త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kondagattu | 60 ఏండ్ల‌ తర్వాత అరుదైన వేడుక.. కొండ‌గ‌ట్టులో ఈ నెల 16 నుంచి చంద‌నోత్స‌వం..

Kondagattu | రాష్ట్రంలో ప్ర‌ముఖ క్షేత్రం కొండ‌గ‌ట్టు (Kondagattu) ఆంజ‌న్న ఆల‌యం అరుదైన వేడుక‌కు సిద్ధ‌మ‌వుతున్న‌ది. 60 ఏండ్ల త‌ర్వాత అంజ‌న్న‌కు చంద‌నోత్స‌వం (Chandanotsavam) నిర్వ‌హిస్తున్నారు. ఐదు రోజులపాటు జ‌రుగ‌నున్న ఉత్స‌వాల‌కు ఈ నెల 15న శ్రీకారం చుట్ట‌నున్నారు.

G

Telangana | Published On Nov 12, 2026, 7.27 am IST

Kondagattu | 60 ఏండ్ల‌ తర్వాత అరుదైన వేడుక.. కొండ‌గ‌ట్టులో ఈ నెల 16 నుంచి చంద‌నోత్స‌వం..
Advertisement

Kondagattu | త్రినేత్ర న్యూస్‌: రాష్ట్రంలో ప్ర‌ముఖ క్షేత్రం కొండ‌గ‌ట్టు (Kondagattu) ఆంజ‌న్న ఆల‌యం అరుదైన వేడుక‌కు సిద్ధ‌మ‌వుతున్న‌ది. 60 ఏండ్ల త‌ర్వాత అంజ‌న్న‌కు చంద‌నోత్స‌వం (Chandanotsavam) నిర్వ‌హిస్తున్నారు. ఐదు రోజులపాటు జ‌రుగ‌నున్న ఉత్స‌వాల‌కు ఈ నెల 15న శ్రీకారం చుట్ట‌నున్నారు. న‌వంబ‌ర్ 16 నుంచి 20 వ‌ర‌కు చంద‌నం తొల‌గింపు ప్ర‌క్రియ జ‌రుగుతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్ప‌టికే పూర్త‌య్యాయి. దాదాపు 500 ఏండ్ల‌ చరిత్ర కలిగిన కొండగట్టు ఆలయం గత 35 ఏండ్ల‌లో అభివృద్ధి చెందింది. గతంలో గర్భగుడిలోని స్వామివారి మూలవిరాట్‌ను ప్రతి శనివారం చందనంతో అలంకరించడంతో విగ్రహంపైన పూత మందం పెరిగింది. 1965లో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి తొలగించారు. అప్పట్లో మొదటిసారిగా స్వామివారి నిజరూపాన్ని దర్శించుకున్న అర్చకులు ఓ చిత్రకారుడితో ఆకారాన్ని గీయించారు.

చంద‌నం ఇలా తొల‌గిస్తారు..

స్వామివారికి ఉన్న చంద‌నాన్ని పంచ లోహాలతో తయారు చేయించిన రెండు సరాతాలకు బంగారు, వెండి తాపడం చేయించి వాటితో తొలగిస్తారు. దేవతా వృక్షాలుగా భావించే మామిడి, జువ్వి, మర్రి, రావి, మేడి వృక్షాల కలపతో తయారు చేయించిన పనిముట్లను ఉపయోగిస్తారు. ఈ ప్రక్రియ పూర్తి కాగానే కృష్ణా, గంగ, తుంగభద్ర, కావేరి, గోదావరి నదులతో పాటు సముద్రం నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలాలతో స్వామివారికి అభిషేకం (Kondagattu Anjanna) నిర్వహిస్తారు. ఆలయ సంప్రోక్షణ అనంతరం ఈ నెల 21 నుంచి స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. ఐదు రోజుల‌పాటు జ‌రుగ‌నున్న ఈ క్ర‌తువులో బెంగళూరు, విజయవాడకు చెందిన ఇద్దరు జియ్యంగార్లు రానుండగా 40 మంది రుత్వికులు, 20 మంది అర్చకులు, నలుగురు వేదపండితులు, 10 మంది పాచకులు, పరిచారులు పూజలు, హోమాల్లో పాల్గొంటారు.

బాలాలయంలో..

చందనం తొలగింపు ప్రక్రియ సందర్భంగా ఈ నెల 16 నుంచి 20 వరకు గర్భగుడి తలుపులు మూసివేస్తారు. ఆ సమయంలో భక్తులు దర్శించుకునేందుకు వీలుగా కలపతో తయారు చేయించిన 4 అడుగుల ఎత్తున్న స్వామివారి విగ్రహాన్ని గర్భగుడి ద్వారం ముందు ఉంచుతారు. 21 నుంచి డిసెంబర్‌ 28 వరకు కేవలం స్వామివారి పాదాలకు మాత్రమే చందనం పూయనుండగా 29న తొలి విడత పూర్తి స్థాయిలో చందనంతో అలంకరణ ఉంటుందని అర్చకులు తెలిపారు.

Advertisement
Advertisement