త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLA Anirudh Reddy | ‘ఇప్ప‌పువ్వు’తో ‘షుగ‌ర్’ కంట్రోల్ అయిత‌ది.. స‌భ‌లో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వెల్ల‌డి

MLA Anirudh Reddy | తెలంగాణ‌లో విరివిగా ల‌భించే ఇప్ప‌పువ్వుతో షుగర్ కంట్రోల్ అయిత‌ద‌ని జ‌డ్చ‌ర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వెల్ల‌డించారు. ఈ విష‌యాన్ని స్వ‌యానా ఓ జ‌ర్న‌లిస్టు ఫోన్ చేసి త‌న‌కు చెప్పార‌ని శాస‌న‌స‌భ‌లో పేర్కొన్నారు.

S

Telangana | Published On Mar 25, 2026, 4.29 pm IST

MLA Anirudh Reddy | ‘ఇప్ప‌పువ్వు’తో ‘షుగ‌ర్’ కంట్రోల్ అయిత‌ది.. స‌భ‌లో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వెల్ల‌డి
Advertisement

MLA Anirudh Reddy | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ‌లో విరివిగా ల‌భించే ఇప్ప‌పువ్వుతో షుగర్ కంట్రోల్ అయిత‌ద‌ని జ‌డ్చ‌ర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వెల్ల‌డించారు. ఈ విష‌యాన్ని స్వ‌యానా ఓ జ‌ర్న‌లిస్టు ఫోన్ చేసి త‌న‌కు చెప్పార‌ని శాస‌న‌స‌భ‌లో పేర్కొన్నారు. ఇప్ప‌పువ్వు సారాను మ‌ళ్లీ వినియోగంలోకి తేవాల‌ని ఇటీవ‌లే ఇదే ఎమ్మెల్యే బ‌హిరంగంగా డిమాండ్ చేసిన సంగ‌తి తెలిసిందే. వీలైతే శాస‌న‌స‌భ‌లో ఈ అంశాన్ని లేవ‌నెత్తుతాన‌ని ప్ర‌క‌టించిన మేర‌కు.. బుధ‌వారం శాస‌న‌స‌భ‌లో అనిరుధ్ రెడ్డి స్పీక‌ర్ అనుమ‌తితో ఇప్ప‌పువ్వు సారా ప్ర‌త్యేక‌త‌, నేప‌థ్యం వివ‌రించారు.

ఇప్పపువ్వు సారా గురించి అనిరుధ్ రెడ్డి మాటల్లోనే..

గ‌త వారం రోజుల నుంచి సోష‌ల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు సారా ఓపెన్ చేయాల్నా అని. 1995కు ముందు మండ‌ల కేంద్రాల్లో సారా అమ్మేది. 1978 కాలంలో సారా అనేది 91 కోట్లు ట‌ర్నోవ‌ర్ చేసింది. విదేశీ మ‌ద్యం 8 కోట్లు ట‌ర్నోవ‌ర్ చేసింది. 1995 వ‌ర‌కు వ‌చ్చిన‌ప్పుడు సారాపై నిషేధం విధించారు. మ‌గాళ్లు మ‌హిళ‌ల‌ను హింసిస్తున్నార‌ని చెప్పి సారాను బ్యాన్ చేశారు. సారాకు నేను వ్య‌తిరేక‌మే. నేను ఇప్పుడు మాట్లాడేది ఇప్ప‌పువ్వు గురించి మాత్ర‌మే సారా గురించి కాదు.

ఇప్పపువ్వుతో సారా ఉత్ప‌త్తి చేసి కోట్ల ట‌ర్నోవ‌ర్

1993-94 మ‌ధ్య సారా ట‌ర్నోవ‌ర్ 370 కోట్లు. నిషేధం త‌ర్వాత 1997-98లో ఇండియ‌న్ ఫారెన్ లిక్క‌ర్ 729 కోట్లు ట‌ర్నోవ‌ర్ చేసింది. ఇండియ‌న్ లిక్క‌ర్ తాగుడు స్టార్ట్ చేశారు. కల్తీ సారాకు నేను వ్య‌తిరేకం. అయితే మ‌న అడ‌వుల్లో పెరిగే ఇప్ప చెట్టు గురించి మాట్లాడుతున్నాను. ఈ పువ్వుతో స్పిరిట్ త‌యారు చేస్తారు. దీన్ని ఇప్ప సూరా, ఇప్ప ట‌కీలా, ఇప్ప లిక్క‌ర్ అనొచ్చు. తెలుగులో సారా అని మాట్లాడితే చీప్ లిక్క‌ర్ అంటున్నారు. అదే విస్కీ అని మాట్లాడితే మాత్రం మంచి లిక్క‌ర్ అని మాట్లాడుతున్న‌రు. మెక్సికో, జ‌పాన్, ఫ్రాన్స్‌, స్కాట్లాండ్‌, చైనాలో ఇప్పపువ్వుతో సారా ఉత్ప‌త్తి చేసి కోట్ల ట‌ర్నోవ‌ర్ సంపాదిస్తున్నారు. మ‌నం కూడా ఆదివాసీ, గిరిజ‌నుల‌కు రెవెన్యూను ఎలా పెంచాల‌నే విష‌యంపై మాట్లాడుతున్నాను.

ఇప్ప‌చెట్టుకు 5 వేల ఏండ్ల‌ చ‌రిత్ర

ఇప్ప‌చెట్టుకు 5 వేల ఏండ్ల‌ చ‌రిత్ర ఉంది. ఇలాంటి చ‌రిత్ర ఏ చెట్టుకు, పువ్వుకు లేదు వేరే దేశంలో. ఇప్ప చెట్టును ఆదివాసీలు పూజిస్తారు. ఇప్ప‌పువ్వు యాంటీ ఆక్సిడెంట్, యాంటీ డ‌యాబెటిక్, యాంటీ క్యాన్స‌ర్, యాంటీ ఆల్స‌ర్‌గా ప‌ని చేస్తుంద‌ని యూఎస్‌లో చేసిన ఓ అధ్య‌య‌నంలో తేలింది. ఇంత చ‌రిత్ర ఉన్న ఇప్పపువ్వు సారాను బ్రిటీష‌ర్లు 1892లో బ్యాన్ చేయించారు. ఎందుకంటే వారి దేశం నుంచి దిగుమ‌తి అయ్యే విస్కీని అమ్మ‌లేం అని చెప్పి.

ఇప్ప ట‌కీలా పేరుతో 2 ల‌క్ష‌ల 34 వేల ట‌ర్నోవ‌ర్

మెక్సికోలో ఇప్ప ట‌కీలా పేరుతో 2 ల‌క్ష‌ల 34 వేల ట‌ర్నోవ‌ర్, చైనాలో 2 ల‌క్ష‌ల 60 వేల కోట్లు, జ‌పాన్‌లో సాకి అనే డ్రింక్‌తో 2600 కోట్ల ట‌ర్నోవ‌ర్ సాధిస్తున్నారు. మ‌న ద‌గ్గ‌ర్న‌మో నిషేధించారు. ఇప్పపువ్వును బ్యాన్ చేశారు. ఇప్ప‌పువ్వుతో ఐస్‌క్రీమ్‌, కేక్, వైన్, బీర్, ల‌డ్డూ వంటి ప‌దార్థాలు త‌యారు చేయొచ్చు. ఇటీవ‌ల మోదీ మ‌న్‌కీ బాత్‌లో మాట్లాడుతూ.. ఇప్ప‌ల‌డ్డూ వ‌ల్ల క‌లిగే లాభాల‌ను చెప్పారు. ఇప్ప‌ల‌డ్డూ మ‌హువాను ప్ర‌మోట్ చేయాలన్నారు.

ఒక చెట్టుకు రెండున్న‌ర కిలోల దాకా ఇప్ప‌పువ్వు

ఇప్ప‌పువ్వు వ‌ల్ల డ‌యాబెటిక్ కంట్రోల్ ఉంటుంద‌ని నాకు ఒక జ‌ర్న‌లిస్టు ఫోన్ చేసి చెప్పారు. కాబ‌ట్టి ఇప్ప‌పువ్వును ప్ర‌మోట్ చేయ‌డం వ‌ల్ల ఆదివాసీలు, ఎస్టీ సోద‌రుల‌ను ఆర్థికంగా బ‌లోపేతం చేయొచ్చు. ఇప్ప‌కోలా త‌యారు చేసి ఎగుమ‌తి చేయొచ్చు. తెలంగాణ‌లో 5 ల‌క్ష‌ల నుంచి 10 ల‌క్ష‌ల వ‌ర‌కు ఇప్ప చెట్లు ఉన్నాయి. ఒక చెట్టుకు రెండున్న‌ర కిలోల దాకా ఇప్ప‌పువ్వు వ‌స్తుంది. షుగ‌ర్ వ‌చ్చింద‌ని ఆస్ప‌త్రికి వెళ్తే.. వ‌రిబియ్యం తినొద్ద‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు. కాబ‌ట్టి ఇప్ప‌పువ్వును ప్ర‌మోట్ చేయాలి. ఒక ఎక‌రాకు 50 నుంచి 60 చెట్లు పెట్టొచ్చు. ఎక‌రాకు 3 ల‌క్ష‌ల ఆదాయం సంపాదించొచ్చు. అయితే ఇప్ప పువ్వు రావ‌డానికి ఎనిమిదేండ్లు ప‌డుతుంది. 100 ఏండ్ల వ‌ర‌కు ఈ చెట్టు బ‌తుకుతుంది.

మ‌నం కూడా రూ. 3 ల‌క్ష‌ల కోట్ల ట‌ర్నోవ‌ర్‌కు చేరుకోవ‌చ్చు..

గోవా, ఒడిశా, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, మ‌ధ్యప్ర‌దేశ్ రాష్ట్రాల్లో ఇప్ప‌పువ్వు సారాను ప్ర‌మోట్ చేస్తున్నారు. ఆదివాసీల‌కు దీనికి సంబంధించి లైసెన్స్ కూడా జారీ చేసింది. ఆర్థికంగా కూడా ఆదుకుంటున్నారు. లండ‌న్‌లోని ఓ కంపెనీ ఇండియా నుంచి ఇప్ప‌పువ్వును దిగుమ‌తి చేసుకుని అక్క‌డ విక్ర‌యిస్తున్నారు. ఫ్రాన్స్‌లో కూడా మ‌న పువ్వును దిగుమ‌తి చేసుకుంటున్నారు. ఏది ఏమైనా మ‌న ఆదివాసీ, ఎస్టీల‌ను ఆర్థికంగా బ‌లోపేతం చేయాలి. వ‌చ్చే ప‌దేండ్ల‌లో ఫారెన్ లిక్క‌ర్‌ను బీట్ చేసి రూ. 3 ల‌క్ష‌ల కోట్ల రెవెన్యూకు తీసుకుపోవ‌చ్చు. ప్ర‌పంచ దేశాల‌ను ఢీకొట్టొచ్చు అని పేర్కొంటూ అనిరుధ్ రెడ్డి త‌న ప్ర‌సంగాన్ని ముగించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement