త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | సీఎం రేవంత్ ఇల్లే 22A లిస్ట్‌లో.. 30 శాతం కమీషన్ల కోసమే ఈ దందా: హరీశ్ రావు ఫైర్

సెక్షన్ 22A తో కాంగ్రెస్ సర్కార్ కమీషన్ల దందాకు తెరలేపిందని, సాక్షాత్తూ సీఎం రేవంత్ ఇల్లే ఈ ప్రొహిబిటెడ్ లిస్ట్‌లో ఉందంటూ హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు.

J

Telangana | Published On Aug 17, 2026, 4.13 pm IST

Harish Rao | సీఎం రేవంత్ ఇల్లే 22A లిస్ట్‌లో.. 30 శాతం కమీషన్ల కోసమే ఈ దందా: హరీశ్ రావు ఫైర్
Advertisement
  • సెక్షన్ 22A (ప్రొహిబిటెడ్ జాబితా) పేరుతో అడ్డగోలుగా ఆస్తులను నిషేధిత జాబితాలో చేరుస్తున్న కాంగ్రెస్ సర్కార్
  • రెవెన్యూ శాఖలో 30% కమీషన్ ఇస్తేనే 22A జాబితా నుంచి ఆస్తుల తొలగింపు
  • సాక్షాత్తూ సీఎం రేవంత్ రెడ్డి సొంతిళ్లు కూడా 22A లిస్ట్‌లో ఉండటంతోనే రివ్యూల పేరిట ప్రభుత్వ డ్రామా
  • ఆగస్టు 13 నుంచి పాత రైతు బీమా బంద్
  • కొత్త స్కీమ్ పేరుతో 13 లక్షల మంది రైతులకు అన్యాయం

Harish Rao | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సెక్షన్ 22A (ప్రొహిబిటెడ్ ల్యాండ్స్) పేరుతో సామాన్య ప్రజలను ముప్పుతిప్పలు పెడుతోందని.. 30 శాతం కమీషన్ల కోసమే ఈ అక్రమాలకు పాల్పడుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత ఇల్లు కూడా ఈ 22A లిస్ట్‌లో ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తోందని, తన ఇంటికి సెగ తగిలే సరికి ప్రభుత్వంలో రివ్యూల పేరుతో హడావిడి మొదలైందని ఆయన విమర్శించారు. తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా చిట్ చాట్‌లో హరీశ్ రావు పలు కీలక అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీశారు.

22A గందరగోళం.. చలాన్లు కట్టాక రిజిస్ట్రేషన్ బంద్

రాష్ట్రంలో ఎవరి భూమి 22A లో ఉందో, ఎవరిది లేదో తెలియక లక్షలాది మంది ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. 1999లో దేశవ్యాప్తంగా, 2008లో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ హయాంలో అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని రద్దు చేశారని గుర్తుచేశారు. ఆనాడు క్లియర్ అయిన భూములను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ 22A ప్రొహిబిషన్ లిస్ట్‌లో పెట్టడం దారుణమన్నారు.

"శ్రీనగర్ కాలనీలో 20 ఏళ్లుగా ఉంటున్న ఇళ్లు, బంజారాహిల్స్ సొసైటీలోని ఆస్తులు, 30 ఏళ్ల క్రితం కొనుక్కున్న అపార్ట్‌మెంట్ ఫ్లాట్లను కూడా నిషేధిత జాబితాలో పెడితే ప్రజలు ఎక్కడికి పోవాలి? తీరా రిజిస్ట్రేషన్ కోసం చలాన్లు కట్టి, డబ్బులు చెల్లించిన తర్వాత మీ భూమి 22A లో ఉందని చెప్పి రిజిస్ట్రేషన్లు ఆపేస్తున్నారు. కట్టిన చలాన్ డబ్బులు కూడా వాపస్ ఇవ్వకుండా దోచుకుంటున్నారు," అని ఆయన మండిపడ్డారు.

కమీషన్లు ఇస్తేనే ఫైల్ కదులుతోంది

ప్రభుత్వానికి పాలనపై కనీస అవగాహన లేదనడానికి ఎయిర్‌పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్డు లాంటి ప్రభుత్వ ఆస్తులను సైతం 22A జాబితాలో పెట్టడమే నిదర్శనమన్నారు. రెవెన్యూ శాఖలో ఏ పని కావాలన్నా, భూమిని 22A నుంచి బయటకు తీయాలన్నా 30 శాతం కమీషన్ ఇవ్వాలనేది ఇప్పుడు ఓపెన్ సీక్రెట్ అని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన డిసెంబర్ 7, 2023 నుంచి ఇప్పటివరకు ఎన్ని భూములను ప్రొహిబిషన్ లిస్ట్‌లో పెట్టారో వెంటనే 'వైట్ పేపర్' (శ్వేతపత్రం) విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ దెబ్బకే బోర్డుల సమావేశాలు వాయిదా

రాష్ట్ర హక్కుల పరిరక్షణలో కాంగ్రెస్ సర్కార్‌కు కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదని హరీశ్ రావు విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన పోరాటం వల్లే నేడు కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల (KRMB, GRMB) సమావేశాలు వాయిదా పడ్డాయని స్పష్టం చేశారు. అయితే కేవలం వాయిదా పడితే సరిపోదని, ఎజెండా నుంచి తెలంగాణకు చెందిన 7 ప్రాజెక్టుల అంశాన్ని శాశ్వతంగా తొలగించాలని డిమాండ్ చేశారు.

రైతు బీమా బంద్.. రైతుబంధుకు కోత

కేసీఆర్ ప్రవేశపెట్టిన 'రైతు బీమా' పథకం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని, 42.15 లక్షల మంది రైతులకు భరోసా ఇచ్చిందని హరీశ్ రావు గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా ఈ నెల 13 నుంచి ఈ పథకాన్ని నిలిపివేసిందని ఆరోపించారు. కొత్తగా తెచ్చే స్కీమ్ వల్ల ఏకంగా 13 లక్షల మంది రైతులు బీమాకు దూరం కాబోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

"రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన సీఎం రేవంత్ రెడ్డి, పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. రైతుబంధు 2 వేలు పెంచి ఇచ్చానని డబ్బాలు కొట్టుకుంటున్నారు. 2022-23లో కేసీఆర్ రూ.14,743 కోట్లు ఇస్తే.. రేవంత్ ప్రభుత్వం ఇచ్చింది కేవలం రూ. 5,057 కోట్లు మాత్రమే. దాదాపు 19 వేల కోట్ల రూపాయల రైతు బంధును ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్గొట్టింది," అని హరీశ్ రావు లెక్కలతో సహా వివరించారు. పాత రైతు బీమా పథకాన్నే యథాతథంగా కొనసాగించాలని బీఆర్ఎస్ తరఫున ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement