త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

France vs Morocco | ఫ్రాన్స్‌ తీన్‌మార్‌!

France vs Morocco | మొరాకో ఎంత పోరాడినా.. ప్రపంచ ఛాంపియన్లను అడ్డుకోలేకపోయింది. గంటకుపైగా గోల్‌కీపర్‌ యాసిన్‌ బోనూ అద్భుత సేవ్‌లతో ఫ్రాన్స్‌ను నిరాశపరిచినా.. కిలియన్‌ ఎంబాపే, ఉస్మాన్‌ డెంబెలే ఆరు నిమిషాల వ్యవధిలో మ్యాచ్‌ను పూర్తిగా మార్చేశారు. 2-0తో విజయం సాధించిన ఫ్రాన్స్‌ వరుసగా మూడోసారి ఫిఫా ప్రపంచకప్‌ సెమీఫైనల్‌లోకి అడుగుపెట్టింది. స్టార్‌ స్ట్రయికర్‌ ఎంబాపే పెనాల్టీ మిస్‌ చేసినా.. కీలక సమయంలో తన క్లాస్‌ను మరోసారి చాటిచెప్పాడు.

P

Sports | Published On Jul 10, 2026, 8.14 am IST

France vs Morocco | ఫ్రాన్స్‌ తీన్‌మార్‌!
Advertisement
  • వరుసగా మూడోసారి ఫిఫా ప్రపంచకప్‌ సెమీస్‌లోకి ప్రవేశం
  • మొరాకోను నిలువరించిన జట్టు
  • 2-0 తేడాతో ఘన విజయం
  • మరోసారి మెరిసిన ఎంబాపే, ఉస్మాన్‌

France vs Morocco | మొరాకో ఎంత పోరాడినా.. ప్రపంచ ఛాంపియన్లను అడ్డుకోలేకపోయింది. గంటకుపైగా గోల్‌కీపర్‌ యాసిన్‌ బోనూ అద్భుత సేవ్‌లతో ఫ్రాన్స్‌ను నిరాశపరిచినా.. కిలియన్‌ ఎంబాపే, ఉస్మాన్‌ డెంబెలే ఆరు నిమిషాల వ్యవధిలో మ్యాచ్‌ను పూర్తిగా మార్చేశారు. 2-0తో విజయం సాధించిన ఫ్రాన్స్‌ వరుసగా మూడోసారి ఫిఫా ప్రపంచకప్‌ సెమీఫైనల్‌లోకి అడుగుపెట్టింది. స్టార్‌ స్ట్రయికర్‌ ఎంబాపే పెనాల్టీ మిస్‌ చేసినా.. కీలక సమయంలో తన క్లాస్‌ను మరోసారి చాటిచెప్పాడు.

ప్రారంభం నుంచే..

మ్యాచ్‌ ప్రారంభం నుంచి ఫ్రాన్స్‌ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. మొత్తం 20 షాట్లు నమోదు చేసి మొరాకో రక్షణను నిరంతరం ఒత్తిడిలో ఉంచింది. లూకాస్‌ డిగ్నే కొట్టిన ఓ షాట్‌ క్రాస్‌బార్‌ను తాకి వెనుదిరగగా.. ఎంబాపే పెనాల్టీని బోనూ అడ్డుకున్నాడు. మరోవైపు 83వ నిమిషం వరకు ఫ్రాన్స్‌ గోల్‌కీపర్‌ మైక్‌ మైగ్నాన్‌ను తీవ్రంగా పరీక్షించే అవకాశం మొరాకోకు దక్కలేదు. చివర్లో అజ్జెదిన్‌ ఊనాహీ చేసిన ప్రయత్నాన్ని మైగ్నాన్‌ సమర్థంగా అడ్డుకున్నాడు. 77వ నిమిషంలో ఎంబాపే మైదానంపై కిందపడడంతో ఫ్రాన్స్‌ అభిమానుల్లో కాసేపు ఆందోళన నెలకొంది. అయితే, ఛేంజ్‌ ఆటగాడిగా బయటకు వస్తూ ప్రేక్షకులకు చేతులెత్తి అభివాదం చేయడంతో అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ టోర్నీలో ఫ్రాన్స్‌ కేవలం ఎంబాపేపైనే ఆధారపడే జట్టు కాదని మరోసారి నిరూపించింది. బంతిపై ఆధిపత్యం చెలాయించడం, ప్రత్యర్థికి అవకాశాలు ఇవ్వకుండా నియంత్రించడం, మ్యాచ్‌ మధ్యలోనే వ్యూహాలను మార్చడం, అవసరమైన సమయంలో ఎంబాపే వ్యక్తిగత ప్రతిభతో మ్యాచ్‌ను మలుపు తిప్పడం.. ఇలా అన్ని విభాగాల్లో సమతూకంగా రాణించింది. 2018లో ఛాంపియన్‌గా, 2022లో రన్నరప్‌గా నిలిచిన ఫ్రాన్స్‌.. ఇప్పుడు మరోసారి టైటిల్‌ ఫేవరెట్‌గా నిలుస్తోంది.

తలవంచిన మొరాకో

మరోసారి ఆఫ్రికా ఖండం ఆశలన్నింటినీ మోస్తూ బరిలోకి దిగిన మొరాకో చాలా సేపు ఫ్రాన్స్‌కు గట్టి పోటీ ఇచ్చింది. బ్రహీమ్‌ డియాజ్‌ చురుగ్గా ఆడగా.. రెండో అర్ధభాగంలో అజ్జెదిన్‌ ఊనాహీ మిడ్‌ఫీల్డ్‌ను చక్కగా నడిపించాడు. అచ్రఫ్‌ హకీమీ కుడి వింగ్‌ నుంచి వరుసగా అవకాశాలు సృష్టించాడు. ప్రత్యర్థి పెనాల్టీ బాక్స్‌ వరకు బంతిని సమర్థంగా తీసుకెళ్లినా.. చివరి పాస్‌, చివరి టచ్‌లో మొరాకో తడబడింది. అదే వారి ఓటమికి ప్రధాన కారణమైంది. ఇస్మాయిల్‌ సైబరీ లేని లోటు జట్టులో స్పష్టంగా కనిపించింది. గ్రూప్‌ దశలో మూడు మ్యాచ్‌ల్లోనూ గోల్‌ చేసిన బేయర్న్‌ మ్యూనిచ్‌ ఫార్వర్డ్‌ కెనడాతో జరిగిన మ్యాచ్‌లో హ్యామ్‌స్ట్రింగ్‌ గాయంతో దూరమయ్యాడు. అతడి గైర్హాజరీతో మొరాకో ఫినిషింగ్‌లో పదును కనిపించలేదు.

ఫ్రాన్స్‌ను ఆపడం కష్టమే

మొరాకో ఫ్రాన్స్‌లో చిన్న లోపాన్ని వెతికే ప్రయత్నం చేసినా.. ఫ్రాన్స్‌ మాత్రం 90 నిమిషాల పాటు తన బలాన్ని మరోసారి చాటిచెప్పింది. ఎంబాపే పెనాల్టీ మిస్‌ చేసినా జట్టుపై ఎలాంటి ప్రభావం కనిపించలేదు. దయో ఉపమెకానోకు తొలి ఐదు నిమిషాల్లోనే గోల్‌ చేసే అవకాశం దక్కింది. డిజైర్‌ డూయే పలుమార్లు ప్రమాదకర ప్రాంతాల్లోకి చొచ్చుకెళ్లగా.. మైకేల్‌ ఒలిసే అద్భుత పాస్‌లతో ఆకట్టుకున్నాడు. లూకాస్‌ డిగ్నే కొట్టిన బలమైన షాట్‌ క్రాస్‌బార్‌ను తాకి వెనుదిరిగింది. తొలి అర్ధభాగంలోనే ఫ్రాన్స్‌ 10 షాట్లు నమోదు చేసింది. ఈ టోర్నీలో తొలి అర్ధభాగంలో గోల్‌ చేయకపోయినా అత్యధిక ‘ఎక్స్‌పెక్టెడ్‌ గోల్స్‌’ (1.87) నమోదు చేసిన జట్టుగా నిలిచింది. అయినా ఎక్కడా తొందరపాటు కనిపించలేదు. సరైన అవకాశం కోసం ఓపికగా ఎదురుచూసి.. సమయం రాగానే మ్యాచ్‌ను పూర్తిగా తమవైపు తిప్పుకుంది. ఎంబాపే స్థానంలో జీన్‌-ఫిలిప్‌ మాటేటా వచ్చిన తర్వాత ఫ్రాన్స్‌ ఆటతీరు మరింత మారిపోయింది. వింగ్‌లను సమర్థంగా వినియోగిస్తూ మొరాకో డిఫెన్స్‌ను విస్తరింపజేసింది. బెంచ్‌ నుంచి వచ్చిన బ్రాడ్లీ బార్కోలా ఫ్రాన్స్‌ ఆటలో వేగాన్ని తీసుకొచ్చాడు.

మ్యాచ్‌ను ముగించిన ఎంబాపే

మైకేల్‌ ఒలిసే ఇచ్చిన త్రూ బాల్‌ను అడ్డుకునే ప్రయత్నంలో నుస్సైర్‌ మజ్రౌయి ఫౌల్‌ చేయడంతో ఫ్రాన్స్‌కు పెనాల్టీ లభించింది. వీడియో అసిస్టెంట్‌ రిఫరీ (వీఏఆర్‌) పరిశీలన కారణంగా పెనాల్టీ ఇవ్వడానికి మూడు నిమిషాలకుపైగా ఆలస్యమైంది. చివరకు ఎంబాపే కొట్టిన షాట్‌ను బోనూ అడ్డుకోవడంతో మొరాకో ఆశలు మరింత పెరిగాయి. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. పెనాల్టీ బాక్స్‌ వెలుపల బంతిని అందుకున్న ఎంబాపే కుడి కాలితో సంధించిన అద్భుత కర్లింగ్‌ షాట్‌కు బోనూ అడ్డుకోలేకపోయాడు. దాంతో ఫ్రాన్స్‌ ఆధిక్యంలోకి వెళ్లింది. ఆరు నిమిషాల తర్వాత మరోసారి ఎంబాపే తన తెలివైన పరుగుతో మొరాకో డిఫెండర్లను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేయగా.. దీంతో ఏర్పడిన ఖాళీని అందిపుచ్చుకున్న డెంబెలే రెండో గోల్‌ నమోదు చేసి ఫ్రాన్స్‌ విజయాన్ని ఖాయం చేశాడు.

రికార్డుల వేటలో ఎంబాపే

ఈ గోల్‌తో ఎంబాపే టోర్నీలో ఎనిమిది గోల్స్‌ చేసి గోల్డెన్‌ బూట్‌ రేసులో లియోనెల్‌ మెస్సీతో సమానంగా నిలిచాడు. ప్రపంచకప్‌ల్లో అతడి మొత్తం గోల్స్‌ సంఖ్య 20కు చేరి.. ఫ్రాన్స్‌ తరఫున ప్రపంచకప్‌ చరిత్రలో అత్యధిక గోల్స్‌ చేసిన ఆటగాడిగా తన రికార్డును మరింత పదిలం చేసుకున్నాడు. 1966 తర్వాత రెండు వేర్వేరు ప్రపంచకప్‌ల్లో ఎనిమిది లేదా అంతకంటే ఎక్కువ గోల్స్‌ చేసిన తొలి ఆటగాడిగానూ నిలిచాడు. ప్రపంచకప్‌ నాకౌట్‌ మ్యాచ్‌ల్లో గోల్స్‌, అసిస్ట్స్‌ కలిపి 13 గోల్స్‌లో ఎంబాపే భాగస్వామ్యమయ్యాడు. ఈ విషయంలో గత ఆరు దశాబ్దాల్లో లియోనెల్‌ మెస్సీ మాత్రమే అందరికంటే ముందున్నాడు.

Advertisement
Advertisement