త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

LPG Cylinder Shortage | వాణిజ్య సిలిండ‌ర్ల కొర‌త‌.. హైద‌రాబాద్‌లో దోస‌, పూరీ బంద్‌.. టీ, కాఫీ కూడా!

LPG Cylinder Shortage | ఇరాన్- అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ (Iran Israel War) ప్ర‌భావం హోట‌ల్ రంగాన్ని భారీగా దెబ్బ‌తీస్తున్న‌ది. ప‌శ్చిమాసియా దేశాల ప‌ర‌స్ప‌ర దాడుల కార‌ణంగా పెట్రో ఉత్పత్తుల దిగుమతికి ఆటంకాలు ఎదురవుతున్నాయి. దీంతో దేశంలో వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్పీజీ గ్యాస్‌ సరఫరాపై (LPG Cylinder Shortage) కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది.

G

Telangana | Published On Mar 11, 2026, 6.33 am IST

LPG Cylinder Shortage | వాణిజ్య సిలిండ‌ర్ల కొర‌త‌.. హైద‌రాబాద్‌లో దోస‌, పూరీ బంద్‌.. టీ, కాఫీ కూడా!
Advertisement

LPG Cylinder Shortage | త్రినేత్ర‌.న్యూస్‌: ఇరాన్- అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ (Iran Israel War) ప్ర‌భావం హోట‌ల్ రంగాన్ని భారీగా దెబ్బ‌తీస్తున్న‌ది. ప‌శ్చిమాసియా దేశాల ప‌ర‌స్ప‌ర దాడుల కార‌ణంగా పెట్రో ఉత్పత్తుల దిగుమతికి ఆటంకాలు ఎదురవుతున్నాయి. దీంతో దేశంలో వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్పీజీ గ్యాస్‌ సరఫరాపై (LPG Cylinder Shortage) కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. గృహావసరాలకు, అత్యవసర సేవలు అందించే ద‌వాఖాన‌లకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని చ‌మురు కంపెనీల‌కు స్ప‌ష్టం చేసింది. ఈ నేపథ్యంలో గ్యాస్‌ ఏజెన్సీలు కమర్షియల్‌ సిలిండర్ల సరఫరాను నిలిపివేశాయి. దీంతో ఇప్పటికే ముంబై, బెంగళూరు వంటి న‌గ‌రాల్లో 20 శాతం హోటళ్లు మూతపడ్డాయి. ఇక హైద‌రాబాద్‌లోనూ ఆ ప్ర‌భావం త్రీవంగానే చూపుతున్న‌ది. ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో హోట‌ళ్ల అసోసియేష‌న్ గాస్ ఎక్కువ‌గా వినియోగ‌మ‌య్యే ప‌లు వంట‌ల‌ను నిలిపివేసింది. మ‌రోవైపు రాష్ట్రంలోని ఇత‌ర ప్రధాన నగ‌రాల్లో అనేక హోట‌ళ్లు మూత‌ప‌డుతుండ‌గా, రాజ‌ధానిలోని పీజీలు, హాస్ట‌ళ్లు కూడా అదే దారిలో ప‌య‌ణిస్తున్నాయి.

రాష్ట్రంలో 1.49 కోట్ల గృహ వినియోగదారులు ఉండగా, నెలకు కోటికి పైగా సిలిండర్లు వినియోగమవుతున్నాయి. అలాగే 5 లక్షల వాణిజ్య కనెక్షన్లు ఉన్న‌ప్ప‌టికీ, వినియోగం మాత్రం దానికి రెట్టింపు స్థాయిలో ఉంటుంది. జీహెచ్ఎంసీ ప‌రిధిలో 25 వేలకు పైగా మ‌ధ్య‌ స్థాయి హోటళ్లు, రెస్టారెంట్లు ఉండగా.. చిన్న హోటళ్లు భారీగానే ఉన్నాయి. అదేవిధంగా స్టార్‌ హోటళ్లు, క్లబ్బులు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు కూడా పెద్ద సంఖ్య‌లో కొన‌సాగుతున్నాయి. ఇక మెస్‌లు, రోడ్డుపక్క చిన్న చిన్న హోటళ్ల గురించి ప్ర‌త్యేక చెప్పాల్సిన ప‌నిలేదు. చిన్న హోటళ్లు రోజుకు ఒక సిలిండర్, పెద్దవి 3 నుంచి 5 వినియోగిస్తుండ‌గా, వినియోగదారులను బట్టి రెస్టారెంట్లు, బార్లలో కూడా రోజుకు ఐదుకు తక్కువ కాకుండా సిలిండర్ల‌ వాడకం ఉంటుంది. స్టార్‌ హోటళ్లు రోజుకు 25 సిలిండర్లకు పైగా వినియోగిస్తుంటాయి. వాణిజ్య సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై కేంద్రం ఆంక్ష‌ల నేప‌థ్యంలో ప్ర‌స్తుతం ఇవ‌న్నీ గ‌డ్డు ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్నాయి.

టీ, కాఫీ బంద్‌..

ముఖ్యంగా హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌ హోటళ్ల అసోసియేషన్‌ టీ, కాఫీలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అదేవిధంగా వండేందుకు ఎక్కువ సమయం, నూనే తీసుకునే చపాతి, దోసె, పూరీ వంటి వంటలు కూడా అందుబాటులో ఉండవని తెలిపింది. న‌గ‌రంలోని పీజీ హాస్టళ్లు, మెస్‌లలోనూ వంటకు 90 శాతానికి పైగా గ్యాస్‌నే వినియోగిస్తున్నారు. ప్ర‌స్తుతం సిలిండర్ల కొరతతో ఇప్ప‌టికీ మెనూలో మార్పులు చేశారు. ఎక్కువసేపు వండే వంటలను తగ్గించి అన్నం, సాంబారు, పప్పు, రసం వంటివాటికే పరిమితం చేస్తున్నారు. రెండు, మూడురోజుల తర్వాత వాటిని కూడా పూర్తిగా నిలిపివేస్తామ‌ని నిర్వాకులు చెబుతున్నారు. సిలిండ‌ర్ల కొర‌త‌తో హాస్టళ్లను తాత్కాలికంగా మూసివేయడం త‌ప్ప మరో గ‌త్యంత‌రం లేద‌ని తెలిపారు.

మ‌రోవైపు గ్యాస్‌ కొరత, నిత్యావసరాల ధరలు పెరగడంతో హోటళ్లు ధరలు పెంచాయి. దోస, పూరీ, వడలపై కనీసం రూ.15 వరకు పెరిగాయి. ఇడ్లీ, ఉప్మాలాంటి వాటిపై రూ.10 పెంచారు. పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లలో 15 శాతం ధరలు పెంచారు. కాగా, వాణిజ్య సిలిండ‌ర్ల‌ సరఫరా నిలిచిపోతే హోటల్‌ రంగం మూతపడే పరిస్థితి ఏర్పడుతుందని తెలంగాణ రాష్ట్ర హోటళ్ల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది.

Advertisement
Advertisement