త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | బీజేపీతో పోరాడే శక్తి కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది..

CM Revanth Reddy | భార‌తీయ జ‌నతా పార్టీతో పోరాడే శ‌క్తి కాంగ్రెస్ పార్టీకి మాత్ర‌మే ఉంద‌ని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ గల్లీ నుంచి వెళ్లిన కారు.. ఢిల్లీకి చేరగానే మోదీ కమలంగా మారిపోతోంది అని విమ‌ర్శించారు. కాంగ్రెస్‌కు మాత్రమే బీజేపీని ఎదుర్కొనే సత్తా ఉందని సీఎం స్ప‌ష్టం చేశారు.

S

Telangana | Published On Nov 11, 2026, 3.03 pm IST

CM Revanth Reddy | బీజేపీతో పోరాడే శక్తి కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది..
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర న్యూస్ : భార‌తీయ జ‌నతా పార్టీతో పోరాడే శ‌క్తి కాంగ్రెస్ పార్టీకి మాత్ర‌మే ఉంద‌ని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ గల్లీ నుంచి వెళ్లిన కారు.. ఢిల్లీకి చేరగానే మోదీ కమలంగా మారిపోతోంది అని విమ‌ర్శించారు. కాంగ్రెస్‌కు మాత్రమే బీజేపీని ఎదుర్కొనే సత్తా ఉందని సీఎం స్ప‌ష్టం చేశారు. జాతీయ విద్యా దినోత్స‌వం, మైనార్టీ సంక్షేమ దినోత్సవం సంద‌ర్భంగా బంజారా భ‌వ‌న్‌లో అబుల్ క‌లాం ఆజాద్ చిత్ర‌ప‌టానికి సీఎం రేవంత్ రెడ్డి పుష్పాంజ‌లి ఘ‌టించారు. అనంత‌రం సీఎం ప్ర‌సంగించారు.

దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఎడ్యుకేషన్, ఇరిగేషన్‌కు మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. దేశంలో విద్యాభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేందుకు తొలి విద్యా శాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కు బాధ్యతలు అప్పగించారు. దేశంలో ఐఐటీలను ఏర్పాటు చేసి ఎంతో మంది ఇంజనీర్లుగా తయారయ్యేందుకు ఆజాద్ పునాది వేశారు. దేశంలో విద్యాభివృద్ధికి ఎడ్యుకేషన్ పాలసీని రూపొందించిన ఘనత ఆజాద్ సొంతం. ఆయ‌న‌ హయాంలోనే ఐటీఐలకు పునాది పడింది. ఆ ఐటీఐలను మనం ఇప్పుడు ఏటీసీలుగా అప్‌గ్రేడ్ చేసుకున్నాం. నాణ్యమైన విద్యను అందించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకు వెళుతోంది. సాఫ్ట్‌వేర్ రంగంతో పాటు పలు విభాగాల్లో ఏఐతో ఉద్యోగాలు పోయే పరిస్థితి ఉంది. కానీ బ్లూ కాలర్ జాబ్స్‌ను ఏఐతో చేయలేం. నైపుణ్యం పెంచుకుంటే భవిష్యత్‌లో బ్లూ కాలర్ ఉద్యోగ అవకాశాలకు కొదవ లేదు అని సీఎం తెలిపారు.

గులాంనబీ ఆజాద్ నుంచి షబ్బీర్ అలీ వరకు కాంగ్రెస్ పార్టీ మైనారిటీలకు ఎన్నో అవకాశాలను ఇచ్చింది. మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్ అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీది. మైనారిటీ రిజర్వేషన్‌ను తొలగిస్తామని బీజేపీ చేవెళ్ల సభలో ప్రకటించింది. ముందు గుజరాత్‌లో తొలగించి చూపించాలని మేం సవాల్ విసిరాం. మైనారిటీల సంక్షేమం మా బాధ్యత. దేశంలో ఏ రాజకీయ పార్టీకి స్వాతంత్య్ర‌ కోసం పోరాడిన చరిత్ర లేదు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ సొంతం అని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

పేదలకు, మైనారిటీలకు కాంగ్రెస్ ఓటు హక్కు కల్పిస్తే.. బీజేపీ ఆ ఓట్లను తొలగించాలని చూస్తోంది. 12 ఏళ్లు గడిచినా బీజేపీ మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్ హామీ నిలబెట్టుకోలేదు. మైనారిటీ స్కాలర్‌షిప్‌లను తొలగించాలని బీజేపీకి ఏ దేవుడు చెప్పాడు. క్రీడల్లో దేశ ప్రతిష్టను పెంచిన మైనారిటీ క్రీడాకారులకు తెలంగాణ ప్రభుత్వం నగదు బహుమతితో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి గౌరవించింది. అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చి గౌరవించాం. షబ్బీర్ అలీని సలహాదారులుగా నియమించాం. ప్రజా ప్రభుత్వంలో మైనారిటీలకు ఎన్నో అవకాశాలు కల్పించామ‌ని సీఎం తెలిపారు.

హైదరాబాద్ ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ. సిటీని కాపాడుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఓల్డ్ సిటీలో మెట్రో పనులను వేగవంతం చేశాం. మూసీ పునరుజ్జీవంతో ఓల్డ్ సిటీకి పూర్వ వైభవం తీసుకొస్తాం. మూసీ నదీ పరీవాహకంలో నైట్ ఏకానమీ అభివృద్ధి చేస్తాం. ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది.. మీ సంక్షేమం కోసం పనిచేస్తుంది. చదువు ఒక్కటే మీ జీవితాలను మారుస్తుంది. పిల్లలను చదివించండి.. నైపుణ్యాన్ని అందించండి. నిఖత్ జరీన్, సిరాజుద్దీన్ తరహాలో పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించండి. నైపుణ్యం, క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ఇందుకోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశాం. పిల్లలను చదివించండి.. మీ సోదరుడిగా మీకు అండగా నేను ఉంటా.. మీ సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించే బాధ్యత నాది అని రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు అజారుద్దీన్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, వి.హనుమంతరావు, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి దానం నాగేందర్, టీఎంఆర్ఐఎస్ వైస్ చైర్మన్, ప్రెసిడెంట్ ఫహీం ఖురేషీ, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, మైనారిటీ నేతలు హాజ‌ర‌య్యారు.

Advertisement
Advertisement