త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారంగా మూసీ ప్రాజెక్టు.. కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

KTR | మూసీ ప్రాజెక్టు మొత్తం రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారంగా మారింద‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష స‌భ్యులు సంధిస్తున్న ప్ర‌శ్న‌ల‌కు మంత్రులు స‌మాధానం చెప్ప‌లేక దాట‌వేసే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ఆయ‌న నిప్పులు చెరిగారు.

S

Telangana | Published On Mar 18, 2026, 3.22 pm IST

KTR | రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారంగా మూసీ ప్రాజెక్టు.. కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Advertisement

KTR | త్రినేత్ర‌.న్యూస్ : మూసీ ప్రాజెక్టు మొత్తం రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారంగా మారింద‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష స‌భ్యులు సంధిస్తున్న ప్ర‌శ్న‌ల‌కు మంత్రులు స‌మాధానం చెప్ప‌లేక దాట‌వేసే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ఆయ‌న నిప్పులు చెరిగారు. అసెంబ్లీలో కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ చేశారు.

  • ఏడీబీ రుణంపై మంత్రి శ్రీధర్ బాబు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. డీపీఆర్ ఇచ్చామని చెప్తున్నప్పటికీ వాస్తవానికి డీపీఆర్ సమర్పించకపోవడంతోనే ఏడీబీ రుణం మంజూరు కాలేదు. “పైసా ఇచ్చినోడు లేడు, డీపీఆర్ లేదు” అని స్పష్టం చేశారు.
  • మూసీ ప్రాజెక్ట్ విషయంలో అధికారులు అతిగా ప్రవర్తిస్తున్నారని, “ఆరు నూరైనా పూర్తి చేస్తాం” అనే వ్యాఖ్యలు చేయడం వారి అధికార పరిధికి మించినదని అన్నారు. ప్రభుత్వ అక్రమాలకు తలొగ్గే అధికారులకు భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. సభను తప్పుదోవ పట్టించినందుకు మంత్రిపై సభ హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామని తెలిపారు.
  • మూసీ ప్రాజెక్ట్‌కు తమకు వ్యతిరేకత లేదని, కానీ దాని పేరిట జరుగుతున్న లూటీకి మాత్రమే వ్యతిరేకమని కేటీఆర్ స్పష్టం చేశారు. 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రజలకు కూడా నోటీసులు ఇస్తూ, వేలాది కుటుంబాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. 3297 ఎకరాలకు నోటిఫికేషన్ ఇచ్చి 10 వేల ఇళ్లను లక్ష్యంగా పెట్టుకుని, ఇప్పుడు 1400 ఇళ్లు మాత్రమే అంటున్నారని, ఇది పూర్తిగా ప్రజలను మోసం చేసే ప్రక్రియ అని అన్నారు. మధు పార్క్ కోసం ప్రత్యేకంగా ఇళ్లు ఇస్తామని ఎందుకు చెప్తున్నారు? మిగతా వారికి ఎందుకు ఇవ్వరు?
  • “ఇది సర్కార్ కాదు, సర్కస్” అని వ్యాఖ్యానిస్తూ, అధికార యంత్రాంగం నియంత్రణ తప్పిందని కేటీఆర్ అన్నారు. “కుక్క తోకను ఆడించటం కాదు, తోక కుక్కను ఆడించినట్టు వ్యవహారం జరుగుతోంది” అంటూ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు.
  • భూ సేకరణను ఫార్మా సిటీ పేరిట చేసి, ఇప్పుడు రియల్ ఎస్టేట్ కంపెనీలకు, ఇతరులకు ఇవ్వాలనే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. కాలుష్యం వెదజల్లే ప్రాజెక్టుల మధ్య ప్రజలను ఎలా నివసింపజేస్తారని ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళనకు, ఫార్మా సిటీకి శ్రీకారం చుట్టింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, STPలు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించిన ఘనత కేసీఆర్‌ది అని గుర్తుచేశారు.
  • గవర్నర్ ప్రసంగంలో కూడా అసత్యాలు ఉన్నాయని, 57 వేల కోట్ల రుణాల అంశంపై ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు. నిజంగా ఆ రుణాలు ఇచ్చినట్టు ఆధారాలు చూపిస్తే తాను ఖచ్చితంగా రాజీనామా చేస్తానని మరోసారి పునరుద్ఘాటించారు.
  • తాజ్ కృష్ణలో నిర్వహించిన PPT కార్యక్రమానికి రాలేదని విమర్శించడం అనవసరమని, తాము నేరుగా ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నామని తెలిపారు. వెలుగుమట్ల వంటి ప్రాంతాల్లో ప్రభుత్వ పెద్దలు ఎందుకు వెళ్లి చూడలేదని ప్రశ్నించారు. మధు పార్క్‌కు మాత్రమే ప్రత్యేకంగా పునరావాసం ఇస్తామని చెప్పడం వెనుక ఉద్దేశం ఏమిటో వివరించాలని డిమాండ్ చేశారు.
  • Meinhart అనే కంపెనీని భారత్‌లోనే నిషేధించారని, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా బ్యాన్ చేసిన సంస్థను ఎందుకు ఎంపిక చేస్తున్నారని ప్రశ్నించారు. పాకిస్తాన్‌లో పనికిరాని కంపెనీ మనకు ఎలా పనికివస్తుందని అన్నారు.
  • ఆరు గ్యారంటీల అమలుకు డబ్బులు లేవని చెబుతున్న ప్రభుత్వం, మూసీ ప్రాజెక్ట్‌కు లక్షన్నర కోట్లు ఎలా సమీకరిస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ డబ్బులను ప్రజలకు ఇచ్చే గ్యారంటీలకు వినియోగిస్తే మేలని సూచించారు.
  • హనుమాన్ నగర్ వంటి ప్రాంతాల్లో బఫర్ జోన్ పేరిట దూర ప్రాంతాల ప్రజలకు నోటీసులు ఇవ్వడం అన్యాయమని పేర్కొన్నారు. పొంగులేటి, వివేక్, గుత్తా సుఖేందర్ రెడ్డి వంటి నేతల ఇళ్లు కూడా అదే జోన్‌లో ఉన్నాయని, రేవంత్ రెడ్డి సోదరుడి ఇల్లు FTLలో ఉందని ఆరోపించారు.
  • మూసీ ప్రాజెక్ట్ మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మారిందని, “గాంధీ సరోవర్, రాహుల్ గాంధీ సరోవర్ పేర్లతో కొత్త నాటకాలు ఆడుతున్నారా?” అని ప్రశ్నించారు.
  • అమీన్‌పూర్‌లో కూల్చివేసిన ఇళ్లకు హైకోర్టు స్టే ఇచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ప్రభుత్వం చట్టవ్యతిరేక చర్యలు చేపడుతోందని అన్నారు.
  • అసెంబ్లీలో డ్రగ్స్ టెస్ట్ చేయమని తాము సవాల్ విసిరినా ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు. తమ పార్టీకి చెందిన వారిపై ఆరోపణలు వచ్చినా విచారణకు సిద్ధమని, కానీ అధికార పార్టీ మాత్రం తప్పించుకుంటోందని అన్నారు.
  • మా పార్టీ బీ ఫాం మీద గెలిచిన వారికి క్లీన్ చిట్ ఇచ్చారు. మమ్మల్ని తిడితే కూడా ఖండించలేదు. అలాంటప్పుడు కేసీఆర్ గారు అసెంబ్లీకి ఎందుకు వస్తారు? మాకే ప్రభుత్వం తట్టుకోవడం లేదు. కేసీఆర్‌ను ఎలా తట్టుకుంటారు?
  • పొంగులేటి కుమారుడు కబ్జాలు చేసిన ఘటనలో సంబంధిత అధికారిని బదిలీ చేయడం ప్రభుత్వం వైఖరిని చూపుతుందని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో అవినీతి రోజురోజుకు బయటపడుతోందని, ఇంకా ఎన్నో విషయాలు వెలుగులోకి రావాల్సి ఉందని కేటీఆర్ పేర్కొన్నారు.
  • మొత్తంగా, మూసీ ప్రాజెక్ట్ పేరుతో భారీ అవినీతి, ప్రజల భూముల దోపిడీ జరుగుతోందని కేటీఆర్ ఆరోపిస్తూ, ప్రభుత్వం వెంటనే పారదర్శకంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.
Advertisement

తాజావార్తలు

Advertisement