త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల‌కు డెత్ గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలి

Harish Rao | రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మోడల్ స్కూల్ ఉపాధ్యాయులందరికీ డెత్ గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్‌ హ‌రీశ్‌రావు డిమాండ్ చేశారు.

S

Telangana | Published On Aug 26, 2026, 3.00 pm IST

Harish Rao | మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల‌కు డెత్ గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలి
Advertisement
  • 40 మంది టీచర్ల కుటుంబాల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది
  • 32 నెలలుగా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా రేవంత్‌కు క‌నిక‌రం లేదు
  • మాజీ మంత్రి హ‌రీశ్‌రావు మండిపాటు

త్రినేత్ర‌.న్యూస్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మోడల్ స్కూల్ ఉపాధ్యాయులందరికీ డెత్ గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్‌ హ‌రీశ్‌రావు డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వంలో సుమారు 40 మంది మోడల్ స్కూల్ టీచర్ల కుటుంబాల పరిస్థితి అత్యంత దయనీయంగా, అగమ్యగోచరంగా మారిందని వాపోయారు. ప్రభుత్వ జీవోలు 60, 58 ప్రకారం వారికి డెత్ గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ పొందే అర్హత ఉన్నప్పటికీ, ప్రభుత్వం వాటిని మోడల్ స్కూల్స్‌కు అమలు చేయకపోవ‌డం దారుణ‌మ‌న్నారు. దీని ఫ‌లితంగా ఆ కుటుంబాలు అనాథలై రోడ్డున పడ్డాయని ఆవేద‌న చెందారు. టీచ‌ర్ల సంఘం నాయ‌కులు, విధి నిర్వ‌హ‌ణ‌లో ప్రాణాలు కోల్పోయిన టీచ‌ర్ల కుటుంబ స‌భ్యులు బుధ‌వారం ఆయ‌న్ను క‌లిసిన సంద‌ర్భంగా మాట్లాడారు.

గడచిన 32 నెలలుగా ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నా పాలకుల్లో కనికరం లేకపోవడం రేవంత్ రెడ్డి అమానవీయ పాలనకు నిదర్శనం. 2004 తర్వాత సీపీఎస్ విధానంలో నియమితులై, ప్రాణాలు కోల్పోయిన సుమారు 40 మంది మోడల్ స్కూల్ టీచర్ల కుటుంబాల పరిస్థితి దారుణంగా ఉంది. ఇంటి పెద్దను కోల్పోయి, చిన్నపిల్లలతో ఆ కుటుంబాలు పడుతున్న ఆవేదన వర్ణణాతీతం.

ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి ఆ కుటుంబాలకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించి వారిని ఆదుకోవాలి. జీవోలను పూర్తి స్థాయిలో అమలు చేయాలి. సీఎం రేవంత్ రెడ్డికి, అధికారులకు వందల అప్లికేషన్లు ఇచ్చినా పట్టించుకోని ఈ నిర్లక్ష్య వైఖరికి విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డే పూర్తి బాధ్యత వహించాలి.

రాష్ట్రంలోని 194 మోడల్ స్కూల్స్‌లో పనిచేస్తున్న 3000 మంది టీచర్లకు ప్రభుత్వం ఐదు డీఏలు ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టి ఆర్థికంగా కుంగదీస్తోంది. ఈ డీఏ బకాయిల చెల్లింపు కోసం విద్యాశాఖ కోరిన రూ.93 కోట్ల అదనపు బడ్జెట్ ఫైల్‌కు ప్రభుత్వం ఆమోదం తెలపలేదు. కనీసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న జీతాల బడ్జెట్ నుంచైనా ఈ బకాయిలు చెల్లించేందుకు అనుమతి ఇవ్వాలని కోరినా.. ఆ ఫైల్‌ను కూడా ఆర్థిక శాఖ వద్దే తొక్కిపెట్టారు.

ఈ ఐదు డీఏలు పెండింగ్‌లో ఉండటం వల్ల ఒక్కో ప్రిన్సిపాల్‌కు రూ.3.52 లక్షలు, పీజీటీకి రూ.2.81 లక్షలు, టీజీటీకి రూ.2.36 లక్షల చొప్పున బకాయిలు రావాల్సి ఉంది. ప్రభుత్వం ఇకనైనా తాత్సారం చేయకుండా ఈ డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలి.

పేద విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పుతున్న టీచర్లకు కనీస ఆరోగ్య భద్రత కూడా కల్పించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కొత్త మార్గదర్శకాల ప్రకారం ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ EHS వెంటనే వర్తింపజేయాలి. మోడల్ స్కూల్స్‌ను '010' పద్దు కిందకు తీసుకువచ్చి ఇటువంటి ఆర్థిక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నాం.

అసెంబ్లీలో నిల‌దీస్తాం..

టీచర్లు బడిలో పాఠాలు చెప్పాల్సింది పోయి తమ హక్కుల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే దుస్థితి తెచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరు సిగ్గుచేటు. అరిగోస పడుతున్న బాధిత కుటుంబాలకు, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. డెత్ గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్, పెండింగ్ డీఏల సాధన కోసం ప్రభుత్వంతో రాజీలేని పోరాటం చేస్తాం. అసెంబ్లీలో నిలదీస్తాం అని హ‌రీశ్ రావు హెచ్చ‌రించారు.

Advertisement
Advertisement