త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi Seychelles Visit | సీషెల్స్ అత్యున్నత పురస్కారం అందుకున్న మోదీ: పర్యావరణ యోధులకు అవార్డు అంకితం

ప్రధాని మోదీ సీషెల్స్ పర్యటనలో చారిత్రక ఘట్టం. ఆ దేశ అత్యున్నత పర్యావరణ పురస్కారం 'గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజాన్' ఆయనకు దక్కింది. ఈ అవార్డు ఎందుకు ఇస్తారంటే?

J

National | Published On Jun 28, 2026, 5.48 pm IST

PM Modi Seychelles Visit | సీషెల్స్ అత్యున్నత పురస్కారం అందుకున్న మోదీ: పర్యావరణ యోధులకు అవార్డు అంకితం
Advertisement
  • సీషెల్స్ 50వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం
  • పర్యావరణ పరిరక్షణలో ఆయన కృషికిగానూ సీషెల్స్ అత్యున్నత పురస్కారం 'గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజాన్' ప్రదానం
  • ఆ దేశ జాతీయ అసెంబ్లీని (National Assembly) ఉద్దేశించి ప్రసంగించిన తొలి భారత ప్రధానిగా మోదీ చరిత్ర
  • రెండు దేశాల మధ్య భద్రత, వాణిజ్యంపై కీలక ఒప్పందాలతో పాటు సీషెల్స్‌కు భారత్ 175 మిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రకటన

PM Modi Seychelles Visit | త్రినేత్ర.న్యూస్ : సముద్ర తీర దేశమైన సీషెల్స్ (Seychelles) పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ఆ దేశ 50వ జాతీయ దినోత్సవ వేడుకలకు (National Day celebrations) ముఖ్య అతిథిగా హాజరైన ఆయనకు.. ఆదివారం విక్టోరియాలోని స్టేట్ హౌస్‌లో సీషెల్స్ అత్యున్నత పర్యావరణ పురస్కారం 'గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజాన్' (Guardian of the Blue Horizon) ను అందజేశారు. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధిలో ఆయన చూపిన అసమాన నాయకత్వానికి ఈ అవార్డు దక్కింది.

పర్యావరణ యోధులకు అంకితం

ఈ అత్యున్నత పురస్కారాన్ని అందుకోవడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని ప్రధాని మోదీ ఆనందం వ్యక్తం చేశారు. ఈ అవార్డును వాతావరణ మార్పులపై (Climate change) తీవ్రంగా పోరాడుతున్న దేశాలకు, భవిష్యత్ తరాల కోసం పర్యావరణాన్ని కాపాడుతున్న ప్రతి ఒక్కరికీ అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా, గతంలో ఐక్యరాజ్యసమితి (UN) నుంచి 'చాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్', 'సియోల్ పీస్ ప్రైజ్', 'అగ్రికోలా మెడల్' వంటి అనేక అంతర్జాతీయ పురస్కారాలను మోదీ అందుకున్నారు.

అసెంబ్లీలో ప్రసంగం.. అరుదైన గౌరవం

ఈ పర్యటనలో మరో కీలక ఘట్టం.. సీషెల్స్ జాతీయ అసెంబ్లీ (Parliament) ని ఉద్దేశించి ప్రసంగించిన తొలి భారత ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించడం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశపు నాయకుడికి తమ సభలో ఆతిథ్యం ఇవ్వడం తమకు దక్కిన అరుదైన గౌరవమని సీషెల్స్ ప్రతిపక్ష నేత బెర్నార్డ్ జార్జెస్ (Bernard Georges) కొనియాడారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య ఉన్న సాంస్కృతిక బంధాలను గుర్తుచేశారు. కరి కోకో (Kari coco), సమోసాలు, దీపావళి, పొంగల్ వంటివి రెండు దేశాల ప్రజలను ఎలా ఏకం చేస్తున్నాయో ఆయన వివరించారు.

'మహాసాగర్' విజన్, భద్రతా ఒప్పందాలు

హిందూ మహాసముద్ర ప్రాంతంలో భద్రత, వృద్ధి కోసం భారత్ తీసుకొచ్చిన 'మహాసాగర్' (MAHASAGAR) విజన్ ప్రాముఖ్యతను మోదీ తన ప్రసంగంలో నొక్కిచెప్పారు. సీషెల్స్ భద్రతను పటిష్టం చేసేందుకు భారత్ తరఫున 'లెస్వార్' (Lespwar) అనే ఫాస్ట్ పెట్రోల్ వెస్సెల్‌ను అందజేశారు. అలాగే సముద్ర భద్రత, వ్యవసాయం, వాణిజ్యం వంటి కీలక రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని పెంచుకోవడానికి సీషెల్స్ అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మిని (Dr Patrick Herminie) తో కలిసి పలు కీలక అవగాహన ఒప్పందాలపై (MoUs) సంతకాలు చేశారు.

సీషెల్స్‌తో భారత్‌కు ఉన్న 50 ఏళ్ల దౌత్య సంబంధాలు ఇప్పుడు మరింత దృఢంగా మారాయని మోదీ స్పష్టం చేశారు. సముద్ర దొంగలు, డ్రగ్స్ స్మగ్లింగ్, అక్రమ చేపల వేటను అరికట్టేందుకు రెండు దేశాలు కలిసి పనిచేయనున్నాయి. ఈ క్రమంలోనే సీషెల్స్ అభివృద్ధికి మద్దతుగా భారత్ ప్రకటించిన 175 మిలియన్ డాలర్ల భారీ ప్యాకేజీని (USD 175 million package) ఆ దేశ అధ్యక్షుడు స్వాగతించారు.

Advertisement
Advertisement