త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nitin Nabin | బెంగాల్ స్ఫూర్తితో తెలంగాణ‌లో ముందుకు సాగాలి

P

Telangana | Published On Jun 28, 2026, 6.57 pm IST

Nitin Nabin | బెంగాల్ స్ఫూర్తితో తెలంగాణ‌లో ముందుకు సాగాలి
Advertisement
  • పోరాట‌ల‌తోనే అధికారం
  • వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌లే ల‌క్ష్యంగా కార్య‌క‌ర్త‌లు ప‌ని చేయాలి
  • పార్టీ విధానాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాలి
  • బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు నితిన్ న‌బిన్‌

Nitin Nabin | ప్రజాసేవతో పాటు నిరంతర ప్రజాపోరాటాల ద్వారానే తెలంగాణలో అధికారాన్ని సాధించగలమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ న‌బిన్ స్పష్టం చేశారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ హైదరాబాద్ చేరుకున్న ఆయన, రాష్ట్రంలో పార్టీ విస్తరణకు కొత్త ఊపునిచ్చే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం శంషాబాద్‌లో నిర్వహించిన భారీ సభలో నితిన్ నబీన్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కామారెడ్డి, సిద్దిపేట, మెదక్, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల బీజేపీ కార్యాలయాలను వర్చువల్‌గా ప్రారంభించారు. పార్టీ సంస్థాగత బలోపేతానికి ఈ కార్యాలయాలు కీలక కేంద్రాలుగా పనిచేస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. సభలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో విపక్షంలో ఉన్న బీజేపీ ఇకపై ప్రజా ఉద్యమాల దిశగా ముందుకు సాగాలని స్పష్టం చేశారు. “ప్రజాసేవ, పోరాటాల ద్వారానే అధికారాన్ని సాధించగలం. ప్రతి కార్యకర్త రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని సంకల్పించాలి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అదే లక్ష్యంతో పనిచేయాలి” అని పార్టీ శ్రేణుల‌కు దిశానిర్దేశం చేశారు.

“ప్రతి మోహల్లా, ప్రతి వీధి, ప్రతి పట్టణం వరకు బీజేపీ సిద్ధాంతం చేరాలి. పార్టీ నాయకత్వం, విధానాలు, ఉద్దేశం ప్రజల్లోకి వెళ్లాలి. గతంలో అధికారంలో ఉన్న పార్టీలు పాలనను వ్యక్తిగత లాభాల కోసం ఉపయోగించారు. అలాంటి వ్యవస్థపై ప్రజలతో కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది” అని నితిన్ నబీన్ వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్‌ను ఆయ‌న ఉదాహరణ‌గా ప్ర‌స్తావించారు. అక్కడ పార్టీ సాధించిన విజయం కార్యకర్తల కృషి, త్యాగాల ఫలితమేనని గుర్తు చేశారు. “మేం బెంగాల్‌లో పోరాడాం. కష్టపడ్డాం. కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ, అదే పోరాటం చివరికి విజయాన్ని ఇచ్చింది. అక్కడ కమలం వికసించింది” అని పేర్కొన్నారు. అదే స్ఫూర్తితో తెలంగాణలోనూ ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.

తెలంగాణ అభివృద్ధి కోసం డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అవసరమని పేర్కొన్న నితిన్ నబీన్, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో “ఏక్ భారత్–శ్రేష్ఠ భారత్” లక్ష్యంగా దేశం ముందుకు సాగుతోందని చెప్పారు. లోక్‌సభలో రెండు సీట్లతో ప్రారంభమైన బీజేపీ ఇప్పుడు దేశవ్యాప్తంగా బలమైన శక్తిగా ఎదిగిందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో బీజేపీ పాత్రను కూడా ఆయన గుర్తు చేశారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ, సుష్మా స్వరాజ్ సహా పార్టీ నేతల పోరాటాల వల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. ఇక ఇదే కార్యక్రమంలో పార్టీ సీనియర్ కార్యకర్తలు, మాజీ జిల్లా అధ్యక్షులతో నితిన్ నబీన్ సమావేశమయ్యారు. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ పార్టీ నిర్మాణంలో వారి పాత్రను ఆయన ప్రశంసించారు. ఈ సందర్భంగా తొమ్మిది జిల్లాల్లో కొత్త జిల్లా కార్యాలయాలు ప్రారంభించడం పార్టీకి మరింత బలం చేకూరుస్తుందని తెలిపారు. “బీజేపీ కార్యకర్తలు ఎప్పుడూ ‘దేశం ముందు, పార్టీ తర్వాత, నేను చివర’ అనే సిద్ధాంతంతో పనిచేస్తున్నారు. అదే మా బలం,” అని ఆయన వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement