త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Liquor Sales | స‌ర్కారుకు కాసుల వ‌ర్షం.. దుమ్మురేపిన ద‌స‌రా లిక్కర్ సేల్స్

Liquor Sales | రాష్ట్రంలో దసరా పండుగ (Dasara)సందర్భంగా మద్యం అమ్మకాలు (Liquor Sales) స‌రికొత్త రికార్డు సృష్టించాయి. పండుగ సీజ‌న్ ఆబ్కారీ శాఖ‌కు కాసుల వ‌ర్షం కురిపించింది. మ‌ద్యం అమ్మ‌కాల‌తో ప్ర‌భుత్వానికి ఆశించిన స్థాయిలో ఆదాయం స‌మ‌కూరిన‌ట్లు స‌మాచారం.

G

Telangana | Published On Oct 22, 2026, 6.50 am IST

Liquor Sales | స‌ర్కారుకు కాసుల వ‌ర్షం.. దుమ్మురేపిన ద‌స‌రా లిక్కర్ సేల్స్
Advertisement

Liquor Sales | త్రినేత్ర న్యూస్‌: రాష్ట్రంలో దసరా పండుగ (Dasara)సందర్భంగా మద్యం అమ్మకాలు (Liquor Sales) స‌రికొత్త రికార్డు సృష్టించాయి. పండుగ సీజ‌న్ ఆబ్కారీ శాఖ‌కు కాసుల వ‌ర్షం కురిపించింది. మ‌ద్యం అమ్మ‌కాల‌తో ప్ర‌భుత్వానికి ఆశించిన స్థాయిలో ఆదాయం స‌మ‌కూర్చిన‌ట్లు స‌మాచారం. పండుగకు ముందు నాలుగు రోజుల్లోనే రూ.755 కోట్ల 14 లక్షల విలువైన మద్యం విక్రయాలు జరిగాయ‌ని ఎక్సైజ్ శాఖ (Excise Department) అధికారులు వెల్లడించారు.

ఈ లెక్కలు రాష్ట్రంలో మద్యం వినియోగం పెరుగుదలను, తద్వారా ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయాన్ని సూచిస్తున్నాయి. ముఖ్యంగా దసరా పండుగకు ముందురోజు అంటే అక్టోబర్ 19న మద్యం అమ్మకాలు అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. ఆ ఒక్క రోజులోనే ఏకంగా రూ.303 కోట్ల 40 లక్షల విలువైన మద్యం అమ్ముడుపోయింది. పండుగకు ముందు ఈ అమ్మకాలు పెరగడం సాధారణంగా జరిగే పరిణామమే అయినప్పటికీ, ఈసారి నమోదైన సంఖ్యలు గత రికార్డులను అధిగమించాయి.

అమ్మకాల వివరాలను పరిశీలిస్తే, అక్టోబర్ 14న రూ.102 కోట్ల 17 లక్షల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. అక్టోబర్ 15న మద్యం డిపోలకు సెలవు కావడంతో అమ్మకాలు నమోదు కాలేదు. ఈనెల‌ 16న రూ.126 కోట్ల 32 లక్షలు, అక్టోబర్ 17న రూ.223 కోట్ల 25 లక్షల విలువైన మద్యం అమ్ముడైంది. అక్టోబర్ 18న ఆదివారం సెలవు కావడంతో అమ్మకాలు తగ్గగా, అక్టోబర్ 19న అత్యధికంగా రూ.303 కోట్ల 40 లక్షల విక్రయాలు జరిగాయి. ఈ నాలుగు పనిదినాల్లోనే మొత్తం రూ.755 కోట్ల 14 లక్షల అమ్మకాలు నమోదయ్యాయి.

కిక్కెంచిన‌ బీరు..

ఈ నాలుగు రోజుల్లో 6,83,000 కేసుల హార్డ్ లిక్కర్ అమ్ముడైంది. బీరు విక్రయాలు మరింత ఎక్కువగా, 10,44,000 కేసులకు చేరుకున్నాయి. రాష్ట్రంలో సాధారణంగానే బీరు వినియోగం అధికంగా ఉంటుందని ఈ గణాంకాలు మరోసారి ధృవీకరించాయి. అక్టోబర్ 19 వరకు మొత్తం అక్టోబర్ నెలలో రూ.2,055 కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది. గత నెలలతో పోలిస్తే, సెప్టెంబర్ నెలలో రూ.3,209 కోట్లు, ఆగస్టు నెలలో రూ.3,482 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. దసరా పండుగ కారణంగా అక్టోబర్ నెలలో కూడా అమ్మకాలు భారీగానే నమోదయ్యే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గత దసరా పండుగతో పోలిస్తే ఈసారి అమ్మకాలు పెరిగాయి. గత దసరా సమయంలో నాలుగు రోజుల్లో రూ.698 కోట్ల విలువైన మద్యం అమ్ముడవగా, ఈసారి రూ.755 కోట్ల 14 లక్షలకు చేరుకోవడం గణనీయమైన వృద్ధిని సూచిస్తుంది.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,620 వైన్ షాపులు, సుమారు 1,200 బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్బులు, క్లబ్బుల ద్వారా ఈ మద్యం విక్రయాలు జరుగుతాయి. ఈ మద్యం మొత్తం తెలంగాణలో ఉన్న 17 మద్యం డిపోల నుంచి సరఫరా అవుతుంది. ఎక్సైజ్ శాఖ ద్వారా లభించే ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమైన వనరులలో ఒకటి. సంక్షేమ కార్యక్రమాలకు, ఇతర ప్రభుత్వ ప్రయోజిత పథకాలకు నిధులు సమకూర్చడంలో మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం కీలక పాత్ర పోషిస్తుంది. రిజిస్ట్రేషన్ స్టాంప్స్ శాఖ తర్వాత అత్యధిక ఆదాయాన్ని సమకూర్చే శాఖగా ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ నిలుస్తుంది. ఈ కారణంగానే ప్రభుత్వాలు మద్యం అమ్మకాలపై ప్రత్యేక దృష్టి సారిస్తుంటాయి. ఈ పండుగ సీజన్ అమ్మకాలు ప్రభుత్వానికి ఆశించిన స్థాయిలో ఆదాయాన్ని సమకూర్చినట్లు తెలుస్తున్న‌ది.

ఆ ఒక్క రోజే రికార్డు సేల్స్‌..

రాష్ట్రంలో ద‌స‌రా ప్ర‌ధాన పండుగ‌. దీంతో పండుగ‌కు ముందు రోజు అంటే ఈనెల 19న రాష్ట్ర‌వ్యాప్తంగా రూ.303.40 కోట్ల విలువైన మంద్యం అమ్ముడుపోయింది. గ‌తేడాదితో పోలిస్తే ఏకంగా 801.90 శాతం అమ్మ‌కాలు పెర‌గ‌డం గ‌మ‌నార్హం. ఆ ఒక్క‌రోజే రికార్డు స్థాయిలో అమ్మ‌కాలు జ‌ర‌గ‌డానికి కార‌ణం.. 19వ తేదీన దుర్గాష్టమి, మరుసటి రోజు (అక్టోబర్ 20) విజయదశమి (దసరా). స్నేహితులు, బంధువులు, కుటుంబ స‌భ్యుల‌తో ద‌స‌రా పండుగ జ‌రుపుకోవ‌డంతో ఆన‌వాయితీ. దీంతో ప్ర‌జ‌లు ముందుగానే పెద్ద ఎత్తున మద్యం నిల్వలను కొనుగోలు చేయ‌డ‌మే..!

 

Advertisement
Advertisement