త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rythu Bharosa | నేడు తుది విడత రైతుభరోసా.. 9 నుంచి 50 ఎక‌రాల వ‌ర‌కు..

Rythu Bharosa | రాష్ట్రంలో వానాకాలం సీజన్ రైతుభరోసా (Rythu Bharosa) పంపిణీ శుక్రవారంతో పూర్తికానుంది. గత నెల 30న హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జరిగిన సభలో సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) తొలివిడత సాయం విడుద‌ల చేశారు.

G

Telangana | Published On Jul 10, 2026, 6.37 am IST

Rythu Bharosa | నేడు తుది విడత రైతుభరోసా.. 9 నుంచి 50 ఎక‌రాల వ‌ర‌కు..
Advertisement

Rythu Bharosa | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో వానాకాలం సీజన్ రైతుభరోసా (Rythu Bharosa) పంపిణీ శుక్రవారంతో పూర్తికానుంది. గత నెల 30న హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జరిగిన సభలో సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) తొలివిడత సాయం విడుద‌ల చేశారు. తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్లను జమ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. దీనికి అనుగుణంగా ఇప్పటికే 8 ఎకరాల వరకు సాయం విడుదల కాగా శుక్రవారం ఖమ్మం (Khammam) జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో జరిగే రైతు ఆశీర్వాదసభలో సీఎం తుదివిడత రూ.1009 కోట్లు విడుదల చేయనున్నారు. దీంతో కలిపి మొత్తం సాయం రూ.8759 కోట్లకు చేరుతుంది.

తొలిరోజు రెండెకరాల వరకు రూ.878 కోట్లు విడుదల కాగా తర్వాత 3, 4, 5, 6, 7 ఎకరాల వరకు సాయం అందించారు. బుధవారం వరకు మొత్తం రూ.7750.45 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశారు. దీంతో 1.45 కోట్ల ఎకరాల మేరకు భూములు గల 74 లక్షల మంది రైతులకు సాయం చేరింది. రైతు ఆశీర్వాద స‌భ వేదిక‌గా 9 నుంచి 50 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు కూడా రైతు భరోసా అందించనున్నారు. వీటితోపాటు కొత్తగా నమోదయ్యే వారికి, సాంకేతిక కారణాలతో సాయం నిలిచిన వారికి కూడా తర్వాత నిధులు విడుదల చేస్తారు. మొత్తంగా రూ.9 వేల కోట్ల సాయం రైతుభరోసా కింద చేరనుంది.

కాగా, కేవలం తొమ్మిది రోజుల్లోనే 8 ఎకరాల వరకు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో రూ.8,759 కోట్లను జమ చేశామని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క వెల్ల‌డించారు. శుక్ర‌వారం నాటి రైతు ఆశీర్వాద సభ వేదికగా మరో రూ.1,009 కోట్లను విడుదల చేస్తామ‌ని తెలిపారు. బీఆర్ఎస్ పాలనతో పోల్చితే రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ కాలంలోనే అధిక నిధులు ఖర్చు చేసిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్ల‌లో రైతు బంధు పేరుతో సుమారు రూ.75 వేల కోట్లు ఖర్చు చేయగా, కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేండ్ల‌లోనే రూ.35 వేల కోట్లను రైతులకు అందించిందని చెప్పారు.

Advertisement
Advertisement