త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bhatti Vikramarka | ఆర్థిక ప‌రిస్థితి అనుకూలిస్తే అల్పాహారం : డిప్యూటీ సీఎం భ‌ట్టి

Bhatti Vikramarka | రాష్ట్రంలో ఆర్థిక ప‌రిస్థితి అనుకూలిస్తే ప్ర‌తి పాఠ‌శాల‌లో అల్పాహారం అందించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారు అని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క పేర్కొన్నారు. పిల్ల‌లు ఎదిగే వ‌య‌సులో వారికి పోషకాహారం అంద‌లేక ప‌రిపూర్ణంగా ఎద‌గ‌లేక‌పోతున్నారని భ‌ట్టి విక్ర‌మార్క తెలిపారు.

S

Telangana | Published On Jan 30, 2026, 5.07 pm IST

Bhatti Vikramarka | ఆర్థిక ప‌రిస్థితి అనుకూలిస్తే అల్పాహారం : డిప్యూటీ సీఎం భ‌ట్టి
Advertisement

భ‌విష్య‌త్‌లో రాష్ట్ర వ్యాప్తంగా అమ‌లు చేస్తాం..
భూసంస్క‌ర‌ణ‌ల‌కు ఆద్యుడు బూర్గుల‌..
గ్రంథాల‌య ఉద్య‌మంతో ప్ర‌జ‌ల్లో చైత‌న్యం..
ప్ర‌స్తుత పాల‌కుల‌కు బూర్గుల జీవితం ఆద‌ర్శం..
ప్ర‌పంచంతో పోటీ ప‌డాలంటే ఇంగ్లీష్ త‌ప్ప‌నిస‌రి..
ల‌క్ష్మీదేవిప‌ల్లికి నీళ్లు అందిస్తాం..
మొగిలిగిద్ద ప్ర‌భుత్వ పాఠ‌శాల వార్షికోత్స‌వ వేడుక‌ల్లో భ‌ట్టి వ్యాఖ్య‌లు

Bhatti Vikramarka | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలో ఆర్థిక ప‌రిస్థితి అనుకూలిస్తే ప్ర‌తి పాఠ‌శాల‌లో అల్పాహారం అందించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారు అని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క పేర్కొన్నారు. పిల్ల‌లు ఎదిగే వ‌య‌సులో వారికి పోషకాహారం అంద‌లేక ప‌రిపూర్ణంగా ఎద‌గ‌లేక‌పోతున్నారు. సీఎం సొంత నియోజ‌క‌వ‌ర్గం కొడంగ‌ల్‌లో అల్పాహారం పంపిణీ కార్య‌క్ర‌మాన్ని పైల‌ట్ ప్రాజెక్టుగా చేప‌ట్టారు. భ‌విష్య‌త్‌లో రాష్ట్ర వ్యాప్తంగా అల్పాహార భోజ‌నం అమ‌లు చేస్తామ‌ని ఆశిస్తున్నామ‌ని భ‌ట్టి విక్ర‌మార్క తెలిపారు. రంగారెడ్డి జిల్లాలోని మొగిలిగిద్ద ప్ర‌భుత్వ పాఠ‌శాల 150 వార్షికోత్స‌వం వేడుక‌ల‌కు భ‌ట్టి విక్ర‌మార్క ముఖ్య అతిథిగా హాజ‌రై ప్ర‌సంగించారు.

మొగిలిగిద్ద ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో చ‌దువుకున్న మ‌హానుభావుడు బూర్గుల రామ‌కృష్ణారావుపై మా అంద‌రికీ ఎన‌లేని భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో కూడిన గౌర‌వం ఉంది. ఆనాటి స‌మ‌స్య‌లు కానీ, వాటి ప‌రిష్కారం కోసం తీసుకున్న విప్ల‌వాత్మ‌క నిర్ణ‌యాలు అంద‌రికీ తెలిసి ఉండ‌క‌పోవ‌చ్చు. ఆ నిర్ణ‌యాలు ఇవాళ క‌న‌బ‌డుతున్నాయి. ఆనాడు తీసుకున్న నిర్ణ‌యాలు త‌ర‌త‌రాలుగా ఈ స‌మాజంలో ఉన్న కార్య‌క్ర‌మాల‌పై ప్ర‌భావం చూపిస్తున్నాయి. అవి చాలా గొప్ప నిర్ణ‌యాలు. భూమి కోసం, భుక్తి కోసం పోరాటం చేశారు. వెట్టి చాకిరి, జ‌మీందారి, జాగిర్దార్ వ్య‌వ‌స్థ‌కు వ్య‌తిరేకంగా పోరాటం చేశారు. అలాంటి ప‌రిస్థితుల్లో హైద‌రాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాప‌కుడిగా బూర్గుల ఖ్యాతిగాంచారు. ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాలోని కుగ్రామంలో పుట్టిన మ‌హానుభావుడు గొప్ప‌గా చ‌దువుకున్నారు అని భ‌ట్టి విక్ర‌మార్క తెలిపారు.

