త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

World Indigenous Peoples Day | అభివృద్ధి వైపు అడుగులు వేయాలి : మంత్రి లక్ష్మణ్‌కుమార్‌

World Indigenous Peoples Day | అడవులు, వారసత్వం, భాష, సంస్కృతిని కాపాడుకుంటూనే గిరిజనులు అభివృద్ధిలో ముందుకు సాగాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా బంజారా భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గిరిజనుల జీవనాధారమైన అడవుల పరిరక్షణతో పాటు విద్య, ఉపాధి, మౌలిక వసతుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు.

P

Telangana | Published On Aug 9, 2026, 5.46 pm IST

World Indigenous Peoples Day | అభివృద్ధి వైపు అడుగులు వేయాలి : మంత్రి లక్ష్మణ్‌కుమార్‌
Advertisement
  • గిరిజ‌నుల హక్కులు, భాష, సంస్కృతి పరిరక్షణకు ప్రాధాన్యం
  • మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

World Indigenous Peoples Day | అడవులు, వారసత్వం, భాష, సంస్కృతిని కాపాడుకుంటూనే గిరిజనులు అభివృద్ధిలో ముందుకు సాగాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా బంజారా భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గిరిజనుల జీవనాధారమైన అడవుల పరిరక్షణతో పాటు విద్య, ఉపాధి, మౌలిక వసతుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. 2026–27లో గిరిజన సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం రూ.18,745.16 కోట్లు కేటాయించిందని మంత్రి గుర్తు చేశారు. విద్య, రహదారులు, తాగునీరు, విద్యుత్‌, సాగునీరు, వైద్యం, మౌలిక వసతులు, నైపుణ్యాభివృద్ధికి ఈ నిధులను వినియోగించనున్నట్లు చెప్పారు. ఏ గిరిజన ఆవాసమూ ఒంటరిగా మిగలకుండా ప్రతి గ్రామానికి రహదారి, ప్రతి ఇంటికీ తాగునీరు, విద్యుత్‌, వైద్యం, నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

చదువులో గిరిజన విద్యార్థుల ప్రతిభ

రాష్ట్రంలోని 166 గిరిజన గురుకుల విద్యాసంస్థల్లో 83 వేల మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. 2025–26లో పదో తరగతిలో 98 శాతానికి పైగా, ఇంటర్‌లో 86 శాతం, డిగ్రీలో 89 శాతం ఉత్తీర్ణత నమోదైందన్నారు. 28 మంది ఐఐటీల్లో, 23 మంది ఎన్‌ఐటీల్లో ప్రవేశం పొందగా.. 167 మంది నీట్‌లో అర్హత సాధించారని వెల్లడించారు. గిరిజన యువతకు భవిష్యత్‌ అవకాశాలు అందేలా ఏఐ ఆధారిత ఎస్‌టీఈఎం ల్యాబ్‌లు, డిజిటల్‌ లెర్నింగ్‌, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను విస్తరిస్తామని చెప్పారు. అడవే గిరిజనుల జీవనానికి పునాది అని పేర్కొన్న మంత్రి.. అభివృద్ధి, అటవీ పరిరక్షణ రెండూ సమాంతరంగా సాగాలని అన్నారు. ఇందిరా గిరి జల వికాసం, సౌర పంపులు, ఉద్యాన పంటలు, ప్రత్యామ్నాయ పంటల ద్వారా గిరిజన రైతుల ఆదాయాన్ని పెంచుతామని చెప్పారు. తేనె, చింతపండు, ఔషధ మొక్కలు వంటి అటవీ ఉత్పత్తులకు ప్రాసెసింగ్‌, బ్రాండింగ్‌, మార్కెటింగ్‌ ద్వారా విలువ జోడించి ఆదాయం పెంచాలని సూచించారు. గిరిజన మహిళలకు నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాలను పెంచి ఆర్థికంగా బలోపేతం చేస్తామని తెలిపారు.

పీఎం-జన్‌మన్‌లో తెలంగాణకు మూడో స్థానం

ప్రత్యేకంగా వెనుకబడిన గిరిజన తెగల అభివృద్ధి కోసం అమలు చేస్తున్న పీఎం-జన్‌మన్‌ పథకం అమలులో తెలంగాణ దేశంలో మూడో అత్యుత్తమ రాష్ట్రంగా నిలిచిందని మంత్రి తెలిపారు. గృహాలు, తాగునీరు, రహదారులు, విద్యుత్‌, వైద్యం, విద్య, జీవనోపాధి వంటి రంగాల్లో మౌలిక వసతులను మెరుగుపరుస్తున్నామని చెప్పారు. గిరిజన భాషలు, జానపద కళలు, పాటలు, నృత్యాలు, సంప్రదాయ జ్ఞానాన్ని భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్‌లో నిర్మిస్తున్న రాంజీ గోండ్‌ గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం గిరిజన వీరుల చరిత్ర, త్యాగాలను భవిష్యత్‌ తరాలకు పరిచయం చేస్తుందని పేర్కొన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గిరిజన సంక్షేమానికి చేసిన కృషిని మంత్రి గుర్తుచేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం గిరిజన హక్కులను ఆచరణలో ప్రయోజనాలుగా మార్చేందుకు కట్టుబడి ఉందన్నారు.

బాల్య వివాహాల‌ను అరిక‌ట్టాల‌ని పిలుపు..

గిరిజన కుటుంబాలు పిల్లల చదువుకు ప్రాధాన్యం ఇవ్వాలని, బాల్య వివాహాలను అరికట్టాలని, దురలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. యువత, మహిళలు నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ‘‘అడవులను కాపాడండి.. ఆదివాసీలను సాధికారుల్ని చేయండి. ఆదివాసీలను సాధికారుల్ని చేస్తే తెలంగాణను బలోపేతం చేసినట్లే’’ అని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌ సంతోష్‌, ప్ర‌జాప్రతినిధులు, గిరిజన నాయకులు, అధికారులు, విద్యార్థులు, కళాకారులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా తొమ్మిది మంది ప్రముఖులతో పాటు ప్రతిభ కనబరిచిన గిరిజన విద్యార్థులను సత్కరించారు. సంప్రదాయ గిరిజన పాటలు, నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

Advertisement
Advertisement