త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy Delhi Speech | దేశంలో 20 కోట్ల ఓట్లను తొలగించేందుకు కేంద్రం కుట్ర

దేశంలో 20 కోట్ల ఓట్లను తొలగించేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఢిల్లీ వేదికగా ప్రధాని మోదీపై నిప్పులు చెరిగిన తెలంగాణ సీఎం.

J

Telangana | Published On Nov 1, 2026, 7.13 pm IST

Revanth Reddy Delhi Speech | దేశంలో 20 కోట్ల ఓట్లను తొలగించేందుకు కేంద్రం కుట్ర

సంక్షిప్త సారాంశం

ఢిల్లీ రాంలీలా మైదాన్‌లో జరిగిన ఇండియా కూటమి 'ఓటు బచావో... దేశ్ బచావో' బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని కేంద్రంపై ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ ఎన్నికల కమిషన్‌ను అడ్డుపెట్టుకుని ఇప్పటికే 13.50 కోట్ల ఓట్లు తొలగించారని, మరో 20 కోట్ల ఓట్లు తొలగించేందుకు ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ నుంచి కార్యకర్తలు రాకుండా ప్రత్యేక రైళ్లను రద్దు చేసినా వేలాదిగా ఢిల్లీకి తరలివచ్చారని రేవంత్ స్పష్టం చేశారు. రావణుడిని రాముడు ఓడించినట్లుగా, మోదీని గద్దె దించేందుకు కాంగ్రెస్ 'వానర సేన' పోరాడుతుందని పిలుపునిచ్చారు.

Advertisement
  • రావణుడిని రాముడు ఓడించినట్లుగా.. మోదీని కాంగ్రెస్ 'వానర సేన' గద్దె దించుతుంది
  • మోదీ గద్దె దిగేదాకా విశ్రమించం
  • ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి ధ్వజం

Revanth Reddy Delhi Speech | త్రినేత్ర న్యూస్ : దేశంలో రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కాలరాసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీవ్ర కుట్రలకు పాల్పడుతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. దేశవ్యాప్తంగా దాదాపు 20 కోట్ల ఓట్లను తొలగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని మండిపడ్డారు. ఇండియా (INDIA) కూటమి ఆధ్వర్యంలో ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో నిర్వహించిన 'ఓటు బచావో... దేశ్ బచావో' మహా ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన సీఎం రేవంత్‌కు తెలంగాణ భవన్‌లో వేలాదిగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు నీరాజనాలు పలికాయి.

400 సీట్లు రాలేదనే పేదలపై మోదీ కక్ష: సీఎం రేవంత్

తెలంగాణ భవన్‌లో కాంగ్రెస్ శ్రేణులను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. "కులాలు, మతాల పేరుతో దేశ ప్రజలను విభజించి మోదీ రెండుసార్లు అధికారంలోకి వచ్చారు. 2024 ఎన్నికల్లో 400 సీట్లు దాటితే రాజ్యాంగాన్ని మార్చేసి, రిజర్వేషన్లు రద్దు చేసి, దళితులు, ఆదివాసీలు, మహిళల ఓట్లను తొలగించాలని భావించారు. కానీ ప్రజలు ఆ సంఖ్యాబలాన్ని ఇవ్వకపోవడంతోనే ఇప్పుడు పేదలపై కక్షగట్టి అడ్డదారుల్లో ఓట్లను తొలగిస్తున్నారు" అని ఆరోపించారు.

CM Revanth Reddy Slams PM Modi in Delhi Over 20 Crore Voter Deletion Plot

బాబాసాహెబ్ అంబేడ్కర్ దేశ పౌరులందరికీ కల్పించిన ఓటు హక్కును హరించేందుకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌ను కేంద్రం పావుగా వాడుకుంటోందని రేవంత్ ధ్వజమెత్తారు. ఇప్పటికే దేశంలో 13.50 కోట్ల ఓట్లు తొలగించారని, మొత్తం ఓటర్లలో 15 నుంచి 20 శాతం అంటే దాదాపు 20 కోట్ల ఓట్లను ఎలక్షన్ కమిషన్ ద్వారా గల్లంతు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని హెచ్చరించారు. ప్రయోగాత్మకంగా ఓట్లను తొలగించే కుట్రలతోనే బీజేపీ ఇప్పటికే బిహార్, మహారాష్ట్రల్లో పాగా వేసిందని.. అదే పంథాను దేశవ్యాప్తంగా అమలు చేయాలని చూస్తోందని పేర్కొన్నారు.

రైళ్లు ఆపినా తగ్గని తెలంగాణ కాంగ్రెస్ జోరు

ఢిల్లీ మహా సభకు తెలంగాణ నుంచి సుమారు 15 వేల మంది కార్యకర్తలు తరలివచ్చేలా ప్రత్యేక రైళ్లను బుక్ చేసుకుంటే, ఆఖరి నిమిషం వరకు నమ్మించి రైల్వే శాఖ ద్వారా వాటిని రద్దు చేయించారని సీఎం ఆరోపించారు. "రైళ్లు ఇవ్వకపోయినా కార్యకర్తలు ప్రైవేట్ వాహనాలు, ఇతర మార్గాల్లో వేలాదిగా ఢిల్లీకి తరలివచ్చారు. మోదీ, అమిత్ షా, జ్ఞానేష్ కుమార్ కలిసి కార్యకర్తల పట్టుదలను అడ్డుకోలేకపోయారు. తెలంగాణ బలం ముందు, తెలంగాణ గళం ముందు కేంద్ర పాలకులు తలవంచక తప్పలేదు" అని రేవంత్ స్పష్టం చేశారు.

రావణుడిని అంతమొందించే వానర సేన మాదే

త్రేతాయుగంలో రావణాసురుడిని ఓడించేందుకు శ్రీరాముడికి వానర సేన ఎలాగైతే తోడ్పడిందో, నేడు ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్న మోదీని గద్దె దించేందుకు తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు వానర సైన్యంలా పోరాడతాయని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. ఈ పోరాటంలో విజయం సాధించే వరకు విశ్రమించే ప్రసక్తే లేదని, రాంలీలా మైదాన్ సంకల్పంతో మోదీ సర్కార్ కుప్పకూలి గుజరాత్ బాట పట్టడం ఖాయమని హెచ్చరించారు.

తెలంగాణ భవన్ సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసానికి వెళ్లారు. అక్కడ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ, ఫరూఖ్ అబ్దుల్లా, తేజస్వి యాదవ్, మెహబూబా ముఫ్తీ, సంజయ్ రౌత్ వంటి ఇండియా కూటమి అగ్రనేతలతో కలిసి ఓపెన్ టాప్ జీపులో రాంలీలా మైదాన్ మహా సభకు ర్యాలీగా కదిలారు. దారిపొడవునా తెలంగాణ సీఎం రేవంత్‌తో సెల్ఫీలు, కరచాలనం కోసం కాంగ్రెస్ శ్రేణులు ఎగబడ్డాయి.

ట్యాగ్స్:

CM Revanth ReddyDelhi SpeechGyanesh KumarPm ModiRamlila MaidanRevanth ReddyVote Bachao Desh Bachao
Advertisement
Advertisement