నిజాం నిరంకుశ పాల‌న‌కు వ్య‌తిరేకంగా బూర్గుల పోరాటం..

లాయ‌ర్‌గా ప‌ట్టా పుచ్చుకున్న త‌ర్వాత ప్రాక్టీస్ చేస్తున్న క్ర‌మంలో ఆయ‌న‌ను అనేక సామాజిక స‌మ‌స్య‌లు వెంటాడాయి. ఈ సామాజిక మార్పు కోసం త‌పించేవాడు. వృత్తిని కూడా వ‌దిలి రాజ‌కీయాల్లోకి వ‌చ్చి పెద్ద ఎత్తున గ్రంథాల‌య ఉద్య‌మాన్ని స్థాపించి ప్ర‌జ‌ల‌ను చైత‌న్య ప‌రుస్తూ నిజాం నిరంకుశ ప‌రిపాల‌న‌కు వ్య‌తిరేకంగా స్వాతంత్య్ర‌ పోరాటాన్ని సాగించిన గొప్ప మ‌హానుభావుడు బూర్గుల రామ‌కృష్ణారావు. అంత‌టి గొప్ప వ్య‌క్తి చ‌దువుకున్న పాఠ‌శాల ఇది అని భ‌ట్టి విక్ర‌మార్క కొనియాడారు.

రైతుల‌కు భూమిపై హ‌క్కు క‌ల్పించింది బూర్గుల‌నే..

ప్ర‌పంచంలో బ‌హుషా ఎక్క‌డా కూడా రైతులు తుపాకులు ప‌ట్టుకున్న చ‌రిత్ర లేదు. కానీ తెలంగాణ‌లో సాయుధ రైతాంగం పోరాటం జ‌రిగింది. రైతులు తుపాకులు ప‌ట్టుకుని భూమి కోసం పోరాటం చేశారు. అటువంటి పోరాటంలో వ‌చ్చిన నినాదాల‌పై తొలి హైద‌రాబాద్ సీఎంగా బూర్గుల అనేక చ‌ట్టాలు తీసుకువ‌చ్చారు. ఆ నినాదాల‌ను చ‌ట్టాలుగా మార్చి ఇక్క‌డి రైతుల‌కు భూమిపై హ‌క్కు క‌ల్పించాడు. అలాంటి గొప్ప సీఎం బూర్గుల‌. అప్ప‌టి వ‌ర‌కు రైతుకు భూమిపై ప‌ట్టా లేదు. అంద‌రూ కూలీలే. గౌర‌వంగా ఈ భూమి నాది అని రైతు చెప్పుకునే స్థాయికి బూర్గుల చ‌ట్టాలు తీసుకువ‌చ్చారు. ఈ దేశంలో భూసంస్క‌ర‌ణ‌లు తీసుకొచ్చిన ఆద్యుడు బూర్గుల. భూమి హ‌క్కుల‌పై దేశానికి ఒక ద‌శ దిశా నిర్దేశం చేశారు. ఆ త‌ర్వాత‌ భూమి హ‌క్కుల‌పై అనేక‌ చ‌ట్టాలు వ‌చ్చాయి. భూ సంస్క‌ర‌ణ‌ల చ‌ట్టాల‌కు పునాది వేసింది బూర్గుల‌నే అని చెప్పొచ్చు. పేద‌ల కోసం త‌పిస్తూ పాల‌న అందించారు. ఈ దేశంలోని ప్ర‌స్తుత పాల‌కుల‌కు ఆయ‌న జీవితం ఎంతో ఆద‌ర్శం. ఇందులో ఎలాంటి సందేహం లేదు అని డిప్యూటీ సీఎం స్ప‌ష్టం చేశారు.

ప్ర‌పంచంతో పోటీ ప‌డాలంటే ఇంగ్లీష్ త‌ప్ప‌నిస‌రి..

