త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | సాగునీటి ప్రాజెక్టుల‌కు తీవ్ర నిధుల కొర‌త‌.. సీఎం రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల‌కు, వాటి భూసేక‌ర‌ణకు తీవ్రంగా నిధుల కొర‌త ఉంద‌ని సీఎం రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రూ. 6 వేల కోట్ల అంచ‌నాల‌తో మొద‌లుపెట్టిన దేవాదుల ఇవాళ రూ. 18,500 కోట్లు అవ‌స‌ర‌మైన స్థితికి చేరుకున్న‌ద‌ని సీఎం పేర్కొన్నారు.

S

Telangana | Published On Feb 22, 2026, 7.24 pm IST

CM Revanth Reddy | సాగునీటి ప్రాజెక్టుల‌కు తీవ్ర నిధుల కొర‌త‌.. సీఎం రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు
Advertisement

గోదావ‌రి జ‌లాల‌కు రాజ‌కీయ రంగు..
గ‌త ప‌దేళ్ల‌ల్లో ప్రాజెక్టులు పూర్తి చేస్తే వివాద‌మే లేదు..
కాళేశ్వ‌రం ప్రాజెక్టుకే రూ.1.10 లక్షల కోట్లు ఖర్చు
దేవాదుల ప్ర‌స్తుత అంచ‌నా రూ. 18,500 కోట్లు..
రెండేళ్ల‌ల్లో అన్ని ప్రాజెక్టుల‌ను పూర్తి చేస్తాం..
నీళ్ల విష‌యంలో రాజ‌కీయాలొద్దు..
నీటి వాటాలు చ‌ర్చ‌ల‌తోనే ప‌రిష్కారం..
స‌ల‌హాలు ఇస్తే స్వీక‌రిస్తాం..
కాళేశ్వ‌రంను మ‌ళ్లీ వినియోగంలోకి తెస్తాం..
దేవాదుల సంద‌ర్శ‌న సంద‌ర్భంగా సీఎం రేవంత్ కీల‌క వ్యాఖ్య‌లు

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల‌కు, వాటి భూసేక‌ర‌ణకు తీవ్రంగా నిధుల కొర‌త ఉంద‌ని సీఎం రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రూ. 6 వేల కోట్ల అంచ‌నాల‌తో మొద‌లుపెట్టిన దేవాదుల ఇవాళ రూ. 18,500 కోట్లు అవ‌స‌ర‌మైన స్థితికి చేరుకున్న‌ద‌ని సీఎం పేర్కొన్నారు. ములుగు జిల్లాలోని దేవాదుల ప్రాజెక్టును సంద‌ర్శించిన అనంత‌రం ఇంజినీర్ల‌తో సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. అనంత‌రం సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌సంగించారు.

గోదావరి జలాల వివాదం కొన్నాళ్లుగా రాజకీయరంగు పులుముకుంది. గడిచిన పదేళ్లలో ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే ఇప్పుడు వివాదమే ఉండేది కాదు. ఉత్తర తెలంగాణను సస్యశ్యామల చేసే సమయంలో ఆరోపణలు, అబద్ధాల ప్రచారాల వల్ల ప్రయోజనం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఎదురుకొన్నాం. అప్పుడే ప్రాజెక్టులు పూర్తి చేస్తే బాగుండేది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయి. నిధులు, నీళ్లు, నియామ‌కాలు అనే ట్యాగ్‌లైన్‌తో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది.

దేవాదుల ప్ర‌స్తుత అంచ‌నా రూ. 18,500 కోట్లు..

గ‌త ప‌దేళ్ల‌లో చిత్తశుద్ధితో ప్రాణహిత, ఎస్సారెస్పీ, దేవాదుల లాంటి ప్రాజెక్టులు పూర్తి చేసి 967 టీఎంసీల‌ వాటాను వినియోగించుకుంటే బాగుండేది. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు మీదే రూ.1.10 లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. ఒక్క ప్రాజెక్టు మీదే రూ.1.10 లక్షల కోట్లు ఖర్చు చేసి మిగతా వాటిని పట్టించుకోలేదు. గోదావరి పైన కాళేశ్వరం తప్ప మిగిలిన ప్రాజెక్టులను పట్టించుకోలేదు. 2001లో దేవాదులకు చంద్రబాబు శంకుస్థాపన చేస్తే ఇప్పటికీ నిర్మాణం కొనసాగుతుంది. చిత్త‌శుద్ధితో నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తున్నా మాకు నిధుల కొరత ఉంది. రూ. 8.11 లక్షల కోట్ల అప్పుల‌ భారం తెలంగాణపైన ఉంది. రెండేళ్ల‌లో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ప్రాజెక్టుల‌ను పూర్తి చేయాల‌న్న చిత్త‌శుద్ధి మాకు ఉంది. దేవాదుల ప్రాజెక్టు పూర్తికి సత్వరమే నిధులు మంజూరు చేస్తాం. రూ. 6000 కోట్ల అంచనాలతో మొదలైన దేవాదుల ఇప్పుడు రూ. 18,500 కోట్లకు చేరింది. అన్ని ప్రాజెక్టులపై సమగ్ర సమీక్ష చేసి అన్నింటినీ పూర్తి చేయాలని నిర్ణయించాం అని సీఎం తెలిపారు.

ఏపీకి సహకరిస్తున్నామనేది పూర్తిగా అసంబద్ధం..

పదేళ్ల అనుభవంతో వాళ్లు సూచనలు చేస్తే.. మేం స్వీకరిస్తాం. కాళేశ్వరం కింద నీరు ఎత్తిపోయనప్పటికీ రాష్ట్రంలోనే అత్యధికంగా వరి దిగుబడి వస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో, తర్వాత తెలంగాణలో ఏం జరిగిందో చర్చించాం. కేసీఆర్‌, హరీశ్‌రావు తప్పులు చేశారని ప్రజలు గ్రహించారు, తీర్పు ఇచ్చారు. పదేళ్లు వాళ్లేం చేశారో.. ఈ ప్రభుత్వం ఏ చేసిందో సభలో చర్చిద్దాం. పదేళ్ల అనుభవంతో వాళ్లు సూచనలు చేస్తే.. మేం స్వీకరిస్తాం. జలాల విషయంలో ఏపీకి సహకరిస్తున్నామనేది పూర్తిగా అసంబద్ధం. ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు చేద్దాం.. ప్రజలు, నీళ్ల విషయంలో కాదు. పలు ఎన్నికల్లో తీర్పు చూసిన తర్వాతైనా బీఆర్‌ఎస్‌ నేతలు మారకపోవటం విచారకరం. బీఆర్‌ఎస్‌కు మళ్లీ ఓటు వేయకపోవడమే ప్రజల తప్పనట్లుగా వారు వ్యవహరిస్తున్నారు. ఓటు వేసిన ప్రజలను బహిష్కరించినట్లు చేయటం సరికాదు. ప్రజలను తప్పుపట్టడం మానేసి.. విజ్ఞతగా వ్యవహరించాలి అని సీఎం రేవంత్ అన్నారు.

గోదావరి జలాలపైన ఒక రోజు చర్చ చేద్దాం..

తుమ్మిడిహట్టి నుంచి భద్రాచలం వరకు గోదావరిపైన ఉన్న అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. రెండేళ్ల‌ల్లో కాళేశ్వరం నుంచి చుక్క నీరు ఎత్తి పోయకున్నా వరి దిగుబడిలో తెలంగాణ నెంబర్ వన్‌గా నిలబడింది. గత ప్రభుత్వం కల్పించినవి అన్ని భ్రమలే అని తేలిపోయింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఎందుకు నిర్మించారో మేము ఇప్పుడు విమర్శలు చేయడం లేదు. కృష్ణా నది జలాలపైన అపోహలు సృష్టించారు. అసెంబ్లీలో చర్చ పెట్టి అన్నిటికీ సమాధానం ఇచ్చాం. వాళ్ల తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఆరోపణలు చేస్తే సమాధానం ఇచ్చాం. వాళ్లలో మార్పు వస్తుందని ఆశించాం.. కానీ అది జరగలేదు. గోదావరి జలాలపైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఒక రోజు చర్చ చేద్దాం. 10 ఏళ్ల పరిపాలన అనుభవం, సాధించిన‌ విజయాలు, మా తప్పిదాలు ఏంటో వాళ్లు చెప్పాలి. రెండేళ్ల‌ పాలనలో మా తప్పిదాలు ఉంటే సవరించుకుంటామ‌ని సీఎం అన్నారు.

