త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Singareni | రామగుండం కోల్‌మైన్‌కు పర్యావరణ అనుమతులు.. 25 ఏండ్ల‌పాటు బొగ్గు తవ్వకాలు

Singareni | సింగరేణి (Singareni) సంస్థ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వినూత్నమైన రామగుండం కోల్‌మైన్ (Ramagundam Coal Mine) ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ శాఖ ప్రాథమిక అనుమతుల మంజూరుకు అంగీకారం తెలిపింది.

G

Telangana | Published On May 3, 2026, 12.14 pm IST

Singareni | రామగుండం కోల్‌మైన్‌కు పర్యావరణ అనుమతులు.. 25 ఏండ్ల‌పాటు బొగ్గు తవ్వకాలు
Advertisement

Singareni | త్రినేత్ర‌.న్యూస్‌: సింగరేణి (Singareni) సంస్థ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వినూత్నమైన రామగుండం కోల్‌మైన్ (Ramagundam Coal Mine) ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ శాఖ ప్రాథమిక అనుమతుల మంజూరుకు అంగీకారం తెలిపింది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ నుంచి సింగరేణి యాజమాన్యానికి సమాచారం అందింది. మరో 10 రోజుల్లో అనుమతి పత్రాలు రానున్నాయి. దీంతో సంస్థ సీఎండీ డాక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి, డైరెక్టర్లు, అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించిన‌ట్ల‌యింది. సింగరేణి చరిత్రలోనే అత్యధికంగా ఏడాదికి 210 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సామర్థ్యంతో రూపొందించిన ఈ వినూత్న ప్రాజెక్టుకు ప్రాథమిక పర్యావరణ అనుమతులు లభించడం పట్ల సంస్థ యాజ‌మాన్యం హర్షం వ్య‌క్తం చేసింది.

మూతపడుతున్న పాత గనుల ఉత్పత్తిని భర్తీ చేయడానికి, ఇప్పటికే కనీస అనుమతులు ఉన్న 2 ఓపెన్ కాస్ట్ (Opencast) గనులు, 3 భూగర్భ గనుల పరిధిలోని బొగ్గును ఇంకా తవ్వి తీయటానికి అనువుగా ఉన్న 314.98 మిలియన్ టన్నుల నిల్వలను ఉత్పత్తి చేయడానికి ఈ ప్రాజెక్టును రూపొందించారు. ఇక్కడ ఉత్పత్తి చేసే బొగ్గు ప్రధానంగా సమీపంలోని ఎన్టీపీసీ రామగుండం, ఇతర బొగ్గు ఆధారిత పరిశ్రమలకు సరఫరా చేయనున్నారు.

బొగ్గును గరిష్టంగా వెలికి తీయడమే లక్ష్యం

మూతపడిన జీడీకే-10 ఇంక్లైన్, మూతపడనున్న వకీల్‌పల్లి భూగర్భ గనులను ఓపెన్ కాస్ట్ గనులుగా మార్చి అక్కడ మిగిలి ఉన్న బొగ్గును సంపూర్ణంగా వెలికి తీయడంతో పాటు, ఈ గనులకు ఆనుకొని ఉన్న రామగుండం ఓపెన్ కాస్ట్-1 విస్తరణ ప్రాజెక్టు ఫేజ్ 2, రామగుండం ఓపెన్ కాస్ట్-2 విస్తరణ ప్రాజెక్టు, అడ్రియాల షాఫ్ట్ అండర్ గ్రౌండ్ విస్తరణ ప్రాజెక్టుల అంచులలో మిగిలిన బొగ్గును కూడా గరిష్టంగా వెలికి తీయడానికి రామగుండం కోల్ మైన్ అనే ఒక విశిష్ట ప్రాజెక్టుకు కంపెనీ రూపకల్పన చేసింది. ఇప్పటికే ఉన్న అనుమతులను సద్వినియోగం చేస్తూ తక్కువ పెట్టుబడులతో, పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా బొగ్గు ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా దీన్ని తయారు చేశారు. మూతపడుతున్న గనుల ఉత్పత్తిని భర్తీ చేసుకోవడంతోపాటు ఈ గని రామగుండం రీజియన్‌కు మరో 25 ఏండ్ల జీవిత కాలాన్ని అందించనుంది.

