త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Food Safety | పాలకొవ్వు, తేమ శాతంతో.. అసలైన నెయ్యిని గుర్తు పట్టొచ్చు : ఫుడ్ సేఫ్టీ క‌మిష‌న‌ర్ సంగీత స‌త్య‌నారాయ‌ణ‌

Food Safety | నెయ్యి స్వచ్ఛతను పాలకొవ్వు, తేమ శాతంతో సులభంగా గుర్తించవచ్చని ఫుడ్ సేఫ్టీ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ తెలిపారు. నెయ్యిలో ఇతర కొవ్వులు, పామాయిల్, వనస్పతి వంటి పదార్థాలను కలపడం నిషేధమని, కల్తీ నెయ్యి తయారీ, విక్రయాలపై రాష్ట్రవ్యాప్తంగా కఠిన చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు.

P

Telangana | Published On Jul 17, 2026, 9.30 pm IST

Food Safety | పాలకొవ్వు, తేమ శాతంతో.. అసలైన నెయ్యిని గుర్తు పట్టొచ్చు : ఫుడ్ సేఫ్టీ క‌మిష‌న‌ర్ సంగీత స‌త్య‌నారాయ‌ణ‌
Advertisement

Food Safety | నెయ్యి స్వచ్ఛతను పాలకొవ్వు, తేమ శాతంతో సులభంగా గుర్తించవచ్చని ఫుడ్ సేఫ్టీ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ తెలిపారు. నెయ్యిలో ఇతర కొవ్వులు, పామాయిల్, వనస్పతి వంటి పదార్థాలను కలపడం నిషేధమని, కల్తీ నెయ్యి తయారీ, విక్రయాలపై రాష్ట్రవ్యాప్తంగా కఠిన చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో కల్తీ నెయ్యి తయారీ, విక్రయాలపై ఫుడ్ సేఫ్టీ విభాగం ప్రత్యేక దృష్టి సారించింది. పోలీసుల సమన్వయంతో ఈ నెల 14, 15 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో పలు ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చినట్లు కమిషనర్ తెలిపారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో కొన్ని లైసెన్స్ పొందిన సంస్థలు తయారు చేస్తున్న నెయ్యిలో ఇతర కొవ్వులు కలిపినట్లు ప్రాథమికంగా గుర్తించారు. మరికొన్ని సంస్థలు ఎలాంటి లైసెన్స్, రిజిస్ట్రేషన్ లేకుండానే నెయ్యి తయారీ, విక్రయాలు చేస్తున్నట్లు తేలింది.

ఆయా సంస్థల నుంచి సేకరించిన నెయ్యి నమూనాలను పరీక్షల కోసం ప్రయోగశాలలకు పంపించారు. నివేదికల ఆధారంగా బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనల ప్రకారం.. నెయ్యిలో కనీసం 99.5 శాతం పాల కొవ్వు ఉండాలి. తేమ శాతం 0.5 శాతానికి మించకూడదు. నెయ్యిలో పామాయిల్, వనస్పతి వంటి వృక్షజన్య కొవ్వుల కల్తీని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టం–2006 నిషేధిస్తుందని కమిషనర్ వివరించారు. హైదరాబాద్ క్యూర్ ప్రాంతంలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 14 సంస్థలను పరిశీలించారు. 15 నెయ్యి నమూనాలను సేకరించగా, వినియోగానికి పనికిరాదని గుర్తించిన 60 కిలోల నెయ్యిని అక్కడికక్కడే ధ్వంసం చేశారు. మరో 850 కిలోల అనుమానాస్పద కల్తీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు.

రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో చేపట్టిన తనిఖీల్లో 65 సంస్థలను పరిశీలించి, మొత్తం 91 నెయ్యి నమూనాలను పరీక్షలకు పంపించారు. నిబంధనలు ఉల్లంఘించిన ఐదు సంస్థలకు నోటీసులు జారీ చేసినట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. వినియోగదారులు నెయ్యి కొనుగోలు చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సంగీత సత్యనారాయణ సూచించారు. విశ్వసనీయ సంస్థల నుంచి మాత్రమే నెయ్యి కొనుగోలు చేయాలని, ప్యాకెట్‌పై ఉన్న ఫ‌సాయ్ (FSSAI) లైసెన్స్ నంబర్, తయారీ వివరాలను పరిశీలించాలని సూచించారు. కొనుగోలు బిల్లులను భద్రంగా ఉంచుకోవాలని, కల్తీపై అనుమానం ఉంటే వెంటనే ఫుడ్ సేఫ్టీ విభాగానికి ఫిర్యాదు చేయాలని కోరారు.

Advertisement
Advertisement