పక్క రాష్ట్రాలతో చర్చలకు ఎలాంటి భేషజాలు లేవు..

పక్క రాష్ట్రానికి నీళ్లు తరలించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని అంటున్నారు. తెలంగాణలో పోటీ చేసి ప్రజా ప్రతినిధి అయిన వారెవ‌రైనా ఏపీకి సహకరిస్తారా? చవకబారు ఆరోపణల వల్ల ప్రయోజనం లేదు. మాకు భేషజాలు లేవు.. సలహాలు స్వీకరిస్తాం. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు. అసెంబ్లీ, లోకసభ, ఉప ఎన్నిక‌లు, స‌ర్పంచ్‌, మున్సిపాలిటీ ఎన్నిక‌ల్లో ప్ర‌జా తీర్పు వ‌చ్చింది. అయినా కూడా వారిలో మార్పు రాలేదు. ప్ర‌జ‌లు త‌ప్పు చేశార‌న్న భావ‌న‌లోనే మాట్లాడుతున్నారు. ఎంత జ‌ఠిల‌మైన స‌మ‌స్య‌కైనా చ‌ర్చ‌ల‌తోనే ప‌రిష్కారం దొరుకుతుంది. చర్చల ద్వారా పరిష్కారం కాకపోతే న్యాయస్థానాలు ఉన్నాయి. పక్క రాష్ట్రాలతో చర్చలకు ఎలాంటి భేషజాలు లేవు. ప్రతి పొలానికి సాగు నీరు, ప్రతి పౌరుడికి తాగు నీరు అందిచడమే లక్ష్యమ‌ని రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు.

కాళేశ్వ‌రంను మ‌ళ్లీ వినియోగంలోకి తెస్తాం..

గోదావరి జలాల్లో తెలంగాణ హక్కుల్ని కాపాడుకుంటాం. నికర, వరద జలాల్లో హక్కులను వదులుకోము. కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన నిపుణుల కమిటీ ఏర్పాటు చేశాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిరుపయోగం కానివ్వం. భూమి లోపల ఎలాంటి మార్పులు వచ్చేయో ఏజెన్సీలు పరిశీలిస్తున్నవి. భవిష్యత్‌లో ఎలాంటి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కాళేశ్వరం వాళ్ల సొంత ఆస్తి కాదు.. ప్రజల సొమ్ము.. గాలికి వదిలేయం... మళ్లీ ఉపయోగంలోకి తీసుకువ‌స్తామ‌ని సీఎం రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

2034 వరకు అధికారం మాదే..

కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కూడా ప్రజలు మరో అవకాశం ఇస్తారు. సీఎం కుర్చీ ప్రతిసారి వారసత్వంగా వచ్చేది కాదు. టీడీపీ, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌కు వరసగా రెండుసార్లు చొప్పున ప్రజలు అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కూడా ప్రజలు మరో అవకాశం ఇస్తార‌ని సీఎం ధీమా వ్య‌క్తం చేశారు.

కేసీఆర్ ఆరోగ్యం కాపాడుకోవాలి..

కేసీఆర్ ఆరోగ్యం కాపాడుకోవాలి..చింత వద్దు. కేసీఆర్ వాకింగ్, యోగా చేయాలి. మంచి పుస్తకాలు చదవాలి.. అప్పుడ‌ప్పుడు చిన జీయర్ స్వామి సూక్తులు, ప్రవచనాలు వినాలి. ప్రజల పైన విషం కక్కే ప్రయత్నం చేయొద్దు అని సీఎం రేవంత్ సూచించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement