త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CS Pramesh | క్యాన్సర్ నిపుణుల‌ను తీర్చిదిద్దడం అత్యంత అవసరం

CS Pramesh | దేశంలో క్యాన్సర్ చికిత్సా సేవల్లో నాణ్యత పెర‌గాలంటే నైపుణ్యం కలిగిన శస్త్రచికిత్సా క్యాన్సర్ నిపుణులను తీర్చిదిద్దడం అత్యంత అవసరమ‌ని టాటా మెమోరియల్ హాస్పిటల్ డైరెక్టర్, నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ కన్వీనర్ డాక్ట‌ర్ సీఎస్ ప్రమేశ్ (CS Pramesh) నొక్కి చెప్పారు.

S

Telangana | Published On Oct 22, 2026, 7.04 pm IST

CS Pramesh | క్యాన్సర్ నిపుణుల‌ను తీర్చిదిద్దడం అత్యంత అవసరం
Advertisement
  • భ‌విష్య‌త్ యువ‌ వైద్యుల‌కు ప్ర‌త్యేక శిక్ష‌ణ,ఫెలోషిప్ అవ‌కాశాల విస్త‌ర‌ణే ల‌క్ష్యం
  • ఎన్ఎస్‌జీ-ఐఏఎస్‌వో అవ‌గాహ‌న ఒప్పంద కార్య‌క్ర‌మంలో డాక్ట‌ర్ సీఎస్ ప్రమేశ్‌

CS Pramesh | త్రినేత్ర న్యూస్‌: దేశంలో క్యాన్సర్ చికిత్సా సేవల్లో నాణ్యత పెర‌గాలంటే నైపుణ్యం కలిగిన శస్త్రచికిత్సా క్యాన్సర్ నిపుణులను తీర్చిదిద్దడం అత్యంత అవసరమ‌ని టాటా మెమోరియల్ హాస్పిటల్ డైరెక్టర్, నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ కన్వీనర్ డాక్ట‌ర్ సీఎస్ ప్రమేశ్ (CS Pramesh) నొక్కి చెప్పారు. భ‌విష్య‌త్ యువ వైద్యుల‌కు ప్ర‌త్యేక శిక్ష‌ణ ఇవ్వ‌నున్న‌ట్లు చెప్పారు. దీంతో పాటు ఫెలోషిప్ అవ‌కాశాల విస్త‌ర‌ణే ల‌క్ష్యంగా ముందుకు వెళ్తున్న‌ట్లు పేర్కొన్నారు. నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ (NCG), ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ సర్జికల్ ఆంకాలజీ (IASO) మధ్య కుదిరిన ఒప్పందం (MOU) సంద‌ర్భంగా గురువారం ఆయ‌న మాట్లాడారు. అనుభవజ్ఞులైన నిపుణులు, ప్రముఖ వైద్య సంస్థల నుంచి నేర్చుకునే అవకాశాలతో పాటు, మార్గదర్శకత్వం, జ్ఞాన వినిమయం ద్వారా భవిష్యత్ క్యాన్సర్ శస్త్రచికిత్స నిపుణుల అభివృద్ధికి ఈ భాగస్వామ్యం తోడ్పడుతుంద‌న్నారు. ఈ మేర‌కు అవ‌గాహ‌న ఒప్పందంపై సంత‌కాలు చేసిన‌ట్లు తెలిపారు.

అనంతరం హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (BIACH&RI) మెడికల్ డైరెక్టర్, IASO అధ్యక్షుడు డాక్టర్ టి. సుబ్రహ్మణ్యేశ్వరరావు మాట్లాడారు. క్యాన్సర్ చికిత్సలో వస్తున్న మార్పులు, ఆధునిక సాంకేతికతలకు అనుగుణంగా భవిష్యత్ క్యాన్సర్ శస్త్రచికిత్స నిపుణులను సిద్ధం చేయడం ఎంతో ముఖ్యం. IASO, నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ మధ్య ఈ భాగస్వామ్యం ద్వారా ప్రత్యేక శిక్షణ, నిపుణుల మార్గదర్శకత్వం, విద్యా సంబంధిత సహకారానికి మరిన్ని అవకాశాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వివిధ వైద్య సంస్థల నైపుణ్యాలను సమన్వయం చేయడం ద్వారా యువ వైద్యులు అవసరమైన నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుని రోగులకు మెరుగైన క్యాన్సర్ చికిత్స అందించేందుకు తోడ్పడగలమని ఆశిస్తున్నాం.

ఈ భాగస్వామ్యంలో భాగంగా ఆధునిక శస్త్రచికిత్సా పద్ధతులు, కనిష్ఠ కోతలతో నిర్వహించే శస్త్రచికిత్సలు, రోబోటిక్ శస్త్రచికిత్సలు, అభివృద్ధి చెందుతున్న వైద్య సాంకేతికతలు, సంయుక్త పరిశోధన, విద్యా పరమైన పరస్పర మార్పిడిపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. IASO, NCG సంయుక్తంగా ఫెలోషిప్, శిక్షణ కార్యక్రమాలను అభివృద్ధి చేయడంతో పాటు, NCGతో అనుబంధం కలిగిన తగిన వైద్య సంస్థల్లో శిక్షణ, మార్గదర్శకత్వ అవకాశాలను కల్పించేందుకు కృషి చేయనున్నాయి. వర్క్‌షాప్‌లు, మాస్టర్‌క్లాస్‌లు, సదస్సులు, వెబినార్‌ల ద్వారా వైద్య పరిజ్ఞానాన్ని పంచుకోవడం, యువ వైద్యుల వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించడం ఈ కార్యక్రమాల ప్రధాన లక్ష్యం. IASO-నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ భాగస్వామ్యం ద్వారా భారతదేశంలో శస్త్రచికిత్సా క్యాన్సర్ వైద్య విద్యకు మరింత బలమైన పునాది ఏర్పడటంతో పాటు, నైపుణ్యం కలిగిన క్యాన్సర్ శస్త్రచికిత్స నిపుణుల తయారీకి, దేశవ్యాప్తంగా క్యాన్సర్ చికిత్సా సేవల నాణ్యత పెంపునకు దోహదపడుతుందని ఆశిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో తిరుపతిలోని వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SVIMS) శస్త్రచికిత్సా క్యాన్సర్ విభాగం ప్రొఫెసర్, విభాగాధిపతి డాక్టర్ నరేంద్ర హులికల్, తిరువనంతపురంలోని మూకాంబిక ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ శస్త్రచికిత్సా క్యాన్సర్ విభాగం ప్రొఫెసర్, విభాగాధిపతి డాక్టర్ చంద్ర మోహన్, చెన్నైలోని ప్రభుత్వ కిల్‌పాక్ మెడికల్ కాలేజీ శస్త్రచికిత్సా క్యాన్సర్ విభాగం ప్రొఫెసర్, విభాగాధిపతి డాక్టర్ సుబ్బయ్య షణ్ముగం పాల్గోన్నారు.

Advertisement
Advertisement