ఇక ఈ పాఠ‌శాల కూడా గొప్ప‌ది. తొలిసారిగా ఉర్దూ మీడియంలో ప్రారంభించ‌బ‌డింది. 1952లో తెలుగు మీడియంలో, 2008లో ఇంగ్లీష్ మీడియంలోకి వ‌చ్చింది. గ్లోబలైజేష‌న్‌లో భాగంగా ఇంగ్లీష్ మీడియం పెట్టాల‌ని నాటి సీఎం వైఎస్సార్ ప్ర‌వేశ‌పెట్టారు. ఇంగ్లీష్ మీడియంలో చ‌దివితేనే బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల పిల్ల‌ల‌కు ఉద్యోగ ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తాయ‌ని నాడు ఎమ్మెల్సీగా మండ‌లిలో నేను వాదించాను. ప్ర‌పంచంతో పోటీ ప‌డాలంటే ఇంగ్లీష్ నేర్చుకోవాల‌ని చెప్పి.. నాడు వైఎస్సార్ ఇంగ్లీష్ మీడియం స్కూళ్ల‌ను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించారు అని భ‌ట్టి గుర్తు చేశారు.

విద్య, వైద్యం కోసం ప్ర‌య‌త్నిస్తాం..

రాష్ట్రం ఆర్థికంగా అనుకూలంగా లేక‌పోయిన‌ప్ప‌టికీ విద్యా వ్య‌వ‌స్థ‌పై దృష్టి పెట్టాం. ఈ రాష్ట్రం సీఎం కానీ, స‌హ‌చ‌ర మంత్రులంద‌రి ఆలోచ‌న ఒక్క‌టే.. ఈ రాష్ట్ర ప్ర‌జ‌లు ఉన్న‌తంగా ఎద‌గాల‌ని, స‌ర్వ‌తోముఖంగా అభివృద్ధి చెందాల‌ని, ప్ర‌పంచంతో పోటీ ప‌డే విధంగా ఎద‌గాల‌ని మాన‌వ వ‌న‌రుల‌కు కావాల్సింది విద్య వైద్యం అని విశ్వ‌సించింది కాబ‌ట్టి ఈ పాఠశాల అభివృద్ధికి సీఎం 10 కోట్లు మంజూరు చేశారు. ఇవే కాదు.. ఈ రాష్ట్రంలో యంగ్ ఇండియా రెసిడెన్షియ‌ల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం. 25 ఎక‌రాల ప్రాంగ‌ణంలో 200 కోట్ల‌తో ఒక్కొక్క స్కూల్‌ను నిర్మిస్తున్నాం. కార్పొరేట్ ప్ర‌మాణాల‌తో ధీటుగా తీర్చిదిద్దుతున్నాం. 100 స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఎన్ని స‌మ‌స్య‌లు వ‌చ్చినా పిల్ల‌ల భ‌విష్య‌త్‌ను తీర్చిదిద్దాల‌ని నిర్ణ‌యించాం. ఈ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని కొందుర్గులో సీఎం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు శంకుస్థాప‌న చేశారు. ఎప్పుడో ఐటీఐలు పెట్టి అనాథ‌లుగా వ‌దిలేశారు. ప‌రిశ్ర‌మ‌లు కొత్త‌గా వ‌స్తున్న‌వి. అన్ని ఐటీఐ సెంట‌ర్స్‌ను అడ్వాన్స్ టెక్నాల‌జీ సెంట‌ర్స్‌గా ఏర్పాటు చేస్తున్నాం. యువ‌త‌కు నైపుణ్య శిక్ష‌ణ అందిస్తున్నాం. దీంతో ఉద్యోగ అవ‌కాశాలు ల‌భిస్తాయని ఆయ‌న పేర్కొన్నారు.

పేద విద్యార్థుల క‌ష్టాలు తెలుసు..

ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో బూర్గుల చ‌దువుకున్నారు. ప్రొఫెస‌ర్ హ‌ర‌గోపాల్, రేవంత్ రెడ్డి కూడా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో చ‌దివారు. పొన్నం, నేను కూడా. సింగిల్ టీచ‌ర్ స్కూల్‌లో చ‌దువుకుని వ‌చ్చాం. ఆనాటి పోటీ ప్ర‌పంచం వేరు.. ఈనాటి పోటీ ప్ర‌పంచం వేరు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో చ‌దువుకున్న పేద విద్యార్థుల క‌ష్టాలు తెలుసు. రెసిడెన్షియ‌ల్ స్కూల్స్‌లో అన్ని వ‌ర్గాల‌కు అవ‌కాశం క‌ల్పిస్తున్నాం. యూనిఫాం, పుస్త‌కాలు అందిస్తున్నాం. మ‌ధ్యాహ్న భోజ‌నం స‌న్నిబియ్యంతో పెడుతున్నాం. ఆర్థిక ప‌రిస్థితి అనుకూలిస్తే ప్ర‌తి పాఠ‌శాల‌లో అల్పాహారం అందించాల‌ని రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారు. పిల్ల‌లు ఎదిగే వ‌య‌సులో పోషకాహారం అంద‌లేక ప‌రిపూర్ణంగా ఎద‌గ‌లేక‌పోతున్నారు. సీఎం సొంత నియోజ‌క‌వ‌ర్గంలో పైల‌ట్ ప్రాజెక్టుగా చేప‌ట్టారు. భ‌విష్య‌త్‌లో రాష్ట్ర వ్యాప్తంగా అల్పాహార భోజ‌నం అమ‌లు చేస్తామ‌ని ఆశిస్తున్నాం అని భ‌ట్టి విక్ర‌మార్క పేర్కొన్నారు.

ఆస్ప‌త్రుల‌ను ఆధునీక‌రిస్తున్నాం..

వైద్యానికి సంబంధించి హైద‌రాబాద్ న‌గ‌రం చుట్టూ పెద్ద పెద్ద ఆస్ప‌త్రులను క‌డుతున్నాం. అన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌తో పాటు జిల్లా కేంద్రాల్లో ఆస్ప‌త్రుల‌ను ఆధునీక‌రిస్తున్నాం. మ‌న శ‌క్తినే మాన‌వ వ‌న‌రులు. వీటిని సాన‌బెట్టి వ‌జ్రాల లాగా త‌యారు చేస్తే ఈ రాష్ట్రానికి కావాల్సిన అద్భుత‌మైన శ‌క్తి వ‌స్తుంది. అధికారంలోకి వ‌స్తే మ‌హిళ‌ల‌కు రూ. 20 వేల కోట్ల వ‌డ్డీ లేని రుణం ఇస్తామంటే న‌వ్వారు. కానీ ఇప్ప‌టికే రూ. 27 వేల కోట్లు వ‌డ్డీ లేని రుణాలు మంజూరు చేశాం. ఇది ఈ రాష్ట్రం యొక్క నిబ‌ద్ద‌త అని భ‌ట్టి తెలిపారు.

ల‌క్ష్మీదేవిప‌ల్లికి నీళ్లు అందిస్తాం..

అత్యంత ఎత్తైన ప్ర‌దేశం ల‌క్ష్మీదేవిప‌ల్లి. నార్లాపూర్, ఏదుల‌, క‌రివెన‌, వ‌ట్టెం, ఉద్ధండ‌పూర్ త‌ర్వాత ల‌క్ష్మీదేవిప‌ల్లి ఉంది. పాల‌మూరు ఎత్తిపోత‌ల ప్రాజెక్టు త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేసి నీరు అందించాల‌ని భావిస్తున్నాం. సీఎం, ఉత్త‌మ్ కుమార్ ఇత‌ర కేబినెట్ స‌హ‌చ‌రులు కూర్చొని నీళ్లు అందించాల‌ని దృఢ‌మైన నిర్ణ‌యం తీసుకున్నాం. ల‌క్ష్మీదేవిప‌ల్లికి నీళ్లు తీసుకువ‌స్తాం.. సీరియ‌స్‌గా ఉన్నాం. అభివృద్ధి చేసుకోవ‌డమే కాకుండా.. ఈ ప్రాంతాన్ని బూర్గుల‌ మెమోరియ‌ల్‌గా త‌యారు చేస్తే బాగుంటుంద‌ని భావ‌న‌. ఆయ‌న తీసుకొచ్చిన చ‌ట్టాల‌ను ఇక్క‌డ పొందుప‌రుస్తాం. భ‌విష్య‌త్ త‌రాల‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. గ్రామ పెద్ద‌లు, ఎమ్మెల్యేలు క‌లిసి ప్ర‌పోజ‌ల్ ఇవ్వాల‌ని కోరుతున్నాం. లైబ్ర‌రీని మంజూరు చేసి దాని బూర్గుల లైబ్రరీ అని నామ‌క‌ర‌ణ చేద్దాం అని భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు.

 

Advertisement

తాజావార్తలు

Advertisement