త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kadiyam Kavya | బైండ్ల స‌మాజం మ‌రింత ఎద‌గాలి : ఎంపీ క‌డియం కావ్య‌

Kadiyam Kavya | బైండ్ల సమాజం విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మరింత ముందుకు సాగాలని వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య పిలుపునిచ్చారు. సమాజంలో ఐక్యతను పెంపొందించడంతో పాటు యువత విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

S

Telangana | Published On Aug 9, 2026, 5.59 pm IST

Kadiyam Kavya | బైండ్ల స‌మాజం మ‌రింత ఎద‌గాలి : ఎంపీ క‌డియం కావ్య‌
Advertisement

చదువుతో ఎదగాలి.. ఐక్యతతో బలపడాలి
విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో రాణించాలి
బైండ్ల భవన్‌కు రూ.2 కోట్ల నిధులు ఇవ్వాలని సీఎంను కోరాం
‘పే బ్యాక్‌ టు సొసైటీ’ స్ఫూర్తితో సమాజానికి అండగా నిలవాలి
BEATను బలోపేతం చేయాలి..
బైండ్ల సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకురావాలి
బైండ్ల సమాజం అభివృద్ధికి BEAT వేదికగా మారాలి
వ‌రంగ‌ల్ ఎంపీ డా. కడియం కావ్య

Kadiyam Kavya | త్రినేత్ర‌.న్యూస్ : బైండ్ల సమాజం విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మరింత ముందుకు సాగాలని వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య పిలుపునిచ్చారు. సమాజంలో ఐక్యతను పెంపొందించడంతో పాటు యువత విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన BEAT (తెలంగాణ బైండ్ల ఉద్యోగుల సంఘం) విజన్‌ మీట్‌–2026 కార్యక్రమానికి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.

ఈ సందర్భంగా కావ్య మాట్లాడుతూ.. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన తాను పార్లమెంట్‌ వరకు చేరడానికి అంబేడ్కర్‌ అందించిన రాజ్యాంగ హక్కులే కారణమని అన్నారు. కులవృత్తి ద్వారా ఆదాయం వస్తోందనే కారణంతో పిల్లల చదువును మధ్యలోనే నిలిపివేయవద్దని ఉన్నత విద్య, వృత్తి విద్యను అభ్యసించాలని కోరారు. ప్రతి ఒక్కరూ ‘పే బ్యాక్‌ టు సొసైటీ ని అలవర్చుకోవాలని అదే స్ఫూర్తితో సమాజానికి తిరిగి సేవ చేయాలని ఎంపీ పిలుపునిచ్చారు.

బైండ్ల భవన్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని తాను, ఎమ్మెల్యే కడియం శ్రీహరి కలిసి కోరినట్లు ఎంపీ తెలిపారు. తొలి విడతగా సుమారు రూ.2 కోట్ల వరకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశామని, త్వరలోనే దీనిపై ప్రభుత్వం నుంచి జీవో వచ్చే అవకాశం ఉందని చెప్పారు.

BEATను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బైండ్ల ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, యువతను సంఘంలో భాగస్వాములను చేయాలని కావ్య కోరారు. సంఘంలో గ్రూపులు, విభేదాలకు తావులేకుండా అందరూ ఒక్కటిగా ముందుకు సాగాలని సూచించారు. సోషల్‌ మీడియా ద్వారా సంఘం కార్యకలాపాలను విస్తృతంగా ప్రచారం చేసి సభ్యత్వాన్ని పెంచుకోవాలని పిలుపునిచ్చారు.

తమ వద్ద పెద్దగా ఆస్తులు, ఆర్థిక వనరులు లేకపోయినా నిజాయితీ, తెలివితేటలు, ప్రజాబలమే తమ పెట్టుబడి అని ఎంపీ అన్నారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చి తన తండ్రి కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా, తాను ఎంపీగా ప్రజాసేవలో ఉండటం గర్వకారణమన్నారు. రాజకీయ హోదాలు ఉన్నా లేకపోయినా సమాజానికి తన సహకారం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ఆడపిల్లల చదువుకు తల్లిదండ్రులు ప్రాధాన్యమివ్వాలని ఎంపీ సూచించారు. పిల్లలను ఉన్నతంగా చదివించి వారు జీవితంలో స్థిరపడేలా తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహిస్తూ సమాజంలో పరస్పర అనుబంధాలను పెంచుకోవాలని డా. కడియం కావ్య ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో బీఈఏటీ అధ్యక్షుడు చినపాక స్వామి, కోశాధికారి డా. జీలకర్ర స్వామి, ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ, సంయుక్త కార్యదర్శి జీలకర్ర రామ్‌మూర్తి, ముఖ్య సలహాదారు కడెం ధనుంజయ, సలహాదారులు డా. జీలకర్ర సోమశేఖర్, చినపాక శ్రీనివాస ప్రసాద్, ఏ. ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement