త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vakiti Srihari | పాడి రైతుల క‌ష్టాలు నాకెరికే.. ఇక 15 రోజుల‌కోసారి బిల్లులు చెల్లిస్తం

Vakiti Srihari | చిన్నప్పటి నుంచి పాడి పరిశ్రమ వాతావరణంలో పెరిగిన వ్యక్తిగా పాడి రైతుల కష్టసుఖాలు నాకు బాగా తెలుసని మంత్రి వాకిటి శ్రీ‌హ‌రి పేర్కొన్నారు. ఇక నుంచి 15 రోజులకోసారి బిల్లులు చెల్లించేలా కృషి చేస్తామ‌న్నారు. వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని స్పష్టం చేశారు.

S

Telangana | Published On Jul 5, 2026, 7.21 pm IST

Vakiti Srihari | పాడి రైతుల క‌ష్టాలు నాకెరికే.. ఇక 15 రోజుల‌కోసారి బిల్లులు చెల్లిస్తం
Advertisement
  • విజ‌య డెయిరీ ప్ర‌జ‌ల సొత్తు.. దాన్ని మ‌రింత బ‌లోపేతం చేస్తం
  • రాష్ట్రంలో రోజుకు మ‌రో 25 ల‌క్ష‌ల లీట‌ర్ల పాలు అవ‌స‌రం
  • షాద్‌నగర్ పాల శీతలీకరణ కేంద్రం స్వర్ణోత్సవాల్లో మంత్రి వాకిటి శ్రీహరి

Vakiti Srihari | త్రినేత్ర‌.న్యూస్‌: చిన్నప్పటి నుంచి పాడి పరిశ్రమ వాతావరణంలో పెరిగిన వ్యక్తిగా పాడి రైతుల కష్టసుఖాలు నాకు బాగా తెలుసని మంత్రి వాకిటి శ్రీ‌హ‌రి పేర్కొన్నారు. ఇక నుంచి 15 రోజులకోసారి బిల్లులు చెల్లించేలా కృషి చేస్తామ‌న్నారు. వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని స్పష్టం చేశారు. విజయ డెయిరీ రాష్ట్ర ప్రజల సొత్తన్నారు. దాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో రోజుకు మరో 25 లక్షల లీటర్ల పాల అవసరం ఉందని చెప్పారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలో తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ (TDDCF) ఆధ్వర్యంలో నిర్వహించిన షాద్‌నగర్ పాల శీతలీకరణ కేంద్రం 60 సంవత్సరాల స్వర్ణోత్సవాల్లో ఆయ‌న‌ ముఖ్య అతిథిగా మాట్లాడారు.

మిగ‌తా రైతుల‌తో పోలిస్తే పాడి రైతులు వేకువ జామునే లేచి ఎంతో శ్ర‌మిస్తారు. భవిష్యత్ తరాలకు నాణ్యమైన పాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. దేశవ్యాప్తంగా విజయ డెయిరీ ప్రస్తుతం ఐదో స్థానంలో నిలవడం గర్వకారణం. రాష్ట్రంలోనే పాల ఉత్పత్తిని పెంచి ఇతర రాష్ట్రాల నుంచి పాలు కొనుగోలు చేసే పరిస్థితిని పూర్తిగా నివారిస్తాం. పాడి పరిశ్రమ రంగంలో సమూల మార్పులు తీసుకొస్తాం అని మంత్రి వాకిటి స్పష్టం చేశారు.

త‌లెత్తుకొని జీవించేలా చేస్తం..

పాడి రైతులకు బిల్లులు సకాలంలో చెల్లించే విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటాం. వారికి రుణాలు, ఇతర సౌకర్యాల విషయంలో ఇప్పటికే బ్యాంకులతో చర్చలు జరిపాం. బయట కనిపించే లాభాల కంటే లోపల ఉండే కష్టాలు ఎక్కువ. అన్ని విధాలుగా ఆదుకుంటాం. వారు తలెత్తుకొని జీవించేలా పాడి పరిశ్రమను తీర్చిదిద్దుతాం అని మంత్రి శ్రీహరి వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, తెలంగాణ లైవ్‌స్టాక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ చైర్మన్ చరణ్ కౌశిక్ యాదవ్, షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డా. గోపి, తెలంగాణ డెయిరీ డెవలప్‌మెంట్ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, పాల ఉత్పత్తిదారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement