త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | ప‌ల్లీ బఠానీల్లా ప్ర‌శ్నాప‌త్రాల‌ను అమ్ముకున్న‌రు : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | గ‌త ప్ర‌భుత్వం ప‌రీక్ష‌ల‌ను స‌రిగా నిర్వ‌హించ‌లేదు.. ప్ర‌శ్నాప‌త్రాల‌ను ప‌ల్లీ బ‌ఠానీల్లా అమ్ముకున్నార‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.

S

Telangana | Published On Jan 16, 2026, 8.53 pm IST

CM Revanth Reddy | ప‌ల్లీ బఠానీల్లా ప్ర‌శ్నాప‌త్రాల‌ను అమ్ముకున్న‌రు : సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : గ‌త ప్ర‌భుత్వం ప‌రీక్ష‌ల‌ను స‌రిగా నిర్వ‌హించ‌లేదు.. ప్ర‌శ్నాప‌త్రాల‌ను ప‌ల్లీ బ‌ఠానీల్లా అమ్ముకున్నార‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. మేం అధికారంలోకి వ‌చ్చాక టీజీపీఎస్సీని స‌మూలంగా ప్ర‌క్షాళ‌న చేశాం.. యూపీఎస్సీని స్వ‌యంగా ప‌రిశీలించి టీజీపీఎస్సీని ఏర్పాటు చేశామ‌ని సీఎం రేవంత్ తెలిపారు. శిల్పాక‌ళా వేదిక‌గా గ్రూప్ -3 ఉద్యోగ అభ్య‌ర్థుల‌కు సీఎం రేవంత్ నియామ‌క ప‌త్రాల‌ను అందించారు.

ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఆర్ఎంపీ డాక్ట‌ర్, డిప్యూటీ ఎమ్మార్వో, రిటైర్డ్ టీచ‌ర్‌ను టీజీపీఎస్సీ స‌భ్యులుగా గ‌త ప్ర‌భుత్వం నియ‌మించింది. తెలంగాణ నిరుద్యోగుల ప‌ట్ల గ‌త ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించింది. తెలంగాణ ప‌ట్ల చిత్త‌శుద్ది ఉన్న‌వాళ్లేనే టీజీపీఎస్సీ స‌భ్యులు గా నియ‌మించామ‌ని సీఎం తెలిపారు.

పుట్టిన బిడ్డ ప్ర‌యోజ‌కుడు అయితే త‌ల్లిదండ్రుల ఆనందం అంతా ఇంతా కాదు. కూలీ ప‌ని చేసి మ‌రీ త‌ల్లిదండ్రులు చ‌ద‌వించి పోటీ ప‌రీక్ష‌ల‌కు త‌యారు చేశారు. ఉస్మానియా, కాక‌తీయ యూనివ‌ర్సిటీల్లో విద్యార్థులు ఉద్య‌మ‌కారుల‌య్యారు. విద్యార్థులు అవ‌స‌ర‌మైన సంద‌ర్భంలో ప్రాణ‌త్యాగాలు చేసి తెలంగాణ‌ను సాధించారు. 10 ఏళ్ల‌లో రెండు సార్లు సీఎం అయిన వ్య‌క్తులు రాజ‌కీయ‌, కుటుంబ‌, పార్టీ ప్ర‌యోజనాల కోస‌మే ప‌నిచేశారు. ప్ర‌భుత్వ ఉద్యోగాల భ‌ర్తీ పైన ఆలోచ‌న చేయ‌లేదు. కుటుంబం మొద‌టి ప్రాధాన్య‌త‌, పార్టీ రెండో ప్రాధాన్య‌త‌, రాజ‌కీయాలు మూడో ప్రాధాన్య‌త‌గా గ‌త పాల‌కులు ఆలోచించారు. తెలంగాణ యువ‌త గురించి ఆలోచించ‌లేదు. వాళ్ల ఉద్యోగాలు తొల‌గిస్తేనే మాకు ఉద్యోగాలు వ‌స్తాయ‌ని నిరుద్యోగ యువ‌త న‌డుం బిగించారు కాబ‌ట్టే ప్ర‌జా ప్ర‌భుత్వం ఏర్ప‌డింది అని సీఎం పేర్కొన్నారు.

టీజీపీఎస్సీలో దారుణ ప‌రిస్థితులు అంద‌రికి తెలుసు. 14 ఏళ్ల పాటు గ్రూప్-1 నియామ‌కాలు చేప‌ట్ట‌లేక‌పోయారు. ఇంత కంటే దారుణం, ఘోరం ఎక్క‌డైనా ఉంటుందా..? 563 గ్రూప్-1 ఉద్యోగాల కోసం 5 ల‌క్ష‌ల మంది ద‌ర‌ఖాస్తులు పెట్టుకున్నారు. 731 గ్రూప్ -2 ఉద్యోగాల కోసం కూడా 5 లక్ష‌ల మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ప్ర‌భుత్వ టీచ‌ర్లు, గ్రూప్ 1, 2, 3 వంటి ఉద్యోగాల‌ను ఒక బాధ్య‌త‌తో ఎలాంటి త‌ప్పులు లేకుండా భ‌ర్తీ చేశాం. నియామ‌క‌ప‌త్రాలు ఇవ్వొద్ద‌ని కుట్ర‌లు చేసినా కోర్టుల ముందు కొట్లాడి భ‌ర్తీ చేశాం. రెండేళ్ల‌లో దాదాపు 70 వేల ప్ర‌భుత్వ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేశాం. ఎల్బీ స్టేడియం, శిల్పారామం, సాగునీటి పారుదల శాఖ కార్యాల‌యం, అంబేద్క‌ర్ విగ్ర‌హం సాక్షిగా నియామ‌క ప‌త్రాల‌ను అంద‌జేశాం.
భ‌విష్య‌త్తు త‌రాల‌కు మీ ఉద్యోగాలు దిక్సూచిగా మారుతుంది. తెలంగాణ రాష్ట్ర‌ ప్ర‌భుత్వ ఉద్యోగం అంటే ఒక భావోద్వేగం. తెలంగాణ రాష్ట్ర పున‌ర్ నిర్మాణంలో మిమ్మ‌ల్ని భాగ‌స్వాములు చేస్తోంది. 25 ప్ర‌భుత్వ‌ శాఖ‌ల్లో 1370 ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తున్నాం. ఉద్యోగ నియామ‌కాల‌తో మమ్మ‌ల్నీ క‌లిసి మీ క‌ళ్ల‌లో ఆనందం చూడాల‌నే ఈ స‌మావేశాన్ని ఏర్పాటు చేశాం అని సీఎం తెలిపారు.

మాజీ ప్ర‌ధాని నెహ్రు విద్య‌, నీటిపారుద‌ల రంగానికి ప్రాధాన్య‌త ఇచ్చారు. దేశంలో హ‌రిత విప్ల‌వాన్ని తీసుకువ‌చ్చి అహార భ‌ద్ర‌త క‌ల్పించింది మాజీ ప్ర‌ధాని నెహ్రు. విద్య అంద‌రికి అందుబాటులో ఉన్న‌ప్ప‌టికి నాణ్య‌మైన విద్య ప్ర‌జ‌ల‌కు అంద‌డం లేదు. 16 ల‌క్ష‌ల మంది విద్యార్థులు మాత్ర‌మే ప్ర‌భుత్వ పాఠ‌శాల్లో చ‌దువుతున్నారు. 11 వేల ప్రైవేట్ స్కూల్స్‌లో 33 ల‌క్ష‌ల విద్యార్థులు చ‌దువుతున్నారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌పైన ఎందుకు విశ్వాసం త‌గ్గుతుందో ఆలోచించాలి. పేద‌ల‌కు నాణ్య‌మైన విద్య‌ను అందిస్తే ప్ర‌పంచంతో పోటీ ప‌డ‌గ‌ల‌మనే విశ్వానం నాకుంది అని సీఎం పేర్కొన్నారు.

భార‌త‌దేశంలోనే అత్య‌ధికంగా వ‌రి పండించే రాష్ట్రంగా తెలంగాణ నిల‌బ‌డింది. 2 కోట్ల‌ 85 ల‌క్ష‌ల మెట్రిక్ టన్నుల వ‌రిని పండించి దేశానికి ఆద‌ర్శంగా నిల‌బ‌డ్డాం. క్వాలిటీ ఎడ్యూకేష‌న్, క్వాలిటీ పుడ్, స్కిల్ పైన దృష్టి పెడుతున్నాం. స్కిల్ లేక‌పోవ‌డంతో అంత‌ర్జాతీయ స్థాయిలో పోటీ ప‌డ‌లేక‌పోతున్నాం. విద్య‌లో స్కిల్ చాలా ముఖ్య‌మైన‌ది.. స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ కోసం ప‌నిచేయాల్సి ఉంది. నాణ్య‌మైన విద్య‌ను అందించే అవ‌కాశం ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర ఉంది. విద్య ఒక్క‌టే జీవితాల్లో మార్పు, వెలుగులు తీసుకువ‌స్తుంది. ప్ర‌భుత్వానికి వార‌ధులు, సార‌ధులు ప్ర‌భుత్వ ఉద్యోగులే. 2047 నాటికి మూడు ట్రిలియ‌న్ డాల‌ర్ల ఎకాన‌మీగా తెలంగాణను తీర్చిదిద్ద‌డ‌మే ల‌క్ష్యంగా ప‌నిచేస్తున్నాం. గ‌రం, న‌రం, బేష‌ర‌మ్ నానుడి త‌ప్పు అని ఉద్యోగులు నిరూపించాలి. పేద‌ల మోహంలో త‌ల్లిదండ్రుల‌ను చూసుకుని ప్ర‌భుత్వ ఉద్యోగులు సేవలు ల‌క్ష్యంగా అందించాలి అని సీఎం సూచించారు.

త‌ల్లిదండ్రుల‌ను గౌర‌వంగా చూసుకొని ఉద్యోగుల‌ జీతంలో 10 నుంచి 15 శాతం కోత విధించి త‌ల్లిదండ్రుల‌కు అంద‌జేస్తాం. త‌ల్లిదండ్రుల‌ను స‌రిగా చూసుకోని వాళ్లు మాన‌వ జ‌న్మ‌లో ఉండొద్దు. త‌ల్లిదండ్రుల‌ను బాగా చూసుకోవాలి. రాజ‌కీయ పార్టీల చేతుల్లో ఆయుధాలుగా మారొద్దు.ప్ర‌భుత్వ ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తాం. ఉస్మానియా యూనివ‌ర్సిటీలో, అశోక్ న‌గ‌ర్ చౌర‌స్తాలో నిరుద్యోగులు ఏం మాట్లాడుకుంటున్నారో నాకు తెలుసు అని సీఎం పేర్కొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement