నారు. జూపల్లి ఈరోజు పాలమూరుకు వెళ్లి మోటార్లు నడిపిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారని ప్రకటించారు. ఏది లేదు. రైతుల సమస్యలను పక్కనపెట్టి ఢిల్లీ రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. నీళ్లు ఉన్న చోట మోటార్లు నడపండి. ప్రాజెక్టులను వినియోగంలోకి తీసుకురండి. రాజకీయాలను పక్కనపెట్టి రైతుల గురించి ఆలోచించండి. రైతు కూలీలకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించండి. రైతులను భయపెట్టడం మానేసి, వారికి భరోసా ఇవ్వాలి. రైతు బంధు, రైతు బీమా సహా అన్ని పథకాల నిధులను తక్షణమే విడుదల చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. పంటలు వేయొద్దు అనే ఉచిత సలహాలు ఇవ్వడం మానేసి, కరెంట్ కోతలు, నీటి కొరత పై సమగ్ర కార్యచరణ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

ఈ మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, సంజయ్, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, దూదిమెట్ల బాలరాజు, అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి, బీసీ కమిషన్ మాజీ సభ్యులు కిషోర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement