CM Revanth Reddy | బీఆర్ఎస్‌ను మళ్లీ మొలవనియ్యం.. ఆ జానెడోడిని కూడా : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy | భవిష్యత్‌లో తెలంగాణలో బీఆర్ఎస్‌ను మళ్లీ మొలవనీయ్యానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ తెలంగాణ సమాజం మిమ్మిల్ని, మీ కుటుంబాన్ని శాశ్వతంగా సామాజిక బహిష్కరణ చేసింది. భవిష్యత్‌లో మీకు పదవి ఉండదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సీఎం పేర్కొన్నారు. అవసరమైతే రెండున్నరెండ్ల కాంగ్రెస్ పాలనపై తాటిచెట్ల వద్ద, బార్, బీర్ షాపుల వద్ద కూడా చర్చ పెట్టండని సీఎం సూచించారు.
మీ కుటుంబాన్ని సామాజిక బహిష్కరణ చేశారు
భవిష్యత్‌లో మీకు పదవులు ఉండవు
ప్రజా పాలన పోవాల్నట.. పాపాల భైరవుడు రావాల్నట
రెండున్నరేండ్ల పాలనపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా..?
అవసరమైతే బార్, బీర్ షాపు వద్ద కూడా చర్చ పెట్టండి
ఒట్టేసి చెబుతున్నా.. మూసీ పూర్తి చేసి తీరుతా
ఎస్ఎల్‌బీసీ పూర్తి చేస్తా.. నల్లగొండ నేలపై కృష్ణమ్మను పారిస్తా
నల్లగొండ సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : భవిష్యత్‌లో తెలంగాణలో బీఆర్ఎస్‌ను మళ్లీ మొలవనీయ్యానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ తెలంగాణ సమాజం మిమ్మిల్ని, మీ కుటుంబాన్ని శాశ్వతంగా సామాజిక బహిష్కరణ చేసింది. భవిష్యత్‌లో మీకు పదవి ఉండదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సీఎం పేర్కొన్నారు. అవసరమైతే రెండున్నరెండ్ల కాంగ్రెస్ పాలనపై తాటిచెట్ల వద్ద, బార్, బీర్ షాపుల వద్ద కూడా చర్చ పెట్టండని సీఎం సూచించారు. నా జీవిత లక్ష్యం ఒక్కటే.. మూసీ నదిని ప్రక్షాళన చేయడమే. ఒట్టేసి చెబుతున్నా.. మూసీ ప్రక్షాళన పూర్తి చేసి తీరుతానని సీఎం శపథం చేశారు. పదేండ్లు పడావు పెట్టిన ఎస్ఎల్‌బీసీని పూర్తి చేసి నల్లగొండ నేలపై కృష్ణా జలాలను పారిస్తానని రేవంత్ అన్నారు. నల్గొండ జిల్లా కనగల్ ఏఎంసీ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ రోడ్స్ పైలాన్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం ఎన్‌జీ కాలేజీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగించారు.
తొలి దశ తెలంగాణ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ మంత్రి పదవిని త్యాగం చేశారు. మలిదశ ఉద్యమంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి పదవిని త్యాగం చేసి ఆమరణ నిరాహార దీక్ష చేశారు. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవి తీసుకున్నారు. త్యాగాలు చేశామని చెప్పుకుంటున్న బీఆర్ఎస్ నేతలు.. కేవలం ఎలక్షన్, సెలక్షన్, కలెక్షన్ మీద రాజకీయాలు చేశారు. తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య, యాదయ్య త్యాగాన్ని ఏమనాలి..? అని సీఎం నిలదీశారు.
ఆ జానెడును కూడా మళ్లా మొలవనివ్వం
బావబామ్మర్దులు తోడేండ్ల మాదిరి తెలంగాణ మీద తిరుగుతున్నారు.. మా ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని వారు చెబుతున్నారు.. ప్రజలెవరూ కోరుకోవడం లేదు.. మీ కుటుంబంతో పాటు మీ దోపిడీ, దొంగతనాల్లో అండగా నిలడ్డ వారు కోరుకుంటున్నారు. ప్రజాపాలనతో ప్రజల్లో చైతన్యం వచ్చింది. అభివృద్ధి సంక్షేమ పథకాలను అనుభవిస్తున్నవారిని చూసి అసూయపడుతున్న వారు కోరుకుంటున్నారు. ఈ తెలంగాణ సమాజం మిమ్మిల్ని మీ కుటుంబాన్ని శాశ్వతంగా సామాజిక బహిష్కరణ చేపట్టారు. భవిష్యత్‌లో మీకు పదవి ఉండదు. భవిష్యత్ లేదన్న సంగతి నల్లగొండ వేదికగా ప్రజలు చెబుతున్నారు. బీఆర్ఎస్ మొక్క కూడా మొలవదు. తులసి వనంలో గంజాయి మొక్కలా సూర్యాపేటలో జానెడోడు మిగిలిండు. ఆ జానెడును కూడా మళ్లా మొలవనివ్వం. మా వెంకన్న మీద మూడు అడుగులు ఎగురుతుండు.. మళ్లాసారి చూసుకుంటాం అని యువకులు చెప్పిపోయారు అని సీఎం తెలిపారు.
సిద్ధంగా ఉంటే స్పీకర్, చైర్మన్‌కు లేఖ రాయండి
అధికారం కోల్పోయిన అక్కసుతో, కడుపు నిండా విషంతో మూసీ కంపు కంటే వీరి కంపు ఎక్కువైంది. ఈ రెండేండ్లలో ఏం తెచ్చారని అడుగుతున్నారు. ఎప్పుడు అడిగినా ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను, మండలి సమావేశాలను ఏర్పాటు చేస్తాం. పదేండ్ల బీఆర్ఎస్ పాలన, 12 ఏండ్ల బీజేపీ పాలన, రెండున్నరేండ్ల మా పాలనపై ప్రత్యేక సమావేశాల్లో చర్చ చేద్దాం. సిద్ధంగా ఉంటే స్పీకర్, చైర్మన్‌కు లేఖ రాయండి. మీరు అడిగిన్న రోజులు సభ పెడుదాం. ఏ విషయమైనా ప్రత్యేక చర్చ చేద్దామని సవాల్ విసురుతున్నానని సీఎం పేర్కొన్నారు.
పేదలు ఇండ్లు కట్టుకుంటుంటే మీ కడుపు అంతా మసిమసి
తెలంగాణలో నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నాం. పేదలు ఇండ్లు కట్టుకుంటుంటే మీ కడుపు అంతా మసిమసి అవుతుంది. మీరు ఎకరాల కొద్ది ఎకరాల కొద్ది వందల కోట్లు పెట్టి ఫామ్ హౌజ్‌లు కట్టుకోవచ్చు.. కానీ పేదోడు ఇందిరమ్మ ఇండ్లు కట్టుకుంటే మీ కడుపు మంట ఏంది..? యూరియా తెచ్చి రైతుల కష్టాలు తీర్చే ప్రయత్నం చేస్తున్నాం. 80 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరించి దేశంలోనే రికార్డు సృష్టించాం. ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్ స్కీం అమలు చేస్తున్నాం. గురుకులాల్లో అంబేద్కర్‌లను సృష్టించాలని మొక్కవోని ధైర్యంతో ప్రయత్నం చేస్తున్నాం. విద్యా, వైద్యం. సంక్షేమం, అభివృద్ధి విషయంలో ముందుచూపుతో ముందుకు వెళ్తున్నామని సీఎం స్పష్టం చేశారు.
చేతితో కొట్టాల్నా.. రబ్బర్ చెప్పుతో కొట్టాల్నా..
30 నెలల్లోనే 70 వేల ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగల ఆత్మగౌరవం నిలబెట్టాం. ప్రజా పాలన పోవాల్నట.. పాపాల భైరవుడు రావాల్నాట.. ప్రజా పాలన ఎందుకు పోవాలి.. రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇల్లు, ఉచిత కరెంట్ ఇచ్చినందుకా..? లేకపోతే మీ ఫీజు రీయింబర్స్‌మెంట్ చేసినందుకా..? రైతు రుణమాఫీ చేసినందుకు పోవాల్నా..? రైతు భరోసా ఇచ్చినందుకు ప్రజా పాలన పోవాల్నా..? పిల్లల చదువులు బాగు చేసినందుకు, స్కిల్ యూనివర్సిటీ తెచ్చినందుకు, పాలిటెక్నిక్ కాలేజీలను పునరుద్ధరించినందుకు ప్రజా పాలన పోవాల్నా..? ఎందుకోసం పోవాలి. నీవు పడావుపెట్టిన ఎస్ఎల్‌బీసీ పూర్తి చేసి 3 లక్షల 60 వేల ఎకరాలకు సాగు తాగు నీరు ఇస్తున్నందుకు పోవాల్నా..? పాపాల భైరవుడు వస్తే.. ఏం చేస్తడు..? చివరకు భార్యాభర్తలు మాట్లాడితే కూడా విన్నోడిని ఏమనాలి..? చేతితో కొట్టాల్నా.. రబ్బర్ చెప్పుతో కొట్టాల్నా.. ఆలోచన చేయండి. అలాంటి పాపాల భైరవుడు మళ్లీ రావాల్నా..? పేపర్ లీక్‌లు చేసి వేలకోట్లు సంపాదించుకున్నోడు మళ్లీ రావాల్నా..? కొంతమంది ప్రాణాలను హరించిన పాపాల భైరవుడు మళ్లీ రావాల్నా? అని రేవంత్ ప్రశ్నించారు.
నిజం మాట్లాడితే వెయ్యి ముక్కలై చస్తరు
పదేండ్ల పాలన మీద రచ్చబండ, తాటిచెట్టు వద్ద కల్లు తాగేటప్పుడు, బార్, బీర్ షాపుల వద్ద, పెళ్లికాడ, చావుకాడ, సర్పంచ్‌ల సంఘం వద్ద, అసెంబ్లీలో చర్చ పెట్టండి. మనం చేసిన పనులు చెప్పుకోకపోవడం వల్ల బావబామ్మర్దులు ఊరురా తిరిగి అబద్ధం చెబుతున్నారు. నిజం మాట్లాడితే వెయ్యి ముక్కలై చస్తరు అని దేవుడు శాపం పెట్టిండు కాబట్టి.. కుటుంబ మొత్తం అబద్ధాలు చెబుతున్నారు. విద్యాశాఖలో రూ. 3 వేల కోట్ల అవినీతి జరిగిందని అంటున్నారు. చర్చకు సిద్ధమా అంటే వస్తలేరు. సింగరేణిని కొల్లగొట్టారని అబద్ధాలు చెబుతున్నారు. మీ జాతకం ప్రజలకు తెలుసు. మీరు ఎన్ని అబద్దాలు చెప్పినా, ఎన్ని నాటకలు వేసినా తెలంగాణ సమాజం మిమ్మల్ని క్షమించరు.. నమ్మరు అని సీఎం తెలిపారు.
మూసీ నదిలో వేసి తొక్కుతా.. ప్రక్షాళన చేస్తా
ఎస్ఎల్బీసీని పూర్తి చేసి.. కృష్ణా నది జలాలను నల్లగొండ నేల మీద పారిస్తా.. పంటలు పండించే విధంగా నూటికి నూరుశాతం ఎస్ఎల్‌బీసీ పూర్తి చేయడమే కాకుండా డిండి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సంపూర్ణంగా సహకరిస్తాను. నా జీవిత లక్ష్యం ఒక్కటే.. మూసీ నది ప్రక్షాళన. ఈ దేశానికి ఎవడు వచ్చిన మూసీ నది ప్రక్షాళన చూడడానికి రావాలి. మూసీ నదిని దేశానికి తలమానికంగా తయారు చేస్తాను. మూసీ కంపు నుంచి నల్లగొండ ప్రజలకు విముక్తి కల్పిస్తా ఆ బాధ్యత నాది.. ఒట్టేసి చెబుతున్నా మూసీ పూర్తి చేస్తాం. ఎవడు వచ్చినా, అడ్డం పడ్డా, ఆత్మహత్య చేసకున్నా.. మూసీ నదిలో వేసి తొక్కుతా.. ప్రక్షాళన చేస్తా అని సీఎం తేల్చిచెప్పారు.
మీరందరూ అండగా ఉంటారా..?
రాసుకోండి.. 1994 నుంచి 2004 వరకు టీడీపీ, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్, 2014- 2024 వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. నల్లగొండ ప్రజల ఆశీర్వాదంతో 2024 నుంచి 2034 వరకు మూడు రంగుల జెండా ఎగురుతుంది.. ప్రజల ఆకాంక్షలు తీరుస్తుంది. ప్రజల ఉనికిని, మనుగడను కాపాడుతుంది. తెలంగాణను దేశంలోనే నంబర్ వన్‌గా తీర్చిదిద్దుతాం. మీరందరూ అండగా ఉంటారా..? అని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగాన్ని ముగించారు.
తాజావార్తలు
- ●Saudi Aramco Helicopter Crash | సౌదీలో ఘోర ప్రమాదం: 'అరామ్కో' హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం
- ●World Rowing Cup | చరిత్ర సృష్టించిన భారత్.. వరల్డ్ రోయింగ్ కప్‌లో తొలిసారి గోల్డ్ మెడల్..!
- ●Nitin Nabin | బెంగాల్ స్ఫూర్తితో తెలంగాణలో ముందుకు సాగాలి
- ●Prabhas | ప్రభాస్ ఫౌజీ థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడంటే? - రిలీజ్ డేట్‌పై కొత్త రూమర్?
- ●PM Modi Seychelles Visit | సీషెల్స్ అత్యున్నత పురస్కారం అందుకున్న మోదీ: పర్యావరణ యోధులకు అవార్డు అంకితం
- ●Green Hydrogen Train | భారతీయ రైల్వేలో సరికొత్త అధ్యాయం..! త్వరలో పట్టాలెక్కనున్న హైడ్రోజన్ రైలు

Saudi Aramco Helicopter Crash | సౌదీలో ఘోర ప్రమాదం: 'అరామ్కో' హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం

World Rowing Cup | చరిత్ర సృష్టించిన భారత్.. వరల్డ్ రోయింగ్ కప్‌లో తొలిసారి గోల్డ్ మెడల్..!

Nitin Nabin | బెంగాల్ స్ఫూర్తితో తెలంగాణలో ముందుకు సాగాలి

Prabhas | ప్రభాస్ ఫౌజీ థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడంటే? - రిలీజ్ డేట్‌పై కొత్త రూమర్?