అనేక విశిష్టతలు..

సాధారణంగా భూగర్భంలో బొగ్గు తవ్వకం అయిపోయిన తర్వాత కూడా కొంతమేర బొగ్గు గనిలో మిగిలిపోతుంది. దానిని సద్వినియోగం చేసుకోవడానికి గతంలో మూతపడిన భూగర్భ గనుల ప్రదేశంలో ఓపెన్ కాస్ట్ గనులను ప్రతిపాదించి అనుమతులు సాధించి బొగ్గు తవ్వకాల‌ను సింగ‌రేణి విజయవంతంగా నిర్వహించింది. వీటిలో కొత్తగూడెంలోని గౌతమ్ ఖని ఓపెన్ కాస్ట్ గని, మణుగూరులో మణుగూరు ఓపెన్ కాస్టు గని మరికొన్ని ఓసీ గనులతో పాటు తాజాగా కొత్తగూడెంలోని వీకే కోల్ మైన్‌ను పేర్కొనవచ్చు.

ఇదే తరహాలో రామగుండం-1 ఏరియాలో మూతపడిన జీడీకే-10 ఇంక్లైన్ గనిలో మిగిలి ఉన్న 56.79 మిలియన్ టన్నుల బొగ్గు, రామగుండం-2 ఏరియాలో త్వరలో మూతబడనున్న వకీల్ పల్లి గనిలో మిగిలి ఉండే 28.99 మిలియన్ టన్నుల బొగ్గును వెలికి తీయడం కోసం అక్కడ ఓపెన్ కాస్ట్ తరహా మైనింగ్ జరపాలని నిర్ణ‌యించింది. దీంతోపాటు ఈ రెండు గనులకు ఆనుకొని ఉన్న రామగుండం ఓపెన్ కాస్ట్-1 విస్తరణ ప్రాజెక్టు ఫేజ్-2కు మధ్య సరిహద్దు ప్రాంతంలో రక్షణ నిమిత్తం వదిలేసిన 25.98 మిలియన్ టన్నుల బొగ్గు, ఇంకా ఈ గనులకు పక్కన అటు ఇటు ఉన్న బొగ్గు నిల్వలు 3.90 మిలియన్ టన్నులు, రామగుండం ఓపెన్ కాస్ట్-2 విస్తరణ ప్రాజెక్టు, అడ్రియాల షాఫ్ట్ అండర్ గ్రౌండ్ విస్తరణ గనుల సరిహద్దు తలాల వద్ద మిగిలి ఉన్న బొగ్గును కూడా ఈ ప్రాజెక్టు కిందనే తవ్వి తీయాలని నిర్ణయించింది.

దీనిలో ఓపెన్ కాస్ట్ గనుల ప్రాంతం నుంచి 182.28 మిలియన్ టన్నుల బొగ్గు, భూగర్భ గనుల ప్రాంతం నుండి 132.70 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉత్పత్తి చేయనున్నారు. ఇక్కడి సగటు బొగ్గు గ్రేడు జీ-10 గా గుర్తించబడింది. ఈ మొత్తం 5 గనుల పరిధిలోని బొగ్గును తవ్వడం కోసం ఇప్పటికే ఉన్న అనుమతులకు అదనంగా మరికొన్ని అనుమతులను సాధించాలని నిర్ణయించి రామగుండం కోల్ మైన్ అనే పేరుతో ఒక కొత్త ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంది.

ప్రాజెక్టు ఎలా ప్రారంభమవుతుంది?

ముందుగా మూతపడిన జీడికే-10 ఇంక్లైన్ భూగర్భ గనిని ఓపెన్ కాస్ట్ గనిగా మారుస్తారు. దీనిని ఓపెన్ కాస్ట్-1 గనిని ముందుకు కొనసాగిస్తూ షావెల్-డంపర్ పద్ధతిలో తవ్వుతూ వెళ్తారు. ఈ క్రమంలో వచ్చే ఓవర్ బర్డెన్ మట్టిని ప్రస్తుతం ఆర్‌జీఓసీ-1 ఎక్స్ టెన్షన్ ఫేజ్-2 లో బొగ్గు తవ్వగా ఏర్పడిన ఖాళీ ప్రదేశంలో నింపుతూ వస్తారు. ఇలా జీడీకే-10 ఇంక్లైన్ ప్రాంతంలోని బొగ్గు తవ్వకానికి 8 ఏండ్ల‌ సమయం పడుతుంది. ఆ తర్వాత వకీల్ పల్లి గనిని ఓపెన్ కాస్ట్ గనిగా మారుస్తారు. ఈ క్రమంలో వకీల్ పల్లి ఓపెన్ కాస్ట్ గని ప్రాంతం నుంచి వచ్చే ఓవర్ బర్డెన్ మట్టిని అప్పటికే తవ్వకం పూర్తయిన జీడీకే-10 ఇంక్లైన్ క్వారీలో ఏర్పడే ఖాళీ ప్రదేశంలో నింపుతారు. ఈ విధంగా రెండు భూగర్భ గనులను ఓపెన్ కాస్ట్ గనులుగా మార్చినప్పటికీ ఆ క్వారీలలో అక్కడ ఉత్పత్తి జరిగే ఓవర్ బర్డెన్ మట్టితోనే నింపుతారు.

దీనిని ఒక భారీ పర్యావరణహిత చర్యగా పేర్కోవచ్చు. అలాగే రామగుండం కోల్‌మైన్‌లో భాగంగా ఉన్న ఇతర ఓపెన్ కాస్ట్ గనుల బొగ్గు తవ్వకాలను కొనసాగిస్తారు. ఈ మొత్తం బొగ్గు తవ్వకాన్ని లాంగ్ వాల్, కంటిన్యూయస్ మైనర్, బోర్డర్ మైనర్స్, రోడ్డు హెడర్స్ ద్వారా అలాగే షావెల్-డంపర్ ప్రక్రియలో నిర్వహిస్తారు. ఈ మొత్తం ప్రాజెక్టుకు 4326.08 హెక్టార్ల విస్తీర్ణం గల భూమి అవసరం ఉంది. ఈ ప్రాజెక్టులో మొత్తం 5,403 మంది సింగరేణి ఉద్యోగులు గాను, మరో 600 మంది కాంట్రాక్టు సిబ్బంది గాను పని చేయనున్నారు. మొత్తం 2,194.05 కోట్ల రూపాయల మూల పెట్టుబడులతో ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు.

ఒక వరంగా ఆర్‌జీ కోల్‌మైన్

రామగుండం రీజియన్ లోని 3 ఏరియాలలో కొన్ని పాత గనులు మూతపడుతున్నందు వల్ల సింగరేణి సంస్థ ఆ గనుల్లోని ఉద్యోగులకు వేరే చోట పని కల్పించడానికి, బొగ్గు ఉత్పత్తి లోటు తీర్చడానికి ఈ ఆర్.జి కోల్ మైన్ ఒక వరంగా మారనున్నదని చెప్పవచ్చు. ఈ ప్రాజెక్టులో సుమారు 5,500 మంది ఉద్యోగులకు పని చేసే అవకాశం లభించబోతోంది. వ్యాపారపరంగా కూడా సింగరేణికి ఇది ఒక అద్భుత అవకాశం. రామగుండంలోని ఎన్టీపీసీ కి సింగరేణి సంస్థ దశాబ్దాల కాలంగా బొగ్గు సరఫరా చేస్తుంది. సింగరేణికి ఉన్న అతి పెద్ద వినియోగదారు ఎన్టీపీసీ. పాత గనులు మూతపడుతున్న నేపథ్యంలో తగినంత బొగ్గును ఎన్టీపీసీ కి అందించలేని పరిస్థితి ఏర్పడేది కానీ రామగుండం కోల్ మైన్ కు అనుమతి రావడం వల్ల ఎన్టీపీసీతో సింగరేణి వ్యాపార బంధం ఎటువంటి అవాంతరాలు లేకుండా కొనసాగనుంది. కనుక సింగరేణికి ఈ కొత్త ప్రాజెక్టు ఒక వరప్రదాయనిగా పేర్కొనవచ్చు.

 

Advertisement
Advertisement