త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Singareni | అల్పాహారంతో ఆరోగ్యం.. చదువుతో ఉజ్వల భవిష్యత్తు!

Singareni | బొగ్గు గనుల్లో వెలుగులు నింపే సింగరేణి.. ఇప్పుడు విద్యార్థుల భవిష్యత్తుకూ బాసటగా నిలుస్తోంది. పేద, గ్రామీణ విద్యార్థులకు ఉదయాన్నే పౌష్టికాహారం అందించి.. చదువుపై మరింత శ్రద్ధ పెట్టేలా చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పానికి తన వంతు సహకారం అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న బ్రేక్‌ఫాస్ట్‌ పథకం కోసం ఏకంగా రూ.61.44 కోట్ల కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధులను కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది ప్రాంతాల్లో సెంట్రలైజ్డ్ కిచెన్లను ఏర్పాటు చేస్తోంది.

P

Telangana | Published On Nov 27, 2026, 5.07 pm IST

Singareni | అల్పాహారంతో ఆరోగ్యం.. చదువుతో ఉజ్వల భవిష్యత్తు!
Advertisement
  • బ్రేక్‌ఫాస్ట్‌ పథకానికి సింగరేణి రూ.61.44 కోట్ల సీఎస్ఆర్ నిధులు
  • తొమ్మిది ప్రాంతాల్లో సెంట్రలైజ్డ్ కిచెన్లు..
  • 4 లక్షల మందికి పైగా విద్యార్థులకు లబ్ధి
  • సుమారు 8వేల పాఠశాలల్లో ప్రతిరోజూ ఉచితంగా పౌష్టిక అల్పాహారం

Singareni | బొగ్గు గనుల్లో వెలుగులు నింపే సింగరేణి.. ఇప్పుడు విద్యార్థుల భవిష్యత్తుకూ బాసటగా నిలుస్తోంది. పేద, గ్రామీణ విద్యార్థులకు ఉదయాన్నే పౌష్టికాహారం అందించి.. చదువుపై మరింత శ్రద్ధ పెట్టేలా చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పానికి తన వంతు సహకారం అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న బ్రేక్‌ఫాస్ట్‌ పథకం కోసం ఏకంగా రూ.61.44 కోట్ల కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధులను కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది ప్రాంతాల్లో సెంట్రలైజ్డ్ కిచెన్లను ఏర్పాటు చేస్తోంది. వీటి ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న నాలుగు లక్షల మందికి పైగా విద్యార్థులకు ప్రతిరోజూ ఉచితంగా అల్పాహారం అందనుంది. దాదాపు 8 వేల పాఠశాలలు ఈ పథకం పరిధిలోకి రానున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మార్గదర్శకత్వంలో హరే కృష్ణ ఫౌండేషన్ ఈ కిచెన్ల నిర్వహణ బాధ్యతలు చేపడుతోంది. విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారం అందించేందుకు వీలుగా ఆధునిక వసతులతో వంటశాలలను ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా ఉదయం పూట ఆకలితో పాఠశాలకు వచ్చే చిన్నారులకు పౌష్టికాహారం అందించడంతో పాటు వారి విద్యాభ్యాసానికి ప్రభుత్వం, సింగరేణి అండగా నిలుస్తున్నాయి.

ఇప్పటికే నాలుగు ప్రాంతాల్లో ప్రారంభం

బ్రేక్‌ఫాస్ట్‌ పథకం అమలులో భాగంగా తొలిదశలో కొడంగల్‌లో రూ.2 కోట్లతో నిర్మించిన సెంట్రలైజ్డ్ కిచెన్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం మధిర, మంథని, మంచిర్యాల ప్రాంతాల్లోనూ వంటశాలలు అందుబాటులోకి వచ్చాయి. ఈ మూడు ప్రాంతాల్లో కిచెన్ల ఏర్పాటుకు సింగరేణి రూ.21.03 కోట్ల సీఎస్ఆర్ నిధులను వెచ్చించింది. మిగిలిన సింగరేణి, కొత్తగూడెం, సూర్యాపేట జిల్లా మునగాల, కాగజ్‌నగర్, భూపాలపల్లి ప్రాంతాల్లో కిచెన్ల నిర్మాణానికి మరో రూ.38.41 కోట్లను కేటాయించింది. దీంతో మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో పథకానికి అవసరమైన వంటశాలలు అందుబాటులోకి రానున్నాయి.

జిల్లాల వారీగా కిచెన్లు.. కేటాయింపులివీ!

కొత్తగూడెం ప్రాంతంలో 23 మండలాల పరిధిలోని 1,310 పాఠశాలలకు అల్పాహారం అందించేందుకు రూ.8.75 కోట్లతో కిచెన్ ఏర్పాటు చేస్తున్నారు. సూర్యాపేట ప్రాంతంలో హుజూర్‌నగర్, కోదాడ, సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లోని 1,029 పాఠశాలల కోసం రూ.9.61 కోట్లతో వంటశాల నిర్మిస్తున్నారు. మధిర ప్రాంతంలో 16 మండలాల్లోని 879 పాఠశాలలకు సేవలందించేలా రూ.7.53 కోట్లతో కిచెన్ ఏర్పాటు చేశారు. దీనిని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఖమ్మం జిల్లాలోని సింగరేణి ప్రాంతంలో 11 మండలాల పరిధిలోని 639 పాఠశాలలకు అల్పాహారం అందించేందుకు రూ.8.96 కోట్లతో కిచెన్ ఏర్పాటు చేయనున్నారు. కాగజ్‌నగర్ ప్రాంతంలో ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల పరిధిలోని 1,008 పాఠశాలల కోసం రూ.7.53 కోట్లు కేటాయించారు. మంచిర్యాల ప్రాంతంలో 18 మండలాల్లోని 757 పాఠశాలలను కవర్ చేస్తూ రూ.7.53 కోట్లతో వంటశాల ఏర్పాటు చేశారు. మంథని ప్రాంతంలో పెద్దపల్లి జిల్లాలోని 19 మండలాల్లో ఉన్న 711 పాఠశాలలకు అల్పాహారం అందించేందుకు రూ.5.97 కోట్లతో కిచెన్ నిర్మించారు. భూపాలపల్లి ప్రాంతంలో ఏడు మండలాల పరిధిలోని 229 పాఠశాలల కోసం రూ.3.56 కోట్లతో వంటశాల ఏర్పాటు చేయనున్నారు.

ఆరోగ్యానికి పౌష్టికాహారం.. చదువుకు ప్రోత్సాహం

విద్యార్థులకు ఉదయాన్నే నాణ్యమైన ఆహారం అందించడం వెనుక బలమైన లక్ష్యం ఉంది. ముఖ్యంగా గ్రామీణ, పేద కుటుంబాలకు చెందిన పిల్లలు ఉదయం అల్పాహారం తీసుకోకుండానే పాఠశాలలకు వస్తుంటారు. దీనివల్ల చదువుపై ఏకాగ్రత తగ్గడంతో పాటు ఆరోగ్యంపైనా ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రభుత్వం బ్రేక్‌ఫాస్ట్‌ పథకాన్ని అమలు చేస్తోంది. పౌష్టికాహారం అందించడం ద్వారా విద్యార్థుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, తరగతి గదిలో ఏకాగ్రత పెంచడం, పాఠశాలలకు హాజరు శాతం మెరుగుపరచడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. చదువును మధ్యలోనే మానేసే విద్యార్థుల సంఖ్య తగ్గించేందుకు కూడా ఈ పథకం దోహదపడుతుందని విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు పాఠశాల భవనాలు, మౌలిక వసతుల కల్పన వంటి కార్యక్రమాలకు సీఎస్ఆర్ నిధులు అందించిన సింగరేణి.. ఇప్పుడు విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభివృద్ధికి సైతం పెద్దపీట వేస్తోంది. బొగ్గు ఉత్పత్తితో రాష్ట్రానికి వెలుగులు అందిస్తున్న సంస్థ.. భావితరాల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే సామాజిక కార్యక్రమాల్లోనూ తనదైన ముద్ర వేస్తోంది. ఆకలి లేని ఉదయం.. అక్షరాలతో నిండిన భవిష్యత్తు అనే లక్ష్యానికి తన వంతు చేయూతనిస్తోంది.

Advertisement
Advertisement